నా పిల్లలకు నేనే రోల్‌మోడల్‌ కావాలి

ABN , First Publish Date - 2021-10-11T05:30:00+05:30 IST

ఎవరినో చూపించి... వారిలా గొప్పవారు కావాలని పిల్లల్లో స్ఫూర్తి నింపుతాం. కానీ ఆమె..! తన పిల్లలకు తనే ఆదర్శం కావాలనుకున్నారు. పారిశ్రామికవేత్తగా ...

నా పిల్లలకు నేనే రోల్‌మోడల్‌ కావాలి

ఎవరినో చూపించి... వారిలా గొప్పవారు కావాలని పిల్లల్లో స్ఫూర్తి నింపుతాం. కానీ ఆమె..! తన పిల్లలకు తనే ఆదర్శం కావాలనుకున్నారు. పారిశ్రామికవేత్తగా సంస్థను పరుగులు పెట్టిస్తూనే... ‘మిసెస్‌ ఇండియా యూనివర్స్‌’ కిరీటం గెలిచారు. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే... ‘మిసెస్‌ యూనివర్స్‌’ కోసం సన్నద్ధమవుతున్న శ్రుతి కావేరీ అయ్యర్‌ ప్రయాణం ఇది...



‘‘మోడలింగ్‌ అనుభవం లేదు. ఎప్పుడూ ర్యాంప్‌ వాక్‌ చేయలేదు. అందాల పోటీలకు వెళ్లలేదు. ఆగస్టులో జరిగిన ‘మిసెస్‌ ఇండియా యూనివర్స్‌’ పోటీలో పాల్గొనడానికి ముందు నా పరిస్థితి అది. అలాంటిది అందులో విజేతగా నిలిచానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.అదే ఈవెంట్‌లో ‘బెస్ట్‌ నేషనల్‌ కాస్ట్యూమ్‌’, ‘మిసెస్‌ ఇంటెలిజన్స్‌’ అవార్డులు కూడా గెలుచుకున్నా. బహుశా పని పట్ల నాకున్న అంకితభావమే నా విజయానికి కారణం కావచ్చు. ఇలాంటి పోటీ ఒకటి ఉంటుందని తెలుసు. కానీ అందులో పాల్గొనడం నాలాంటి వాళ్ల వల్ల కాదనుకుని అసలు దాని గురించి కూడా ఆలోచించలేదు. మాజీ ‘మిసెస్‌ ఇండియా యూనివర్స్‌’లు లక్ష్మీ శేషాద్రి, ఆయేషా వాడివాలా నా స్నేహితురాళ్లు. ఒకరోజు వాళ్లే నన్ను అడిగారు... ‘నువ్వు ఎందుకు పోటీ చేయకూడదు’ అని! బదులేమివ్వాలో నాకు అర్థం కాలేదు. ‘నువ్వు సాధించగలవ్‌’ అంటూ వాళ్లు నన్ను ప్రోత్సహించారు. ఆ మాటలు నాపై నాకు నమ్మకాన్నిచ్చాయి. వీటన్నిటి కంటే నన్ను బాగా ప్రభావితం చేసింది గృహ హింసపై నినదించడానికి తద్వారా ఒక మంచి వేదిక దొరకుతుందనే ఆలోచన. వెంటనే శిక్షణ ప్రారంభించాను. 


పూల బాట కాదు... 

నా ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు... సవాళ్లు. ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా నాది పూల బాట కాదు. ‘ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌’లో డిగ్రీ పూర్తి చేసిన తరువాత అమెరికాలోని ‘వార్టన్‌ బిజినెస్‌ స్కూల్‌’లో చదివాను. ‘హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం’ నుంచి ‘పబ్లిక్‌ అడ్మినిస్ర్టేషన్‌’లో మాస్టర్స్‌ పట్టా పొందాను. ఆగ్నేయ ఆసియాలో కొన్నాళ్లు కమోడిటీస్‌ ట్రేడర్‌గా ఉన్నాను. అప్పట్లో అది లాభసాటి వ్యాపారం. బాగా నడిచింది. కానీ ఎందుకో నాకు అందులో సంతృప్తి లభించలేదు. దాంతో రూటు మార్చాలనుకున్నాను. కొత్త ఆలోచనతో అమెరికా వెళ్లాను. 


‘స్కిన్‌ కేర్‌’ బ్రాండ్‌... 

