నేను వాగుడుకాయని..

ABN , First Publish Date - 2020-10-18T05:56:04+05:30 IST

చిన్నతనంలో ఎవరైనా అల్లరి చేస్తారు. స్కూల్‌లోనే కాదు కాలేజ్‌లోనూ నేను మహా అల్లరి పిల్లని. హాస్టల్‌లో ఏదన్నా సమస్య ఎదురైతే మొదట నా పేరే వినిపించేది. ‘

నేను వాగుడుకాయని..

రింగు రింగుల జుట్టు... గుండ్రని ముఖం..

బొంగరాల్లాంటి కళ్లు... అమాయకపు చూపు..

మంచి మాటకారి.. ఇట్టే మాటలతో ఆకట్టుకుంటుంది

కోపం ఎక్కువే... కానీ అది నీటి బుడగలాంటిదే!

అనుపమా పరమేశ్వరన్‌ గురించి వర్ణించడానికి ఇలా ఎన్ని మాటలైనా వస్తాయి. ఇదంతా బయటకు కనిపించే అందం గురించి. తనని తాను అతిగా ప్రేమించే అనుపమా చెప్పుకొచ్చిన 

ఆసక్తికర విషయాలివి...


చిన్నతనంలో ఎవరైనా అల్లరి చేస్తారు. స్కూల్‌లోనే కాదు కాలేజ్‌లోనూ నేను మహా అల్లరి పిల్లని. హాస్టల్‌లో  ఏదన్నా సమస్య ఎదురైతే మొదట నా పేరే వినిపించేది. ‘నువ్వేనా ఆ పని చేసింది’ అని టీచర్స్‌ దృష్టంతా నామీదే ఉండేది. అయినా అందరూ నన్నే ఇష్టపడేవారు. మా ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఏదన్నా చేయాలన్నా..  కుటుంబ సభ్యులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వాలన్నా నాకు సహకరించేది తమ్ముడే. వాడి సపోర్ట్‌ లేకుండా నేను ఏదీ చేయలేను. వాడే నా క్రైమ్‌ పార్టనర్‌. ఇద్దరం మంచి స్నేహితులం కూడా. లాక్‌డౌన్‌ వల్ల మేమిద్దరం ఆరు నెలలు ఇంటికే పరిమితమయ్యాం. దీంతో విసుగొచ్చింది. తమ్ముడితో కలిసి కేరళలోని హిల్‌ స్టేషన్స్‌.. జలపాతాలు.. ఇలా ఒకటేమిటి ప్రకృతి అందాలన్నీ చుట్టేసి వచ్చాం. 



కలివిడిగా.. 


చిన్నా పెద్ద అనే తేడా లేకుండా- అందరితోను కలివిడిగా ఉంటా. నేను పెద్ద వాగుడుకాయని. ఎదుటి వ్యక్తి కనెక్ట్‌ అయితే చాలు.. మాట్లాడుతూనే ఉంటా! కోపం నాలో మైనస్‌ పాయింట్‌. అయితే కోపం ఎక్కువ సేపు ఉండదు. అంతే కాదు- నాకు మొహమాటం చాలా తక్కువ. మనసుకు ఏది అనిపిస్తే అది ముఖం మీద చెప్పేస్తా! 


మేం చాలా లక్కీ...

చదువుకుని ఉద్యోగంలో చేరామనుకుందాం. ఆ వృత్తిలోనే ఉండాలి. కానీ ఆర్టిస్టులు అలా కాదు. రకరకాల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే నటీనటులందరూ రాటుదేలి ఉంటారు. అప్పుడప్పుడు- సినిమాలు ప్లాప్‌ అయితే ఏం చేస్తావు? అని అడుగుతూ ఉంటారు. ‘‘నా చదువుకు తగ్గ ఉద్యోగం చూసుకుంటా’’ అని సమాధానమిస్తా. నాకు మీడియాలో పనిచేయటమంటే చాలా ఇష్టం. సినిమాల్లోకి రాకపోతే మీడియాలో చేరేదాన్ని. 


రెండేళ్ల తర్వాత మలయాళంలో..

