Chitrajyothy Logo
Advertisement

రెండున్నర ఏళ్లు ఆ పాటను దాచి పెట్టా

twitter-iconwatsapp-iconfb-icon
రెండున్నర ఏళ్లు  ఆ పాటను దాచి పెట్టా

‘కొమురం భీముడో.. కొమురం భీముడో... కొర్రాసు నెగడోలో మండాలి కొడుకో’..  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ఈ పాట సినిమా విడుదలకు ముందు వైరల్‌ అయింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ ఫీల్‌ను పీక్‌కు తీసుకెళ్లాయి.  ఆదిలాబాద్‌లో గోండు జాతి ఉపయోగించే పదాలను, తెలంగాణలో వినిపించే మాటలను  కూర్చి ఈ పాటను అద్భుతంగా రాశారు రచయిత సుద్దాల అశోక్‌ తేజ. ‘కొర్రాసు’, ‘అరణం’, ‘తోగాల’, ‘తుడుము’, ‘రగరగ’ వంటి పదాలు కొత్తగా వినిపించి  ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చాయి. ఈ పాట పుట్టుక గురించి సుద్దాల ‘నవ్య’తో చెప్పుకొచ్చారిలా...


దాదాపు  రెండున్నర ఏళ్లక్రితం రాసిన పాట ఇది. రాజమౌళిగారు ‘బాహుబలి’ చిత్రాన్ని అనౌన్స్‌ చేసినప్పుడు అందులో పాట రాసే అవకాశం నాకు వస్తుందని అనుకోలేదు. అందులో రాయలేదు కూడా.  కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ఆయన  ప్రకటించి, చరిత్రలో ఎప్పుడూ కలుసుకోని అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ కలుసుకుంటే ఎలా ఉంటుందో  చారిత్రక పాత్రలతో అల్లిన  కథ ఇదని చెప్పగానే  తప్పకుండా అందులో కనీసం ఒక పాటయినా రాసే ఛాన్స్‌ నాకు వస్తుందని ఊహించా.  రాజమౌళిగారి ఆఫీసు నుంచి తప్పకుండా ఫోన్‌ వస్తుందని ఆసక్తిగా ఎదురు చూశా. నేను ఊహించినట్లుగానే కీరవాణిగారి సతీమణి వల్లిగారు ఓ రోజు ఫోన్‌ చేసి రమ్మనమంటే వెళ్లాను. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన  ఆఫీసులో రాజమౌళిగారు, కీరవాణిగారు, విజయేంద్రప్రసాద్‌గారు ఉన్నారు. కొమురమ్‌ భీమ్‌ క్యారెక్టర్‌ గురించి  నాకు చెప్పారు రాజమౌళిగారు. ఇంతకుముందు  దాసరి నారాయణరావుగారి ‘పరమవీర చక్ర’ చిత్రంలో కొమురం భీమ్‌ గురించి ఎనిమిది నిముషాల పాట రాశాను. కొమురం భీమ్‌ జీవితం మీద, ఆయన పోరాటం మీద , ‘జల్‌ జంగల్‌ జమీన్‌’ అనే ఆయన నినాదం మీద నాకు పూర్తి అవగాహన ఉంది. కొమురం భీమ్‌  పాత్రను సినిమా పద్ధతుల్లో  తను ఎలా చూపించాలనుకుంటున్నారో రాజమౌళిగారు నాకు చెప్పారు. భీమ్‌ పోరాటం, ఆంగ్లేయులు తనని చిత్రహింసలు పెడుతున్నా ‘నేను తలవంచేది లేదు..   మోకరిల్లడం అనేది నా జీవితంలో జరగదు, తల తెగినా తలవంచను’ అనే బలమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా  భీమ్‌ను చూపిస్తున్నట్లు రాజమౌళి చెప్పారు. 


