ఐఏబీ వాయిదా!

ABN , First Publish Date - 2020-10-24T11:25:43+05:30 IST

రబీలో సాగుకు ఎప్పటి నుంచి నీరు విడుదల చేయాలన్న విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రాజెక్టులు, ..

ఐఏబీ వాయిదా!

27న లేనట్టుగా ప్రకటించిన అధికారులు

నీరున్నా రైతులకు తప్పని ఎదురుచూపు

ఆలస్యమయ్యే కొద్దీ దిగుబడి, మార్కెట్‌పై ప్రభావం


 నెల్లూరు (ఆంధ్రజ్యోతి), అక్టోబరు 23 : రబీలో సాగుకు ఎప్పటి నుంచి నీరు విడుదల చేయాలన్న విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉన్నా రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. సాగునీటి సలహా మండలి (ఐఏబీ) ఏర్పాటు తేదీని ఖరారు చేయడంలో అధికారులు ఇబ్బందులు పడుతున్నట్లు అర్థమవుతోంది. ఈ నెల 27వ తేదీన ఐఏబీ నిర్వహణకు  అధికారులు నిర్ణయించారు. అదికూడా ఇప్పుడు వాయిదా పడింది. సమయం మించి పోతున్నా ఐఏబీ నిర్వహణకు  ఎందుకు ఆలస్యం జరుగుతోందన్నది అధికారులే స్పష్టం చేయాల్సి ఉంది. గతేడాది అక్టోబరు 23వ తేదీన ఐఏబీ నిర్వహించారు. అప్పటికే ఆలస్యమైందని రైతు సంఘాలు గగ్గోలు పెట్టాయి. ఇప్పుడు ఐఏబీ నిర్వహణకు ఎటువంటి అడ్డంకులు లేకున్నా ఎందుకు ఆలస్యం చేస్తున్నారన్నది అర్థం కావడం లేదు.


సోమశిలలో 75 టీఎంసీలు, కండలేరులో 57 టీఎంసీల వరకు నీరుంది. ఈ సంవత్సరం జిల్లాలో పూర్తిస్థాయి విస్తీర్ణంలో సాగు జరిగే అవకాశాలు ఉన్నాయి. సుమారు 8 లక్షల ఎకరాల్లో పంట సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. ఇంత పెద్ద విస్తీర్ణంలో సాగు ఒకేసారి జరిగితే అనేక ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుష్కలంగా నీరుంది కాబట్టి ఈ పాటికే అధికారులు సాగు నీటి కేటాయింపులు, విడుదలపై రైతులకు స్పష్టతను ఇచ్చి ఉంటే అందుకు తగ్గట్లుగా నార్లు పోసుకునేందుకు వీలుండేది. తద్వారా ఈ నెలలో కొంతవరకు నార్లు పోసేవారు. వచ్చే నెలలో మిగిలిన రైతులు నార్లు పోసుకుంటే వేసే పంట రకాన్ని బట్టి కోతలు రెండు నెలల వ్యవధిలో ఉంటాయి. దీంతో పంట ఉత్పత్తులు విక్రయాల సమయంలో ఇబ్బందులు ఉండవని నిపుణులు అంటున్నారు. అలాకాకుండా ఒకేసారి నవంబరులో రైతులంతా నార్లు పోస్తే కోతలు కూడా ఒకేసారి వస్తాయని, అప్పుడు ధాన్యం అమ్మకాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని గత అనుభవాలను గుర్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-10-24T11:25:43+05:30 IST