నా కోసం ప్రజలు తెల్లవారు జామునే లేచారంటే నమ్మలేకపోతున్నా: గోల్ఫ్ ప్లేయర్ అదితి అశోక్

ABN , First Publish Date - 2021-08-10T19:57:50+05:30 IST

భారతీయుల్లో అనేక మందికి గోల్ఫ్ పట్ల ఆసక్తి పెరిగింది. గోల్ఫ్ ఆటతో పరియచం లేని వారు సైతం ఈ గేమ్ రూల్స్‌పై అవగాహన పెంచుకుని మరీ ఒలింపిక్స్ పోటీలను తిలకించారు.

నా కోసం ప్రజలు తెల్లవారు జామునే లేచారంటే నమ్మలేకపోతున్నా: గోల్ఫ్ ప్లేయర్ అదితి అశోక్

న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ భారత్‌కు ఎన్నో తీపి గుర్తులు మిగిల్చింది. నీరజ్ చోప్రా గెలిచిన బంగారు పతకం దేశప్రజల మనసుల్లో చెరగని ముద్రవేసింది. అంతేకాకుండా.. పలు కొత్త క్రీడల పట్ల భారతీయుల్లో ఆసక్తి రేకెత్తింది. వీటిల్లో గోల్ఫ్ ముఖ్యమైనది. భారత్‌ తరఫున తాజా విశ్వక్రీడల్లో బరిలోకి దిగిన క్రీడాకారిణి అదితి అశోక్.. భారతీయుల చూపు ఈ ఆటవైపు మళ్లేలా చేసింది. పతకానికి అడుగు దూరంలో నిలిచిపోయినా.. అత్యద్భుత ప్రదర్శనతో భారతీయుల్నే కాక యావత్ క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ క్రీడలో భవిష్యత్తు తనదేననే స్పష్టమైన సంకేతాన్ని పంపించింది. 


ఈ క్రమంలో భారతీయుల్లో అనేక మందికి గోల్ఫ్ పట్ల ఆసక్తి పెరిగింది. గోల్ఫ్ ఆటతో పరిచయం లేని వారు సైతం ఈ గేమ్ రూల్స్‌పై అవగాహన పెంచుకుని ఒలింపిక్స్ పోటీలను తిలకించారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారు జామునే టోక్యోలో గోల్ఫ్ పోటీలు ప్రారంభమవుతుండటంతో అనేక మంది నాలుగు గంటలకే లేచి ఈ పోటీలను తిలకించారు. దీనిపై హర్షం వ్యక్తం చేసిన అదితీ అశోక్.. దేశప్రజలకు మన:పూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనకు మద్దతుగా నిలిచేందుకు అనేక మంది తెల్లవారు జామునే లేచి పోటీలను తిలకించారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటూ అదితి సంబరపడింది. ‘‘గోల్ఫ్ గురించి తెలియకపోయినా ఎంతో మంది తెల్లవారు జామునే లేచి ఈ పోటీలను తిలకించారు. వారికి నేను ఎంతగా రుణపడి ఉన్నానో మాటల్లో చెప్పలేను’’ అని అదితి వ్యాఖ్యానించింది. 

Updated Date - 2021-08-10T19:57:50+05:30 IST