పార్టీ చీఫ్ విషయం పరిశీలిస్తా: రాహుల్

ABN , First Publish Date - 2021-10-16T22:16:02+05:30 IST

కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టాలంటూ సిడబ్ల్యూసీ సమావేశంలో వచ్చిన విజ్ఞప్తులపై రాహుల్ ..

పార్టీ చీఫ్ విషయం పరిశీలిస్తా: రాహుల్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టాలంటూ సిడబ్ల్యూసీ సమావేశంలో వచ్చిన విజ్ఞప్తులపై రాహుల్ స్పందించారు. సమావేశానంతరం మీడియా అడిగిన ప్రశ్నకు ఆయ స్పందిస్తూ,  ఆ విషయం పరీశీలిస్తానని చెప్పారు. పార్టీ నేతల నుంచి ముందు సైద్ధాంతిక స్పష్టత రావాలని, పార్టీ ఎన్నికలు జరిగే వరకూ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండాలని కొందరు నేతలు సమావేశంలో ప్రతిపాదించారని చెప్పారు.


దీనికి ముందు, న్యూఢిల్లీలోని అక్బర్ రోడ్డులో ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో శనివారం  సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. తాను పూర్తి కాలం పని చేసే, చురుగ్గా వ్యవహరించే కాంగ్రెస్ అధ్యక్షురాలినని సోనియా మాట్లాడుతూ పేర్కొన్నారు. స్వేచ్ఛగా, నిజాయితీగా నేతలందరూ కలిసి చర్చించుకుందామని, మీడియా ద్వారా తనతో మాట్లాడాల్సిన అవసరం పార్టీ నేతలకు లేదని చెప్పారు. కాంగ్రెస్‌కు పునర్వైభవం రావాలని పార్టీ నేతలంతా కోరుకుంటున్నారని, ఇందుకోసం సమష్టిగా, ఐకమత్యంతో పనిచేయాలని, స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ అవసరమని అన్నారు.


కాంగ్రెస్ చీఫ్ పదవికి రాహుల్ పేరును  అశోక్ గెహ్లాట్ ఈ సమావేశంలో ప్రతిపాదించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), భూపేష్ బాఘెల్ (ఛత్తీస్‌గఢ్), చరణ్‌జిత్ చన్ని (పంజాబ్) ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత ఏడాది సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది కాంగ్రెస్ నేతల్లో గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

Updated Date - 2021-10-16T22:16:02+05:30 IST