నాకు సీఎం అవకాశం ఇవ్వకపోతే..: సిద్ధూ

ABN , First Publish Date - 2022-02-06T22:29:15+05:30 IST

రాహుల్ గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తాను. ఒకవేళ అధికారం నాకు ఇస్తే మాఫియాను నిర్మూలించడానికి ప్రయత్నిస్తాను. ప్రజల జీవన విధానాన్ని మెరుగు పర్చడానికి పని చేస్తాను. ఒకవేళ అధికారం ఇవ్వకపోతే..

నాకు సీఎం అవకాశం ఇవ్వకపోతే..: సిద్ధూ

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని మరికొద్ది సేపట్లో ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రకటించనున్న నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను అంగీకరిస్తానని సిద్ధూ తెలిపారు. వాస్తవానికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా అనంతరం సిద్ధూనే ముఖ్యమంత్రి అవుతారని చాలా మంది అనుకున్నారు. కానీ, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ చరణ్‌జిత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్.


ఇక వచ్చే ఎన్నికల్లో సిద్ధూనే ముఖ్యమంత్రనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. కానీ, కొద్ది సమయంలో చన్నీ తన ఇమేజ్‌ను విపరీతంగా పెంచుకున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌తో కానీ, ప్రజల్లో కానీ చన్నీ బాగా పేరు తెచ్చుకున్నారు. దీంతో మళ్లీ చన్నీకే ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కంటే కాంగ్రెస్ పార్టీలో ఈ చర్చే ఎక్కువగా జరుగుతోంది. అయితే దీనికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఫిబ్రవరి 6న (ఈరోజు) ముఖ్యమంత్రిని అభ్యర్థిని ప్రకటిస్తారని పార్టీ పేర్కొంది.


కాగా, దీనికి ముందు సిద్ధూ మాట్లాడుతూ ‘‘రాహుల్ గాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తాను. ఒకవేళ అధికారం నాకు ఇస్తే మాఫియాను నిర్మూలించడానికి ప్రయత్నిస్తాను. ప్రజల జీవన విధానాన్ని మెరుగు పర్చడానికి పని చేస్తాను. ఒకవేళ అధికారం ఇవ్వకపోతే, అవకాశం ఇచ్చే వారితో నవ్వుతూ పని చేస్తాను’’ అని అన్నారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ, సీఎం చన్నీ అక్కడే ఉన్నారు.

Updated Date - 2022-02-06T22:29:15+05:30 IST