నలభై ఐదు నిముషాల్లో  రాసేశా

ఈ పాటకు ట్యూన్‌ ఏమీ అనుకోలేదు.. ‘ ఏ రిధమ్‌లో పాట ఉంటే బాగుంటుందో నువ్వే రెండు మూడు రకాలుగా అనుకుని రా.. ’ అని కీరవాణిగారు నాకు స్వేచ్ఛ ఇచ్చారు. మహద్భాగ్యం అనుకున్నా.  మూడు రకాల నడకల్లో పాట అనుకుని మళ్లీ రాజమౌళిగారిని కలిశా. వాటిని వినిపించగానే ఇప్పుడు పాట రూపంలో వచ్చిన ట్యూన్‌ రాజమౌళిగారికి నచ్చింది.  ఆ తర్వాత ఇది  నేపథ్య గీతంలా ఉండాలా, లేక వేరే వ్యక్తి పాడుతున్నట్లుగా ఉండాలా,  ఇవన్నీ కాక  ఎన్టీఆర్‌ పాడుతున్నట్లుగా ఉండాలా అనే చర్చ మా మధ్య జరిగింది.   తనని తానే బలిదానం చేసుకుంటున్నట్లు, ఉత్సాహపరుచుకుంటున్నట్లు   ఎన్టీఆర్‌ పాడితేనే  బాగుంటుందని నేను  ప్రతిపాదించాను. రాజమౌళిగారు, కీరవాణిగారు చాలా బాగుందని మెచ్చుకుని అదే ఓకే చేశారు. ఆ ధోరణిలోనే పాట రాయమని రాజమౌళిగారు క్లియరెన్స్‌ ఇచ్చేశారు... ఇంటికి తిరిగి వచ్చేశాక కూర్చుని 45 నిముషాల్లో ఈ పాట రాసేశా.


రాజమౌళిగారికి వినిపిస్తే ఆయన  స్వల్పమైన మార్పులు సూచించారు.  పాట చివరిలో  ‘కాలువై పారే నీ గుండె నెత్తూరూ.. నేలమ్మ నుదిటి బొట్టైతుంది  సూడు.. అమ్మ కాళ్లకు పారాణైతుంది సూడు.. తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు.. కొమురం భీముడో.. కొమురం భీముడో ..’ అని రాసి ఆపేశాను. దీనికి కొసమెరుపులా గుండెల్లో నిలిచిపోయే వాక్యం ఒకటి కావాలని ఆయన అడిగారు. నేను ఆలోచిస్తుంటే పక్కనే ఉన్న  కీరవాణిగారు అందుకుని ‘ఇప్పుడేం తొందరలేదు.. మీరు ఇంటికి వెళ్లి రాయవచ్చు’ అన్నారు. ‘ఎందుకన్నా అప్పటిదాకా వాయిదా వేస్తావు.. మనం బయటకి వెళ్లి కాఫీ తాగి వచ్చేలోపల అశోక్‌తేజగారు రాసేస్తారు చూడు..  ఇవాళ్టికి ఈ పాట పూర్తయిపోతే రేపు కొత్త పాట మొదలుపెట్టవచ్చు’   అని నా మీద నాకే  పెద్ద నమ్మకాన్ని పెంచారు రాజమౌళిగారు. ‘కొమురం భీముడో.. కొమురం భీముడో.. పుడమితల్లికి జనమ అరణమిస్తివిరో’ అనే వాక్యాన్ని వాళ్లు కాఫీ తాగి వచ్చే లోగా రాసేశాను. ‘అరణం’ అనే పదం విని చాలా మంది రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. కానీ అరణం అంటే భరణం కాదు... పెళ్ళిళ్లలో నగా నట్రా కాకుండా ప్రాణం ఉన్న వాటిని.... ఆవులనో, గేదలనో, బర్రెలనో ...  బహుమతిగా ఇస్తే దాన్ని ‘అరణం’ అంటారు.


