Joe Biden: నా నిర్ణయం సరైనదే.. అఫ్ఘాన్‌కు అన్ని విధాల మద్దతిచ్చినా ఉపయోగించుకోలేదు

ABN , First Publish Date - 2021-08-17T14:13:45+05:30 IST

అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా అఫ్ఘాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడంతో తాలిబన్లకు మళ్లీ పట్టుదొరికినట్లైందనేది అంతర్జాతీయ సమాజం వాదన.

Joe Biden: నా నిర్ణయం సరైనదే.. అఫ్ఘాన్‌కు అన్ని విధాల మద్దతిచ్చినా ఉపయోగించుకోలేదు

వాషింగ్టన్: అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా అఫ్ఘాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకోవడంతోనే తాలిబన్లకు మళ్లీ పట్టుదొరికినట్లైందనేది అంతర్జాతీయ సమాజం వాదన. ఈ నేపథ్యంలో సోమవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన అధ్యక్షుడు జో బైడెన్.. అఫ్ఘాన్ నుంచి తమ సైన్యాన్ని వెనక్కి రప్పించడం అనే తన నిర్ణయం సరియైనదేనని సమర్థించుకున్నారు. అఫ్ఘాన్‌కు అన్ని విధాల మద్దతిచ్చినా ఉపయోగించుకోలేదని దుయ్యబట్టారు. 20 ఏళ్లుగా అఫ్ఘాన్ ఆర్మీకి తమ బలగాలు అన్ని విభాగాల్లో తగిన విధంగా తర్ఫీదు ఇచ్చి రాటుదేల్చాయని, అయినా తాలిబన్లతో పోరాటంలో చతికిలా పడ్డారంటూ బైడెన్ చెప్పుకొచ్చారు. ఏమాత్రం పోరాటపటిమను ప్రదర్శించకుండా తాలిబన్లకు అలవోకగా తలొగ్గారని మండిపడ్డారు. 


ఈ సందర్భంగా అఫ్ఘాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణకు కట్టుబడి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 20 ఏళ్ల తర్వాత సరైన నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ నిర్ణయంపై తాము చింతించడం లేదని చెప్పారు. తమ ముందు ఉన్న రెండు దారుల్లో ఒకటి అమెరికా బలగాలను వెనక్కి రప్పించుకోవడమైతే.. రెండోది మూడో దశాబ్దంలోనూ మరింత సైన్యాన్ని పంపించి మోహరింపు కొనసాగించడం. కానీ, రెండో దారిలో కొనసాగకూడదనే మా నిర్ణయం ముమ్మాటికీ సరైందనేనని బైడెన్‌ తెలిపారు. తీవ్రవాదానికి తాము ఎప్పుడూ వ్యతిరేకమేనని చెప్పిన అధ్యక్షుడు.. అమెరికా సైన్యానికే ఎక్కువ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. 


అఫ్ఘాన్‌లో జాతి నిర్మాణం అగ్రరాజ్యం బాధ్యత కాదని, యూఎస్‌పై ఉగ్రవాదులను నిరోధించడమే లక్ష్యమని బైడెన్‌ స్పష్టం చేశారు. అలాగే ఈ సంక్షోభానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి కూడా ఓ కారణమని ఆయన తెలిపారు. భవిష్యత్‌లో అమెరికాకు ఏది మంచిదో దానిపైనే దృష్టిపెడతామన్నారు. అటు అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోవడాన్ని కూడా బైడెన్ తప్పుబట్టారు. ఘనీ చేసింది ముమ్మాటికీ తప్పేనని మండిపడ్డారు. ఇక అఫ్ఘాన్ తాలిబన్ల వశం కావడంతో మళ్లీ 20 ఏళ్లనాటి అరాచక పాలన వస్తుందని అక్కడి ప్రజలు భయంతో గజగజ వణికిపోతున్నారు.  

Updated Date - 2021-08-17T14:13:45+05:30 IST