నేనక్కడ లేను.... నన్ను విచారించండి: కేంద్రమంత్రి కుమారుడు

ABN , First Publish Date - 2021-10-05T23:04:19+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఆదివారం హింసాత్మక సంఘటనలు

నేనక్కడ లేను.... నన్ను విచారించండి: కేంద్రమంత్రి కుమారుడు

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఆదివారం హింసాత్మక సంఘటనలు జరిగిన సమయంలో తాను అక్కడ లేనని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా మంగళవారం మీడియాకు చెప్పారు. తాను ఘర్షణ జరిగిన ప్రాంతానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నానని, తనపై కేసు నమోదుకావడం తప్పు అని, దర్యాప్తు జరిగితే వాస్తవం వెల్లడవుతుందని చెప్పారు. 


లఖింపూర్ ఖేరీలో రైతుల నిరసన కార్యక్రమంలో ఆదివారం జరిగిన హింసాత్మక సంఘటనల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆశిష్ మిశ్రాపై కేసు నమోదైంది. హత్య, అల్లర్లకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి. ఆశిష్ మిశ్రా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, తనవైపు ఉన్నవారిపై దాడి జరిగిందని చెప్పారు. తన కారు డ్రైవర్ సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తన సహాయకుల్లో ఒకరిని హత్య చేశారన్నారు. తన వర్కర్లపై కాల్పులు జరిగినట్లు తనకు తెలిసిందన్నారు. ఈ హింసాత్మక సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన తన వర్కర్లకు నష్టపరిహారం చెల్లించాలని తాను డిమాండ్ చేశానన్నారు. 


భారత దేశ రైతులు హంతకులు కాదని చెప్పారు. ఈ సంఘటన జరిగినపుడు తాను ఎక్కడ ఉన్నానో, ఏం చేస్తున్నానో తెలిపే వీడియోలు, ఫొటోలు తన వద్ద ఉన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి, ఉత్తర ప్రదేశ్ పాలనా యంత్రాంగంపై తనకు నమ్మకం ఉందన్నారు. వాస్తవం బయటకొస్తుందని తనకు తెలుసునన్నారు. 


కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌పై రైతులు ఆదివారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో నలుగురు రైతులతో సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఓ జర్నలిస్టు ఉన్నారు. అయితే రైతులు, యూపీ అడ్మినిస్ట్రేషన్‌ మధ్య  సోమవారం సయోధ్య కుదిరింది. మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం, ఉద్యోగాలు ఇస్తామని యూపీ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. 


Updated Date - 2021-10-05T23:04:19+05:30 IST