నన్ను అరెస్ట్ చేసుకోవచ్చని అమిత్ షాకు చెప్పాను: సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2022-02-16T00:38:41+05:30 IST

మహా వికాస్ అగాడీ ప్రభుత్వం మార్చి 10 లోపు పడిపోతుందని కొందరు బీజేపీ నేతలు అంటున్నారు. నేను వెంకయ్య నాయుడుకి లేఖ రాసిన తర్వాత ఇలాంటి రూమర్లు ఎక్కువయ్యాయి. మా ప్రభుత్వాన్ని ఎవరూ కదలించలేరు. థాకరేకి అలీబాగ్‌లో 19 బంగళాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు..

నన్ను అరెస్ట్ చేసుకోవచ్చని అమిత్ షాకు చెప్పాను: సంజయ్ రౌత్

ముంబై: తనపై ఏదైనా శతృత్వం ఉంటే తన ఇంటికి ఈడీని పంపవచ్చని, అవసరమైతే తనను అరెస్ట్ చేసుకోవచ్చని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి చెప్పినట్లు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ వెల్లడించారు. తనపై శతృత్వంతో తన మిత్రులను, తన పార్టీలోని వ్యక్తులను ఇబ్బంది పెట్టొద్దని ఆయన కోరారు. శివసేన నేతలపైకి కేంద్ర దర్యాప్తుల సంస్థల్ని ప్రయోగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. శివసేన ఎవరికీ భయపడదని అన్నారు. అంతే కాకుండా ఇప్పుడు తమను వేధిస్తున్నవారితో 2024 తర్వాత తేల్చుకుంటామని రౌత్ హెచ్చరించారు.


మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘మహా వికాస్ అగాడీ ప్రభుత్వం మార్చి 10 లోపు పడిపోతుందని కొందరు బీజేపీ నేతలు అంటున్నారు. నేను వెంకయ్య నాయుడుకి లేఖ రాసిన తర్వాత ఇలాంటి రూమర్లు ఎక్కువయ్యాయి. మా ప్రభుత్వాన్ని ఎవరూ కదలించలేరు. థాకరేకి అలీబాగ్‌లో 19 బంగళాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. నేను జర్నలిస్ట్‌లను తీసుకుని వెళ్తాను. ఒకవేళ అక్కడ అన్ని బంగళాలు కనిపించకపోతే బీజేపీ నేతల స్థాయి ఏంటో తెలుస్తుంది’’ అని అన్నారు.


‘‘కేంద్ర సంస్థల్ని ఉసిగొల్పి మా పార్టీ నేతల్ని ఇబ్బంది పెడుతున్నారు. నేను అమిత్ షాకు ఫోన్ చేసి చెప్పాను. నా దగ్గరే ఏదైనా సమస్య ఉంటే, నామీదేమైనా శతృత్వం ఉంటే నాపైకి ఈడీని పంపించమని, కావాలంటే అరెస్ట్ చేయమని చెప్పాను. కానీ నా స్నేహితులను, మా పార్టీ నేతలను ఇబ్బంది పెట్టొద్దని కోరాను. శివసేన ఎవరికీ భయపడదు. ఇప్పుడు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న వారితో 2024 తర్వాత తేల్చుకుంటాం’’ అని రౌత్ అన్నారు.

Updated Date - 2022-02-16T00:38:41+05:30 IST