అఖిలేష్ గెలవాలని కోరుకుంటున్నా: మమత

ABN , First Publish Date - 2022-02-07T21:59:07+05:30 IST

కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ గెలవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు ..

అఖిలేష్ గెలవాలని కోరుకుంటున్నా: మమత

కోల్‌కతా: కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ గెలవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. కోల్‌కతాలో సోమవారంనాడు మీడియాతో ఆమె మాట్లాడుతూ, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌కు ప్రజలు మద్దతిస్తే, అఖిలేష్ ఈ ఎన్నికల్లో గెలిచే వీలుందని అన్నారు.


యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకే తమ మద్దతు ఉంటుదని ఇప్పటికే ప్రకటించిన మమతా బెనర్జీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం యూపీలో టీఎంసీ పోటీ చేస్తుందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి మద్దతు ప్రకటించడంతో పాటు సోమ, మంగళవారంలో రెండ్రోజుల పాటు యూపీలో ఆమె పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం అఖిలేష్ యాదవ్‌తో కలిసి సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో  ఆమె పాల్గొంటారు. సమాజ్‌వాదీ పార్టీకి మద్దతివ్వాలని ఈ సందర్భంగా ప్రజలను కోరనున్నారు. యూపీలో తొలి విడత పోలింగ్ ఈనెల 10న జరుగనున్న నేపథ్యంలో మమత యూపీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకోనుంది. 403 సభ్యుల యూపీ అసెంబ్లీకి ఏడు విడతల్లో పోలింగ్ జరుగనుంది. మార్చి 7వ తేదీతో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మార్చి 10న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2022-02-07T21:59:07+05:30 IST