సిద్ధూ పేరు ప్రకటించినా సపోర్ట్ చేస్తా: చన్నీ

ABN , First Publish Date - 2022-02-02T23:30:45+05:30 IST

పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఈ వారంలోనే కాంగ్రెస్ ప్రకటించనుండటంతో ఆ పదవిని ఆశిస్తున్న..

సిద్ధూ పేరు ప్రకటించినా సపోర్ట్ చేస్తా: చన్నీ

చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఈ వారంలోనే కాంగ్రెస్ ప్రకటించనుండటంతో ఆ పదవిని ఆశిస్తున్న పార్టీ ప్రముఖుల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ఈ రేసులో పీపీసీసీ చీఫ్ సిద్ధూ, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. పార్టీ అధికార అభ్యర్థిగా తన పేరు ప్రకటించాలని కోరుకుంటున్నట్టు సిద్ధూ చెబుతుండగా, చన్నీ మాత్రం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆచితూచి సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ సిద్ధూ పేరును సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే తాను మద్దతిస్తానని చెప్పారు.


''దీనిపై నేను చాలా సార్లు చెప్పాను. నేను ఎలాంటి పదవులు ఆశించడం లేదని రాహుల్ గాంధీతో పాల్గొన్న మీడియా సమావేశంలో కూడా చెప్పా. పంజాబ్ ప్రజలకు సేవ చేయాలన్నదే నా కోరిక. పంజాబ్‌ను ముందుకు తీసుకు వెళ్తాం. సీఎం అభ్యర్థిగా ఎవరి పేరును పార్టీ ప్రకటించినా నేను మద్దతిస్తా. సిద్ధూ పేరు ప్రకటించినా నా మద్దతుంటుంది'' అని చన్నీ స్పష్టం చేశారు.


అమృత్‌సర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి సిద్ధూ పోటీ చేస్తూ ముఖ్యమంత్రి కావాలనే ఆశలను పదిలం చేసుకోవాలనుకుంటున్నారు. చన్నీ తన సొంత నియోజకవర్గమైన భదౌర్‌తో పాటు చామ్‌కౌర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. దీనిపై చన్నీ మాట్లాడుతూ, పార్టీ అభిమతం మేరకే తాను రెండు చోట్ల పోటీ చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చెక్కుచెదర లేదని, విపక్షాల ఓటు బ్యాంకు మాత్రం చీలనుందని చెప్పారు. కాంగ్రెస్ చాలా సునాయాసంగా పెద్ద మార్జిన్‌తో గెలుపొందుతుందని చన్నీ ధీమా వ్యక్తం చేశారు.



Updated Date - 2022-02-02T23:30:45+05:30 IST