నేనొక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని. పెద్దల మాటకు విలువ ఇవ్వడం నాకు అలవాటు. మలయాళ ‘ప్రేమమ్‌’ విడుదలైన సమయంలో వచ్చిన అవకాశాలు వినియోగించుకోవాలని కొందరు చెప్పిన మాటలు విని ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇచ్చా. పరిశ్రమలో ఎలా మెలగాలో తెలియకపోవడంతో మీడియా అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇచ్చా. దాంతో కొంతమంది ఆడియన్స్‌ నొచ్చుకున్నారు. నన్ను టార్గెట్‌ చేసి సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్‌ చేశారు. వ్యక్తిగతంగా నా ఎదుగుదలకు మీడియాను ఉపయోగించుకున్నాననీ, నాకు ప్రగల్భాలు ఎక్కువని ఎవరిష్టం వచ్చినట్లువారు కామెంట్‌ చేశారు. ‘అహంకారి’ అనే బిరుదు కూడా ఇచ్చారు. పుట్టిన ప్రాంతంవారే అలా అనడంతో చాలా బాధ కలిగింది.


కొంతకాలం మలయాళ పరిశ్రమకు దూరంగా ఉండాలనుకున్నా. వచ్చిన అవకాశాలను వదులుకున్నా. ఆ సమయంలోనే తెలుగులో ‘అఆ’, ‘ప్రేమమ్‌’ తెలుగు రీమేక్‌ అవకాశాలొచ్చాయి. తెలుగు పరిశ్రమ నన్ను అక్కున చేర్చుకుంది. తెలుగులో సక్సెస్‌ అనిపించుకున్న రెండేళ్లకు మాతృభాష మలయాళంలో సినిమా చేశా. 


క్వశ్చన్‌ మార్క్‌ ఫేస్‌!


తెరపై కనిపించడమే కాదు.. తెర వెనక టెక్నికల్‌ వర్క్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం నాకు ఎక్కువ. అదుకే  మలయాళంలో మూడు సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా. ఒక డైలాగ్‌ చదివితే ఇదెందుకు ఇలా రాశారు.. ఫలానా షాట్‌కి కెమెరా వైడ్‌ యాంగిల్‌ ఎందుకు పెట్టారు’ అన్న ప్రశ్నలు నన్ను వెంటాడుతుంటాయి. అందుకే నా దర్శకులంతా నన్ను క్వశ్చన్‌ మార్క్‌ ఫేస్‌ అని పిలుస్తారు. భవిష్యత్తులో ఏదో ఒక రోజు నేను డైరెక్టర్‌ని అవుతా.  తెలుగులో రాజమౌళి, హిందీలో సంజయ్‌ లీలా భన్సాలీ నా డ్రీమ్‌ డైరక్టర్స్‌. వీరిద్దరితో ఒక్క సినిమా అయినా చేయాలని కోరిక.

 



నా కళ్లే నా అందమని అందరూ చెబుతూ ఉంటారు. అలాగే నవ్వు కూడా. ఎత్తు నాకు ఎప్పుడూ సమస్య కాలేదు. నా జుట్టూ చాలా ఒత్తుగా, పొడవుగా ఉంటుంది. ప్రతి రోజూ కొబ్బరినూనె రాసుకుంటా. జుట్టు కత్తిరించటమంటే నాకు అస్సలు నచ్చదు. ఆ ఆలోచన వస్తే చాలు.. నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. 


ఈర్ష్య లేదు..

ఒకే రంగంలో పని చేసే ఇద్దరు అమ్మాయిల మధ్య సహజంగానే ఈర్ష్య ఉంటుందంటారు. కానీ నాకు ఈర్ష్య ఉండదు. 

తోటి హీరోయిన్ల నటన నచ్చితే వారి నెంబర్‌ తీసుకొని మరీ ఫోన్‌ చేసి బావుందని చెబుతా! 


షాపింగ్‌ నచ్చదు...

నాకు షాపింగ్‌ అస్సలు నచ్చదు. స్నేహితులు షాపింగ్‌ అంటే నేను రానని చెప్పేస్తా. నా మీద నాకు నమ్మకం ఎక్కువ. నాతో నేను గాఢంగా ప్రేమలో ఉంటా.


Updated Date - 2020-10-18T05:56:04+05:30 IST