రొమేనియా, హంగేరికి బయలుదేరిన ఐఏఎఫ్ విమానాలు

ABN , First Publish Date - 2022-03-02T17:21:04+05:30 IST

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారత వైమానిక దళానికి (ఐఏఏఫ్) చెందిన విమానాలను..

రొమేనియా, హంగేరికి బయలుదేరిన ఐఏఎఫ్ విమానాలు

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం భారత వైమానిక దళానికి (ఐఏఏఫ్) చెందిన విమానాలను రంగంలోకి దింపింది. హిండాన్ ఎయిర్ బేస్ నుంచి రొమేనియా, హంగేరికి రెండు ఐఏఎఫ్ విమానాలు బుధవారం ఉదయం బయలుదేరి వెళ్లాయి. ఏసీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానం తెల్లవారుజామున 4 గంటలకు రొమేనియా బయలు దేరింది. ఉక్రెయిన్‌లో మానవ సహాయ చర్యలకు అవసరమైన సామగ్రిని కూడా ఇందులో పంపించారు. తిరుగు ప్రయాణంలో అక్కడి భారత విద్యార్థులను తీసుకురానున్నారు. ఈ రవాణా విమానం ద్వారా 300 మంది విద్యార్థులను ఒకేసారి తరలించవచ్చు.


కాగా, అపరేషన్ గంగ కార్యక్రమంలో భాగంగా గత 24 గంటల్లో 6 విమానాలు భారత్‌కు బయలుదేరాయని, ఒక్కరోజే 1377 మంది భారత పౌరులను ఉక్రెయిన్ నుంచి భారత్‌కు తరలించామని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ బుధవారంనాడు ఒక ట్వీట్‌లో తెలిపారు. రాబోయే మూడు రోజుల్లో మరో 26 విమానాల ద్వారా భారతీయులను స్వదేశానికి తెస్తామని విదేశాంగ కర్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా చెప్పారు.

Updated Date - 2022-03-02T17:21:04+05:30 IST