ఏ వ్యాపారంలోనైనా రాణించాలంటే అందులో మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. లేదంటే మార్కెట్‌లో నిలబడలేమని తెలుసు. స్కిన్‌ కేర్‌ ఉత్పత్తుల బ్రాండ్‌ ఒకటి తేవాలన్న ఉద్దేశంతో అమెరికా వెళ్లిన నేను... అందులో కొత్తదనం కోసం ప్రయత్నించాను. ఆ వ్యాపారానికి నేను కొత్త కానీ... అలాంటివి ఉత్పత్తి చేసే బ్రాండ్లకు కొదవ లేదు. మరి భిన్నంగా ఏంచేయాలి? ఈ ఆలోచనే ‘బ్లెండ్‌-8’కు నాంది పలికింది. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలున్న స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులను సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అలాగే ఉత్పత్తులను ఎలా వాడాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... వంటివి వివరంగా పొందు పరుస్తూ మహిళల కోసం సరికొత్త బ్రాండ్‌ తీసుకువచ్చా. నా ఉత్పత్తులు అమ్ముకోవడమే కాదు... వాటిపై పూర్తి అవగాహన కూడా కల్పించాల్సిన బాధ్యత మహిళగా నాపై ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నా. కొద్ది కాలంలోనే మార్కెట్‌లో నిలదొక్కుకున్నాం. లాభాలు ఆర్జించాం. అయితే కొన్ని ఊహించని కారణాలవల్ల 2016లో అది వదిలేసి భారత్‌కు వచ్చాను. 


స్నేహితుడి సలహాతో... 

అమెరికా నుంచి రాగానే మా బెంగళూరులో ఏదైనా సంస్థ పెట్టాలనుకున్నా. ఎవరైనా అడగొచ్చు... ‘లాభాల్లో ఉన్న వ్యాపారాలు వదిలి మళ్లీ కొత్తగా కంపెనీ ఏంటని’. నేనంతే! అయితే ఏంచేయాలి? మళ్లీ ఆలోచన. న్యూయార్క్‌లోని ఓ సంస్థకు చీఫ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఆఫీసర్‌ (సీఐఓ)గా ఉన్న స్నేహితుడు సచీంద్ర రుద్రని అడిగాను. అతడి సలహాతో రెండేళ్ల కిందట ‘కాహా కేపిటల్‌’ పేరుతో ఇన్వె్‌స్టమెంట్‌ అడ్వైజరీ ఫర్మ్‌ ప్రారంభించాం. తను దీనికి సహవ్యవస్థాపకుడు కూడా. అయితే కొద్ది రోజులకే కరోనా విజృంభించింది. దీనివల్ల అన్ని రంగాలతో పాటు మా కంపెనీకి కూడా పెద్ద కుదుపు. అనుకోని ఉపద్రవాలు ఏవైనా వచ్చినా వాటి ప్రభావం కొద్ది రోజులే ఉంటుంది. కానీ రెండేళ్లవుతున్నా ఇంకా కరోనా ప్రభావం నుంచి కోలుకోలేకపోతున్నాం. అది మిగిల్చిన నష్టాల నుంచి బయటపడడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.  


సరికొత్త అనుభూతి... 

నిత్యం వ్యాపార లావాదేవీలతో గడిపే నాకు ‘మిసెస్‌ ఇండియా యూనివర్స్‌’ పోటీలు సరికొత్త అనుభూతి. అదో విభిన్న ప్రపంచం. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయికి 13, అబ్బాయికి రెండు సంవత్సరాలు. వాళ్లని, ఇంటిని చూసుకొంటూనే కంపెనీ నడిపిస్తున్నా. ఇప్పుడు అందాల పోటీలు. అంత సమయం ఎక్కడి నుంచి వస్తుందని సన్నిహితులు అడుగుతుంటారు. అది మనలో ఉంటుంది. నా మొబైల్‌ ఫోన్‌లో సామాజిక మాధ్యమాలుండవు. ఇంట్లో ఎవరం టీవీ చూడం. వీటివల్ల నా పనులు నేను చేసుకోవడానికి కావల్సిన సమయం దొరుకుతుంది. అన్నిటి కంటే మా వారి సహకారం ఎంతో ఉంది.  


సియోల్‌కి సిద్ధం... 

ప్రస్తుతం నేను ఈ ఏడాది సియోల్‌లో జరిగే ‘మిసెస్‌ యూనివర్స్‌’ కోసం సన్నద్ధమవుతున్నా. ఇది నాకు అంత సులువు కాదు. వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఎన్నో అడ్డంకులను అధిగమించి ఇక్కడి వరకు వచ్చాను. అదే సంకల్పంతో ముందుకు వెళుతున్నాను. రాజీ పడి కలలను త్యాగం చేయకపోతే మహిళలు ఎందులోనైనా రాణించగలరు. ఈ ప్రయాణంలో నేను నేర్చుకున్నది ఇదే. ఒక లక్ష్యాన్ని చేరాలంటే దృఢచిత్తంతో నిరంతర ప్రయత్నం చేయాలని! ఏదిఏమైనా నా కల ఒక్కటే... నా పిల్లలకు నేనే రోల్‌మోడల్‌ కావాలని! అదే జరిగితే నా జన్మ ధన్యమైనట్టే.’’

Updated Date - 2021-10-11T05:30:00+05:30 IST