తెల్లారేదాకా బతికి ఉంటానో లేదో తెలీదు.. ప్లీజ్.. వచ్చి తీసుకెళ్లు.. అంటూ అన్నకు యువతి ఫోన్.. చివరికి జరిగిన దారుణం ఇది..

ABN , First Publish Date - 2021-09-02T02:47:18+05:30 IST

మరో దారుణం.. సాయం కోసం అన్నకు ఫోన్ చేసిన తరువాత.. వివాహిత మరణం

తెల్లారేదాకా బతికి ఉంటానో లేదో తెలీదు.. ప్లీజ్.. వచ్చి తీసుకెళ్లు.. అంటూ అన్నకు యువతి ఫోన్.. చివరికి జరిగిన దారుణం ఇది..

ఇంటర్నెట్ డెస్క్:  ‘‘వీలైతే ఇప్పుడే వచ్చేయ్.. నన్ను తీసుకెళ్లిపో.. నేను ఇంటికొచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. మా ఆయన, వాళ్ల అమ్మా నన్ను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. తెల్లారేవరకూ నేను బతికుంటానో లేదో కూడా తెలీదు’’ ఇదీ తన అన్నతో ఓ వివాహిత ఫోన్ సంభాషణ. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆమె మరణించింది. కేరళలో ప్రస్తుతం ఈ కేసు కలకలం రేపుతోంది. తొలుత ఆమె ఆత్మహత్యకు పాల్పడిందన్న వాదన తెరపైకి వచ్చింది. ఆ తరువాత.. ఆమె తన అత్తారింట్లో నరకయాతన అనుభవించిందన్న విషయం వెలుగులోకి రావడంతో ఈ ఘటన రాష్ట్రంలో సంచలనానికి దారితీసింది. 


కేరళకు చెందిన సునీష(26) అనే మహిళకు ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. భర్త పేరు విజీష్. అతడిది పయ్యనూర్. తనకు అత్తారింట్లో వేధింపులు ప్రారంభమయ్యాయంటూ ఆమె పెళ్లైన కొంతకాలానికే తన పుట్టింటి వారికి ఫిర్యాదు చేసింది. సాయం చేయాలని కోరింది.  ‘‘భర్త తనను ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడని సునీష చెప్పేది. అత్తగారు తన జుట్టుపట్టుకుని గుంజేవారనేది. ఒక సమయంలో మామగారు తనను హెల్మెట్ తీసుకుని కొట్టారట. ఈ విషయాలను మాకు చెప్పినందుకు ఆమె నుంచి సెల్ ఫోన్ కూడా లాగేసుకున్నారు. గత నెల రోజులుగా ఆమె కడుపు నిండా ఆహారం తీసుకోవడం కూడా మానేసింది.’’ అని సునీష బంధువు ఒకరు తాజాగా మీడియాకు తెలిపారు.  


తాము సునీషను పుట్టింటికి తీసుకొచ్చేందుకు పలు మార్లు ప్రయత్నించినా విజీష్ అడ్డుకున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఉపయోగం లేకపోయిందని చెప్పారు. భర్తకు రాజకీయ పలుకుబడి ఉందని కూడా సునీష తమను హెచ్చరించిందని వారు పేర్కొన్నారు. ‘‘పోలీసులు విజీష్ కుటుంబంతో మాట్లాడేవారు. ఆ తరువాత మాతో మాట్లాడి.. రేపు వస్తుంది మాపు వస్తుందని చెప్పుకొచ్చేవారు. మేం ఎదురు చూస్తూ ఉండేవాళ్లం చివరికి ఒకరోజు..సునీష ఫోన్ చేసి ఎలాగొలా ఇక్కడే సద్దుకు పోతానని చెప్పింది. ఇంతలో ఈ దారుణం జరిగింది’’ అని సునీష బంధువు వాపోయాడు. కాగా.. భర్త, అత్తమామలు తనను వేధిస్తుండగా సునీష రికార్డు చేసిన ఆడియో క్లిప్పింగులు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం అయ్యాయి. ‘వాయిస్ రికార్డు చేస్తే చేసుకో.. నేనేం భయపడేది లేదు’ అని భర్త అన్నట్టు ఈ ఆడియోలో వినపడుతోంది. ప్రస్తుతం ఈ కేసు రాష్ట్రంలో కలకలం సృష్టిస్తోంది. 


Updated Date - 2021-09-02T02:47:18+05:30 IST