నేను టాప్‌ .. మీరు ఫ్లాప్‌!

ABN , First Publish Date - 2022-04-28T07:29:05+05:30 IST

‘‘పార్టీ అధ్యక్షునిగా నా గ్రాఫ్‌ 65 శాతం ఉంది. మీ గ్రాఫ్‌ 40 నుంచి

నేను టాప్‌ .. మీరు ఫ్లాప్‌!

  • నా గ్రాఫ్‌ 65 శాతం.. మీ గ్రాఫ్‌ 45 శాతం లోపే!
  • ఓడిపోయే వారికి టికెట్లు ఇచ్చేది లేదు: జగన్‌
  • వారి బరువు మోసేందుకు సిద్ధంగా లేను
  • పని తీరు మెరుగుపరుచుకోండి
  • 151 సీట్లకు ఒక్కటి కూడా తగ్గొద్దు
  • అసలు మొత్తం 175 ఎందుకు రావొద్దు?
  • మంత్రుల కంటే పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలే ఎక్కువ
  • గెలిచాక వారికే మంత్రి పదవులు
  • 10 నుంచి ‘ఇంటింటి ప్రచారం’: సీఎం


మంత్రులకంటే...

మంత్రులంతా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తల తర్వాతే మంత్రుల స్థానం! మంత్రులకంటే వీళ్లే ఎక్కువ. ఈ విషయాన్ని మంత్రులు మనసులోకి ఎక్కించుకోవాలి. పార్టీయే సుప్రీం. దీనిని అందరూ గుర్తుంచుకోవాలి.

- జగన్‌


అమరావతి, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): ‘‘పార్టీ అధ్యక్షునిగా నా గ్రాఫ్‌ 65 శాతం ఉంది. మీ గ్రాఫ్‌ 40 నుంచి 45 శాతంలోపే ఉంది. దీనిని సరిదిద్దుకోండి. గ్రాఫ్‌ను పెంచుకోండి. సర్వే ఆధారంగానే ఎమ్మెల్యే టికెట్లు దక్కుతాయి. ఓడిపోయే వారికి టికెట్లు ఇచ్చేది లేదు’’ అని వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మంత్రులు, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. మళ్లీ గెలవడమే లక్ష్యంగా దిశా నిర్దేశం చేశారు.


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ‘‘ప్రభుత్వం గ్రాఫ్‌, నా గ్రాఫ్‌ బాగున్నాయి. కొందరు ఎమ్మెల్యేల గ్రాఫ్‌ కూడా ఫర్వాలేదు. ఇంకొందరు ఎమ్మెల్యేల గ్రాఫ్‌ ఏమాత్రం బాగోలేదు. వీళ్లకు ఆరునెలలు, తొమ్మిది  నెలలు సమయం ఇస్తున్నా. ఆలోగా వారు ప్రజల్లో పర్యటించి గ్రాఫ్‌ పెంచుకోవాలని మీరు వివరించండి’’ అని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులను ఆదేశించారు.


మీ బరువు దించుకుంటా...

పనితీరు మార్చుకోని, ఓడిపోయే ఎమ్మెల్యేలను జగన్‌ పార్టీకి బరువుగా అభివర్ణించారు. ‘‘ఓడిపోయే ఎమ్మెల్యేల బరువు మోయలేను. వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదన్నారు. అధికారంలోనికి వచ్చాక.. వారికి ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్‌ పదవులు ఇస్తా’’ అని జగన్‌ స్పష్టం చేశారు. ఇప్పుడున్న 151 స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గేందుకు వీల్లేదని చెబుతూనే... ‘‘కరోనా సమయంలోనూ పథకాలను విస్తృతంగా అమలు చేస్తున్నాం. మొత్తం 175 స్థానాలు ఎందుకు గెలవలేం!?’’ అని ప్రశ్నించారు.


మళ్లీ గెలిచాక జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వకర్తలు 25 మంది మళ్లీ మంత్రులవుతారని జగన్‌ వెల్లడించారు. మంత్రులు రెండు రోజులు మాత్రమే తమ శాఖల బాధ్యతలను చూడాలని.. మిగిలిన ఐదు రోజులు నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు రోజుకు రెండు, మూడు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. తాను కూడా త్వరలోనే.. సచివాలయాలను సందర్శిస్తానని, జిల్లాల్లో పర్యటిస్తానని జగన్‌ వెల్లడించారు. మే రెండో తేదీ నుంచి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించాలన్నారు. దీనిపై కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమయం తక్కువగా ఉన్నందున మే పదోతేదీ నుంచి ప్రారంభి స్తే బాగుంటుందని తెలిపారు. అందుకు సీఎం అంగీకరించారు.


పార్టీ అధ్యక్షుడు, సమన్వయకర్తల తర్వాతే మంత్రులని జగన్‌ స్పష్టం చేశారు. ఎవరికైనా పార్టీయే సుప్రీమ్‌ అని తెలిపారు. జూలై 8వ తేదీన వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామన్నారు. జూన్‌ నెలాఖరులో మరోసారి పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, మంత్రులు భేటీ అయితే బాగుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించగా, జగన్‌ అంగీకరించారు. కాగా, వైసీసీ జిల్లా అధ్యక్షులకు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్‌ పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వారికి కేబినెట్‌ హోదా కల్పిస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. 



సజ్జల, విజయసాయికి సమన్వయం బాధ్యతలు 

వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయికి సమన్వయ బాధ్యతలు అప్పగిస్తూ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. సజ్జలకు ఎమ్మెల్యే, మీడియా సమన్వయం బాధ్యతలు అప్పగించారు. విజయసాయి కి ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల సమన్యయం బాధ్యతలు అప్పగించారు.




ఆ మీడియాను తిట్టండి..

నా మీడియాను పొగడండి..

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం... ఎప్పట్లాగానే తనకు గిట్టని మీడియాపై జగన్‌ అక్కసు వెళ్లగక్కారు. ‘‘మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీతో కాదు... ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లతో యుద్ధం చేస్తోంది. ప్రభుత్వంపైనా.. పార్టీపైనా వీరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి’’ అని సూచించారు. తమ సొంత మీడియా ద్వారా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళతామన్నారు. ప్రభుత్వాన్ని, పాలనను విమర్శించే మీడియానూ తిట్టాలని, తన సొంత మీడియాను పొగడాలని ఆదేశించారు.




షాదీ ఖానా ప్రారంభించిన సీఎం

ముస్లింలకు సర్కారు ఇఫ్తార్‌ విందు

విజయవాడ, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వన్‌టౌన్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో నిర్మించిన ముసాఫిర్‌ ఖానాను సీఎం జగన్‌ బుధవారం ప్రారంభించారు. అలాగే, రంజాన్‌ మాసంలో ముస్లింలకు ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్‌ విందులో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బుధవారం సాయంత్రం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.


సాయంత్రం 6.13 గంటలకు ముస్లిం మతపెద్దలు ప్రార్థనలు ప్రారంభించారు. ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి జగన్‌ ఉర్దూలో ఈద్‌ ముబారక్‌ చెప్పారు. ముందుస్తుగా రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉర్దూలో ప్రసంగంచిన మతపెద్దలు జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ విందు కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, మంత్రులు జోగి రమేశ్‌, తానేటి వనిత, ఆర్‌కే రోజా, ఎమ్మెల్సీ జకియా సుల్తానా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-04-28T07:29:05+05:30 IST