‘‘కోర్టులో వాదించడమూ తెలుసు... కోటు తీసి కొట్టడమూ తెలుసు’’ అని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఆయన న్యాయవాదిగా నటిస్తున్న ‘వకీల్ సాబ్’ టీజర్లోనిదీ డైలాగ్. సంక్రాంతి సందర్భంగా యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల చేశారు. యూట్యూబ్‌లో నంబర్ వన్ స్థానంలో ‘వకీల్ సాబ్’ టీజర్ ట్రెండ్ అవుతోందనీ, 8 మిలియన్ వ్యూస్ వచ్చాయని చిత్రనిర్మాణ సంస్థలు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, బేవ్యూ ప్రాజెక్ట్స్ శుక్రవారం తెలిపాయి. పవన్ నటన, ఆహార్యం అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందని ప్రశంసలు వస్తున్నాయి. ప్రధాన పాత్రల్లో నివేదా థామస్, అంజలి, అనన్యా నాగళ్ల... పవన్ సరసన శ్రుతీ హాసన్ నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకుడు. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.
త్రివిక్రమ్ మాటలు... స్ర్కీన్‌ప్లేతో!
పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించనున్న ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు, స్ర్కీన్‌ప్లే అందిస్తున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ శుక్రవారం వెల్లడించింది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకుడు. త్వరలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు.