గోమతి నుంచి భానుమతినైపోయాను!

ABN , First Publish Date - 2021-06-21T09:10:54+05:30 IST

ఓ మధ్యతరగతి అమ్మాయి... చదువు అయిపోతూనే కుటుంబ బాధ్యతలు భుజానికెత్తుకుంది. కానీ నటి కావాలన్నది ఆమె ఆకాంక్ష. ఎలా వెళ్లాలి? ఎవరిని కలవాలి? శూన్యంలో నుంచి ఓ ప్రయత్నం. సడలని సంకల్పం. దానికి ప్రతిరూపమే నేటి గోమతి ప్రియా!

గోమతి నుంచి భానుమతినైపోయాను!

ఓ మధ్యతరగతి అమ్మాయి... 

చదువు అయిపోతూనే కుటుంబ బాధ్యతలు భుజానికెత్తుకుంది. 

కానీ నటి కావాలన్నది ఆమె ఆకాంక్ష. ఎలా వెళ్లాలి? ఎవరిని కలవాలి? 

శూన్యంలో నుంచి ఓ ప్రయత్నం. సడలని సంకల్పం. దానికి ప్రతిరూపమే నేటి గోమతి ప్రియా! 

‘హిట్లర్‌ గారి పెళ్లాం’గా తెలుగింటి ఆడపడచులకు దగ్గరైన ఆమె అనుభవం ‘నవ్య’కు ప్రత్యేకం


గోమతి ‘ప్రియం’ 

పుట్టింది మదురై...   ఇంజనీరింగ్‌ చెన్నై. 

 ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌లో తొలిసారి  కెమెరా ముందుకు 

తమిళంలో ‘ఓవియా’తో బుల్లితెరపై ఎంట్రీ  

‘హిట్లర్‌ గారి పెళ్లాం’లో భానుమతిగా తెలుగులో పరిచయం 

తమిళనాడులోనే స్థిరపడాలనేది ఆశయం 


కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. మరికొన్నింటితో రాజీ పడుతూ సాగిపోవాలి. ఇది నాకు అనుభవం నేర్పిన పాఠం. మాది అతి సాధారణ మధ్యతగతి కుటుంబం. తమిళనాడులోని మదురై సొంత పట్టణం. మా నాన్న సేల్స్‌ రిప్రజెంటేటివ్‌. ముగ్గురు సంతానంలో నేనే పెద్దదాన్ని. బాధ్యతలు పంచుకోవాల్సింది కూడా నేనే కదా! చదివితేనే జీవితం ఉంటుందని అర్థం చేసుకున్నాను. అందుకే చిన్నప్పటి నుంచి చదువుపైనే శ్రద్ధ పెట్టాను. పన్నెండో తరగతి వరకు మదురైలోనే. ఆ తరువాత చెన్నైలో ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌(2017)లో ఇంజనీరింగ్‌ చేశాను. నా చదువంతా స్కాలర్‌షి్‌పలపైనే! 


సరికొత్త అనుభూతి... 

ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఉండగా క్యాంపస్‌ ఇంటర్వ్యూలో సెలెక్ట్‌ అయ్యాను. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఏడాది పాటు పనిచేశాను. రోజూ పొద్దున్నే వెళ్లడం... కంప్యూటర్‌ ముందు కూర్చోవడం... ఇంటికి రావడం... మళ్లీ అదో కాలేజీ లైఫ్‌లా అనిపించింది. రొటీన్‌గా, ఏ మాత్రం ఆసక్తి లేకుండా సాగిపోతోంది. నాకు నచ్చలేదు. అదే సమయంలో ఓ రియాలిటీ షోలో మోడల్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. మొదటిసారి కెమెరా ముందు నిలుచున్నది అప్పుడే! ఫొటో షూట్స్‌, షూటింగ్స్‌ ఎలా ఉంటాయో కూడా తెలియదు. కానీ కెమెరా ముందుకు వెళ్లగానే సరికొత్త అనుభూతి.  