ఆకాశమంత స్వేచ్ఛనిచ్చారు

 ఏ శైలిలో రాయాలి, పద ప్రయోగం ఎలా ఉండాలి అనే  సందేహం వచ్చినప్పుడు  రాజమౌళిగారు నాకు ఆకాశమంత స్వేచ్ఛ ఇచ్చారు. ‘అందరికీ అర్థమవుతుందో లేదో అని సినిమా భాషను ఈ పాటలో వాడొద్దు. 1920 ప్రాంతాల్లో ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో ఉన్న పలుకుబడినే పాట కోసం ఉపయోగించండి. దృశ్యపరంగా అది అర్థమయ్యేటట్లు ఎలా చూపించాలో నేను చేసుకుంటాను...’ అని ఆయన  చెప్పడంతో నేను ఇక సందేహించలేదు.  ఒక చోట ‘కాల్మోక్తా నీ బాంచను అని వంగి తోగాలా’ అనే పదాన్ని వాడాను. ‘తోగాలా’ అంటే వంగితే ఒక వేళ అని అర్థం. ఆదిలాబాద్‌ ప్రాంతంలోనే కాదు తెలంగాణాలోని మిగిలిన ఏరియాల్లో తోగాలా అనే మాట వాడేవారు. అలాగే ఈ పాటలో ఒకచోట ‘తుడుము’ అనే పదం ఉపయోగించాను. దీనికి చాలా మంది రకరకాలుగా అర్థాలు చెబుతున్నారు. తుడుము అంటే ఉడుము కాదండీ. ..గోండు బిడ్డలు అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే వినే ఒక యుద్ధభేరి లాంటి డోలు అది.  ఆ వాయిద్యాన్ని కూడా ఓ తల్లిలా ఇందులో పోల్చాను. పాట విని ఆదివాసి యువకులు నాకు ఫోన్‌ చేసి ‘తుడుమును కూడా తల్లిని చేశావన్నా’ అని ఆర్ధ్రమైన గొంతుతో అన్నారు.  అలాగే  తెలుగులో ‘రగ రగ’ అనే పదం లేదండీ. ‘భగభగ.. భుగభుగ’ అని ఉంది కానీ  నేను వాడిన రగరగ అనే పదం కీరవాణిగారికి, రాజమౌళిగారికి, విజయేంద్రప్రసాద్‌గారికి బాగా నచ్చింది. 


మా ఆవిడకు కూడా చూపించలేదు

  పాట రాసి ఇచ్చేసిన తర్వాత ‘ మేం రిలీజ్‌ దీన్ని  చేసేవరకూ మీరు దీనిని ఎవరికీ వినిపించవద్దు సార్‌’ అని రాజమౌళిగారు ముందే చెప్పి కాన్ఫిడెన్షియల్‌గా ఉంచమన్నారు. దాంతో దాదాపు రెండున్నర ఏళ్లు ఈ పాటను ఇంట్లో శ్రీమతికి కూడా వినిపించకుండా దాచిపెట్టాను. తెలంగాణ పదజాలం, భావజాలం, పలుకుబడిని ఉపయోగిస్తూ నేను రాసిన  ఈ పాటకు అద్భుతమైన స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది.  నా 29 ఏళ్ల కెరీర్‌లో ఎన్నడూ ఎరుగని  స్పందన అది.  నేను మృత్యువు నుంచి బయట పడింది ఈ ఆనందాన్ని చవి చూడడం కోసమేనేమో! బాలుగారు జీవించి ఉంటే ఈ పాట ఆయన పాడేవారు కదా అని నాకు మొదట అనిపించింది. అయితే కాలభైరవ ఆ లోటు తీర్చి అద్భుతంగా పాడారు.  నేను ఉపయోగించిన తెలంగాణ పలుకుబడిలో ఉన్న  ‘రా’ నెస్‌, భైరవ గొంతులోని ‘రా’ నెస్‌ అద్భుతంగా కలసి డబుల్‌ ఆర్‌ అయ్యాయి. సినిమా పేరు త్రిబుల్‌ ఆర్‌. ఈ పాట డబుల్‌ ఆర్‌. 

వినాయకరావు


తెలంగాణ భావజాలం, పలుకుబడిని ఉపయోగిస్తూ నేను రాసిన  ఈ పాటకు అద్భుతమైన స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. నా 29 ఏళ్ల కెరీర్‌లో ఎన్నడూ ఎరుగని  స్పందన అది. నేను మృత్యువు నుంచి బయట పడింది ఈ ఆనందాన్ని చవి చూడడం కోసమేనేమో! 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement