Abn logo
Mar 2 2021 @ 01:16AM

నేనొక జానపదుడినై రాశా!

‘‘జానపద వాక్యం అద్భుతంగా వచ్చిందంటే... అది శ్రీనాథుని కవితా వాక్యంతో సమానమని నేనెప్పుడూ చెబుతుంటా. కష్టజీవుల పాట కాళిదాసు శ్లోకంతో సమానం. ఇప్పుడూ అదే చెబుతున్నా. భారతదేశంలో గానీ, ప్రపంచంలో గానీ... జానపద స్ఫూర్తి, ప్రేరణ లేకుండా ఏ పాటా శిఖరంలా నిలబడలేదు. జానపద సొగసుతో ఉన్నతోన్నతమైన పాటలు వచ్చాయి. అందులో ఇదొక పాట అవుతుంది’’ అని సుద్దాల అశోక్‌ తేజ అన్నారు. అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌ స్టోరి’. దీని కోసం తెలంగాణ జానపద గీతం ‘సారంగ దరియా’కి ఆయన సరికొత్త సొగసులు అద్ది, తనదైన ముద్రతో అందించారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్‌ తేజతో ‘చిత్రజ్యోతి’ ప్రత్యేకంగా సంభాషించింది. ఈ గేయ రచన వెనుక సంగతులను ఆయన పంచుకున్నారిలా...


‘‘ఈ పాట రాయడానికి ముందు దర్శకుడు శేఖర్‌ కమ్ముల సూచించినది ఏంటంటే... ‘‘రేలారే’ కోమలి ‘సారంగ దరియా’ను సేకరించి మనకు అందించారు. పాటను పైకి తీసుకొచ్చారు. అందులోని తొలి నాలుగు వాక్యాలు తీసుకుని కొత్తగా రాయాలి సార్‌’ అని! ఈ తోవలో వెళ్లమని ఆయన చెప్పారు. కాబట్టి... దీంట్లో శేఖర్‌ కమ్ములగారి భాగస్వామ్యం ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఆ తర్వాత నా మథనం ప్రారంభమైంది. ఎందుకంటే... ‘ఫిదా’లో ‘వచ్చిండే’ పాట రాశా. దానికీ శేఖర్‌ కమ్ములే దర్శకుడు. అందులోనూ సాయిపల్లవి కథానాయిక. ఆ పాటను యూట్యూబ్‌లో సుమారు 30 కోట్లమంది వీక్షించారు. ఎంతో పేరు వచ్చింది. దాన్ని మించే పాట కావాలన్నారు శేఖర్‌ కమ్ముల. మన రికార్డును మనమే అధిగమించాలన్నారు. బ్రహ్మాండమైన పాటను టార్గెట్‌గా పెట్టుకుని రాయడమంటే కష్టమే కదా! ఆ సందర్భంలో నాకు వివేకానంద సూక్తి గుర్తొచ్చింది. ‘నువ్వు ప్రపంచాన్ని గెలవడం గొప్ప విషయం కాదు. నిన్ను నువ్వు గెలువు. అది పెద్ద విజయం’ అని అంటారాయన. మనల్ని మనమే జయించాలంటే ఏం చేయాలి? అని ఆలోచించి, మథనపడి రాసిన గీతమిది.


‘సారంగ దరియా’ తెలంగాణ జానపద గీతమే. నా చిన్నతనంలో మా అమ్మ ఆ పాట వినిపించింది. బహుశా... అప్పుడు పదో తరగతిలో ఉన్నాను. అమ్మ మరణించి ఎన్నో యేండ్లాయే. ఆ పాట మరుగున పడింది. నా స్మృతిపథంలోనూ లేదు. ఆ తర్వాత కోమలి నా ముందే ‘రేలారే’లో పాడింది. దానినే మళ్లీ శేఖర్‌ కమ్ముల రాయమన్నారు. నేను తెలంగాణలో పుట్టినవాణ్ణే. జానపదాల సముద్రంలో పుట్టుకొచ్చిన కవి కమలాన్ని కాబట్టి పదాల కోసం పెద్దగా వెతుక్కోలేదు. అయితే, తెలంగాణ జానపదంలోని పద బాహుళ్యం ఈ పాటలో మరుగున పడకూడదనేది నా ఉద్దేశం. ఎక్కడా నవీనత, నా పాండిత్యం కనపడకూడదని, అవన్నీ మర్చిపోయు... నేనొక జానపదుడినై రాశా.


