జెలెన్‌స్కీతో నేరుగా చర్చించాలని పుతిన్‌కు చెప్పాను : బైడెన్‌తో మోదీ

ABN , First Publish Date - 2022-04-12T23:28:26+05:30 IST

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో ముఖాముఖి చర్చలు

జెలెన్‌స్కీతో నేరుగా చర్చించాలని పుతిన్‌కు చెప్పాను : బైడెన్‌తో మోదీ

న్యూఢిల్లీ : ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీతో ముఖాముఖి చర్చలు జరపాలని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు తాను చాలాసార్లు చెప్పానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెప్పారు. బైడెన్, మోదీ సోమవారం వర్చువల్ విధానంలో జరిపిన చర్చల్లో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి చర్చించినపుడు ఈ విషయం తెలిపారు. 


బైడెన్, మోదీ సమావేశంతో వార్షిక 2 ప్లస్ 2 మినిస్టీరియల్ డయలాగ్ ప్రారంభమైంది. ఉక్రెయిన్‌లో శత్రుత్వానికి ముగింపు పలకాలని, ఉక్రెయిన్, రష్యా చర్చలు జరపాలని  వీరిద్దరూ పిలుపునిచ్చారు. జో బైడెన్ మాట్లాడుతూ, ఆరోగ్య భద్రత, వాతావరణ మార్పులకు సంబంధించి తాము కూడా ఆందోళన చెందుతున్నామని చెప్పారు. రక్షణ రంగంలో అమెరికా, భారత్ మధ్య భాగస్వామ్యం పటిష్టంగా ఉందన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు భారత దేశం మానవతావాద సహకారాన్ని అందిస్తుండటాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. యుద్ధం వల్ల ఏర్పడిన పరిస్థితులను చక్కదిద్దడానికి సమైక్యంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించుకోవాలని తాము ఎల్లప్పుడూ చెప్తున్నామన్నారు. ఉక్రెయిన్‌లో పరిస్థితి బాధాకరంగా, ఆందోళనకరంగా ఉందన్నారు. బుచ్చలో మారణకాండను తాము ఖండించామని చెప్పారు. ఈ దారుణంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరామని తెలిపారు. త్వరలోనే ఔషధాలతో కూడిన మరొక కన్‌సైన్‌మెంట్‌ను ఉక్రెయిన్‌కు పంపిస్తామన్నారు.  తాను రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులు పుతిన్, జెలెన్‌స్కీలతో అనేకసార్లు మాట్లాడానని చెప్పారు. జెలెన్‌స్కీతో ముఖాముఖి చర్చించాలని పుతిన్‌కు చెప్పానని తెలిపారు. 


ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తాను అనేకసార్లు పుతిన్‌తో మాట్లాడానని తెలిపారు. అదేవిధంగా కొద్ది వారాల క్రితం వరకు దాదాపు 20 వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారని, వారిలో అత్యధికులు యువ విద్యార్థులేనని చెప్పారు. ఎంతో కృషితో వారిని తిరిగి స్వదేశానికి సురక్షితంగా తీసుకురాగలిగామని చెప్పారు. అయితే ఒక విద్యార్థి ప్రాణాలను కోల్పోయారని తెలిపారు. ఈ సమయంలో తాను అనేకసార్లు రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ఫోన్ ద్వారా  మాట్లాడానని చెప్పారు. తాను శాంతి స్థాపన కోసం విజ్ఞప్తి చేయడం మాత్రమే కాకుండా, ఉక్రెయిన్ అధ్యక్షునితో నేరుగా మాట్లాడాలని పుతిన్‌కు విజ్ఞప్తి చేశానన్నారు. భారత దేశ పార్లమెంటులో కూడా ఉక్రెయిన్‌పై విస్తృతంగా చర్చించామని తెలిపారు. 


భారత్-అమెరికా మధ్య సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడటం వల్ల ఇరు దేశాలకు అద్భుతమైన ప్రయోజనం లభిస్తుందని మోదీ, బైడెన్ అంగీకరించారు. ఇరు దేశాల బంధం బలపడటం వల్ల ప్రపంచ శాంతి, సౌభాగ్యం, సుస్థిరత సాధ్యమవుతాయని పేర్కొన్నారు. 


2 ప్లస్ 2 మినిస్టీరియల్ డయలాగ్ కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ వాషింగ్టన్‌ వెళ్ళారు. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. 


Updated Date - 2022-04-12T23:28:26+05:30 IST