ఉద్యోగం వదిలేసి... 

మోడలింగ్‌ చేసిన తరువాత చుట్టూ ఉన్నవారంతా నన్ను ప్రత్యేకంగా చూడడం మొదలుపెట్టారు. అది నాకు నచ్చింది. నటనపై ఆసక్తి పెరిగింది. ‘ఓసారి ప్రయత్నించి చూద్దాం’ అనుకున్నాను. ఖాళీ సమయాల్లో మోడలింగ్‌ ఆడిషన్స్‌కు వెళుతూ ఉండేదాన్ని. చిన్న చిన్న యాడ్స్‌, ఫొటో షూట్స్‌ చేశాను. అయితే ఆఫీసులో పని వల్ల ఒక్కోసారి కుదిరేది కాదు. చివరకు ధైర్యం చేసి ఉద్యోగం వదిలేశాను. తరువాత ఆరు నెలలు చాలా కష్టపడ్డాను. నా ప్రయత్నమంతా నటి కావాలని. కానీ ఎక్కడికి వెళ్లాలి? ఎవర్ని కలవాలి? ఈ రంగం గురించి ఏమీ తెలియదు. మార్గనిర్దేశం చేసేవారూ లేరు. మరి ఎలా? కొన్ని రోజులు దానిపై కసరత్తు చేశాను. చాలా విషయాలు తెలుసుకున్నాను. ఎక్కడ ఆడిషన్స్‌ జరిగితే అక్కడ ఠక్కున వాలిపోయేదాన్ని. 


ఎన్నాళ్లో వేచిన రోజు... 

ఆరు నెలలు విరామం లేని నా ప్రయత్నం చివరకు ఫలించింది. తమిళంలో ఓ సినిమా కోసం నన్ను అడిగారు. హీరోయిన్‌ పాత్ర. వాళ్లే నటనలో శిక్షణ ఇచ్చారు. వర్క్‌షాప్‌ నిర్వహించారు. అయితే అనుకోకుండా ఆ చిత్రం ఆగిపోయింది. ఆ సమయంలో ‘అర్జున్‌రెడ్డి’ తమిళ్‌ రీమేక్‌ ‘ఆదిత్య వర్మ’లో నాకు ఓ వేషం ఇచ్చారు. చిన్న పాత్రే. అది ముఖ్యం కాదు. ఎన్నాళ్లో వేచి చూసింది ఈ రోజు కోసమే కదా! వెంటనే ఓకే అన్నాను. నటిగా తొలి అడుగు పడింది. 


భయం వేసింది...  

సినిమాకు మంచి ఆదరణ లభించింది. అందులో నన్ను చూసి తమిళ్‌ సీరియల్‌ ‘ఓవియా’లో అవకాశం వచ్చింది. పూర్తి స్థాయి ప్రధాన పాత్ర కాకపోయినా ఒప్పుకున్నాను. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని, నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా. 2018లో సీరియల్‌ మొదలైంది. అందులో నటిస్తుండగా ‘జీ తెలుగు’ నుంచి పిలుపు వచ్చింది... ‘హిట్లర్‌ గారి పెళ్లాం’ కోసం! లీడ్‌ రోల్‌! మొదట భయపడ్డాను. అప్పటి వరకు నేను తమిళనాడు దాటి బయటికి వెళ్లింది లేదు. తెలుగు ఒక్క ముక్క రాదు. ఎలా నెట్టుకురాగలననే బెంగ. ఈ కారణంతోనే గతంలో కొన్ని ఆఫర్స్‌ వచ్చినా ఒప్పుకోలేదు. 


సెట్‌లో ఏడ్చేశాను... 

గత ఏడాది... కరోనా సమయం... తోడు లేకుండా హైదరాబాద్‌కు ఒక్కదాన్నే రావాల్సి వచ్చింది. తొలి రోజు సెట్‌లో చుట్టూ చాలామంది ఉన్నారు. తెలియని ప్రదేశం. భాష రాదు. తమిళ పరిశ్రమకీ ఇక్కడికీ వర్కింగ్‌ స్టయిల్‌లో ఎంతో తేడా! అంతా కొత్తగా ఉంది. నాకు సన్నివేశాన్ని వివరించడానికి చాలా కష్టపడుతున్నారు. నటించడం మొదటిసారి కాకపోయినా ఎలా చేస్తానో ఏమిటోనని టెన్షన్‌. మెదడులో రకరకాల సందేహాలు... ఆలోచనలు. అన్నీ గిర్రున తిరిగి ఒక్కసారిగా ఏడ్చేశాను. అంతా ఓదార్చారు. ఆ రోజు మినహా మళ్లీ బాధ పడిందిలేదు.నిరుపమ్‌ గారి భార్య మంజుల అక్క తనతో షాపింగ్‌కు తీసుకువెళ్లి, కావల్సినవి కొనిపెట్టింది. తమిళ్‌లో తనతో కలిసి పని చేశాను. సెట్‌లో అందరి అప్యాయతలు, సహకారం వల్లే ఇప్పటికి 250కి పైగా ఎపిసోడ్స్‌ చేయగలిగాను. 




నా జీవితానికి దగ్గరైన పాత్ర...  

‘హిట్లర్‌ గారి పెళ్లాం’లో నాది ‘భానుమతి’ పాత్ర. ఆమె భర్త హిట్లర్‌లా కఠినంగా, ప్రతి విషయంలో కచ్చితంగా ఉంటాడు. భానుమతి స్వేచ్ఛను కోరుకొనే అమ్మాయి. భిన్న ధృవాలైన ఇద్దరి మధ్య ప్రేమ, అనురాగం ఎలా పండింది... ఆ అమ్మాయి అత్తింట్లో ఎలా నెట్టుకొచ్చిందనేది కథ. భావోద్వేగాలున్న పాత్ర ఇది. తెలుగులో భానుమతిగా నన్ను బాగా ఆదరించారు. నా నిజ జీవితానికి దగ్గరైన పాత్ర అది. ప్రస్తుతం తమిళ్‌లో ‘వేళైకారన్‌’ సీరియల్‌ కూడా చేస్తున్నా. ఒకటి చెప్పాలి... కరోనా చాలామంది జీవితాలను నాశనం చేసింది. కానీ కొందరికి జీవితాన్నిచ్చింది. ఆ కొందరిలో నేనూ ఉన్నాను. మొదటి వేవ్‌ సమయంలోనే నాకు తెలుగులో, ఆ తరువాత తమిళ్‌లో ఆఫర్లు వచ్చాయి. ఏదిఏమైనా ఒక సాధారణ అమ్మాయిని ఇప్పుడు ఇంత బిజీగా ఉన్నానంటే చాలా సంతోషంగా ఉంది. 






అంత సమయం లేదు... 

పరిశ్రమలోకి వచ్చి మూడేళ్లయిపోయింది. ఇట్టే గడిచిపోయాయి. పెళ్లెప్పుడని అడుగుతుంటారు. ప్రస్తుతం దాని గురించి ఆలోచించే సమయం లేదు. నాకంటూ ఓ కల ఉంది. సొంత ఇల్లు ఒకటి సమకూర్చుకోవాలి. చిన్నప్పటి నుంచీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. ‘మన ఇంట్లో గడుపుతున్నా’మన్న అనుభూతిని అమ్మా నాన్నలకు ఇవ్వాలి. చెల్లి, తమ్ముడిని బాగా చదివించాలి. ఈ బరువు, బాధ్యతలు తీరే వరకు పెళ్లి మాటే లేదు. అలాగని నేనేదో కుటుంబాన్ని ఉద్ధరిస్తున్నానని కాదు, పెద్ద పిల్లగా చేయగలిగింది చేస్తున్నాను అంతే! 


హనుమా 

Updated Date - 2021-06-21T09:10:54+05:30 IST