ఈ పాటలో నేనొక ప్రయోగం చేశా. అదే... నిందాస్తుతి! తిట్టినట్టుగా, తీసేసినట్టుగా ఉంటుంది కానీ, అందులో పొగడ్త ఉంటుంది. ‘ఆదిభిక్షువును ఏం అడిగేది’ అని సీతారామశాస్త్రి రాశారు. ‘బూడిద నిచ్చేవాణ్ణి ఏం అడిగేది’ అని! అట్లాగే... ‘ఆమె కాళ్లకు గజ్జెలు లేవు, కొప్పులో మల్లెలు లేవు’ అని చెబుతూ ఆ లైన్లను అధిగమిస్తూ, కింద మరో అలంకారం రాశా. ‘దాని కాళ్లకు ఎండీ గజ్జెల్‌... లేకున్నా నడిస్తే ఘల్‌ ఘల్‌’, ‘దాని కొప్పులో మల్లె దండల్‌... లేకున్నా చెక్కిలి గిల్‌ గిల్‌’ అంటూ చరణం రాశా. నిందాస్తుతిలా, తీసేసినట్టు మాట్లాడుతూ... మళ్లీ పొగుడుతూ ఓ పద్ధతి పాటించా. పూర్వులు, పెద్దలు గొప్ప గొప్ప కావ్యాల్లో పాటించినటువంటి పద్ధతినీ, ‘సారంగ దరియా’ ఒరిజినల్‌లో లేనటువంటి కొత్త స్థితిని తొలి చరణంలో తీసుకొచ్చా.


‘పాండురంగ మహత్మ్యంలో’ ఓ అమ్మాయిని చూస్తూ తెనాలి రామకృష్ణుడు ‘ఆమె వెంట్రుకలు ఎంత నల్లగా ఉన్నాయంటే... అవి దులిపేస్తే చీకటి వస్తుంది’ అని రాశారు. ఆమె దులిపితే లోకం మొత్తం చీకటి వస్తుందని! అలాగే, ఈ పాట రెండో చరణంలో నేనేం చేశానంటే? ‘రంగేలేని నా అంగి... జడ తాకితే అయితది నల్లంగీ’ అని రాశా. అంగీకి రంగే లేదు. ఆమె జడ తాకి నల్ల అంగీ అయ్యిందని చెప్పాను. ఇంకొకటి... శేఖర్‌ కమ్ముల చిత్రాల్లో కథానాయిక పాత్రలను బలమైన వ్యక్తిత్వమున్న మహిళలుగా తీర్చిదిద్దుతారు. పైకి సాధారణంగా కనిపించినప్పటికీ... లోపల ధైర్యంగా ఉంటారు. ఆ లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని... ‘మర్లపడితే శివంగి, వాయించబోతే ఫిరంగి’ లైన్లు రాశా. శివంగి అంటే ఆడసింహమే కదా! శేఖర్‌ కమ్ముల చిత్రాల్లో కథానాయిక పాత్రల ఆత్మను రెండో చరణంలో పొందుపరిచా.


ఇంత కష్టపడి, ప్రయోగాత్మంగా రాసిన పాటకు విశేష ఆదరణ లభించడం సంతోషంగా ఉంది. ‘నేను అనుకున్నదానికంటే వెయ్యిరెట్లు బాగా రాశారు అశోక్‌ తేజగారు’ అని శేఖర్‌ కమ్ముల రాసిన వెంటనే చెప్పారు. అమెరికా నుంచి చాలామంది ఫోన్లు చేశారు. ఇండస్ట్రీ నుంచి దర్శకులు కృష్ణవంశీ, సంపత్‌ నంది సహా పలువురు ఫోన్లు చేశారు. వాళ్లతో పాటు యూట్యూబ్‌లో మిలియన్ల వీక్షణలు అందించిన విశేషమైన రసజ్ఞులైన తెలుగు బిడ్డలకు, శ్రోతలందరికీ తలవంచి చెబుతున్నా... ఇటువంటి పాటలు వెయ్యి రాసే శక్తినిచ్చారు. మీకు సదా కృతజ్ఞుణ్ణి. రసజ్ఞ హృదయులకు పాదాభివందనాలు.’’

Advertisement
Advertisement
Advertisement