Abn logo
May 22 2020 @ 15:54PM

డబ్బుల కోసం కన్నీళ్లు పెట్టుకున్నాను.. కానీ ఆ ప్రోడ్యూసర్..: టీవీ నటి

ముంబై: లాక్‌డౌన్ కారణంగా టీవీ నటులు, చిన్ని చిన్న నటులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల ఓ సీరియల్ నటుడు ప్రోడ్యూసర్ల నుంచి డబ్బు అందకపోవడంతో ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో మరో నటి తన ఆవేదనను పంచుకున్నారు. ‘హమారీ బహూ సిల్క్’ అనే హిందీ సీరియల్‌లో చాహత్ పాండే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా షూటింగులు లేకపోవడంతో ఆమె ఇంటికే పరిమితమైపోరు. ఈ నేపథ్యంలో తనకు రావాల్సిన డబ్బు ఇవ్వాల్సిందిగా ప్రోడ్యూసర్‌ను కోరానని, కానీ ఆయన కుదరదన్నాడని చెప్పారు. ‘ప్రస్తుతం ఇంటి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఓనర్ ఇళ్లు ఖాళీ చేయమంటున్నాడు. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఏం చేయాలి’ అంటూ చాహత్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను దాచుకున్న డబ్బులన్నీ షూటింగ్ సమయంలో ప్రయాణాలు, ఆహారానికి ఖర్చు పెట్టేశానని, అయితే అవన్నీ తిరిగి ఇచ్చేస్తానన్న ప్రోడ్యూసర్లు ఇప్పుడు అడ్డం తిరిగారని వివరించారు.


‘షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వారిని డబ్యులు ఇవ్వాల్సిందిగా ఎన్నో సార్లు కోరాను.. ప్రాధేయపడ్డాను. అయితే ఛానల్ వాళ్లు ఇంకా డబ్బులివ్వలేదని తప్పించుకునేవారు. ఇక చేసేదేం లేక ఓ ప్రోడ్యూసర్‌కు నా పరిస్థితి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాను. అయినా కనికరించలేదు. ఇప్పుడు అసలు డబ్బులివ్వడమే కుదరదని చెబుతున్నాడు. తన వద్ద డబ్బులు లేవని, ఏం చేయలేనని తప్పించుకుంటున్నాడం’టూ చాహత్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
Advertisement