ముఖాన్ని దాచుకోవాలనుకోలేదు...

ABN , First Publish Date - 2022-07-07T09:09:45+05:30 IST

‘‘మాది ఢిల్లీకి చెందిన మధ్యతరగతి కుటుంబం. స్వతంత్రంగా బతకాలనీ, జీవితంలో విజయం సాధించాలనీ, నాకంటూ ఒక ప్రపంచం నిర్మించుకోవాలనీ కలలు కనేదాన్ని.

ముఖాన్ని దాచుకోవాలనుకోలేదు...

జీవితం గురించి ఆమె కన్న కలలన్నీ యాసిడ్‌ దాడితో కుప్పకూలిపోయాయి. అయినా ఆత్మస్థైర్యంతో నిలబడ్డారు షహీన్‌ మాలిక్‌. ఇప్పుడు తనలాంటి వందలమందికి అండగా నిలుస్తున్నారు. వారి సంక్షేమం కోసం, హక్కుల కోసం షహీన్‌ సాగిస్తున్న పోరాటం గురించి ఆమె మాటల్లోనే...


‘‘మాది ఢిల్లీకి చెందిన మధ్యతరగతి కుటుంబం. స్వతంత్రంగా బతకాలనీ, జీవితంలో విజయం సాధించాలనీ, నాకంటూ ఒక ప్రపంచం నిర్మించుకోవాలనీ కలలు కనేదాన్ని. సంప్రదా యాలంటూ మా ఇంట్లో అభ్యంతరాలు ఎదురైనా... నా ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి ఎల్లప్పుడూ పోరాడేదాన్ని. అయితే డాక్టర్‌ లేదా ఐఎఎస్‌ కావాలనే నా కోరికను మాత్రం ఇంటి పరిస్థితుల కారణంగా పక్కన పెట్టాల్సి వచ్చింది. ఎంబిఏ చేస్తూనే... ఒక ఆఫీసులో పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేసేదాన్ని. అక్కడ మా బాస్‌ కన్ను నా మీద పడింది. నన్ను లొంగదీసుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. దాంతో ఆ ఉద్యోగం మానేద్దా మనుకున్నాను. కానీ నా సర్టిఫికెట్లు ఇవ్వనంటూ అతను బెదిరించాడు. ఈ విషయం మీద ఒక రోజు అతనితో ఘర్షణ జరిగింది. నిర్బంధించడానికి అతను ప్రయత్నిస్తే ప్రతిఘటించా. అతను ఎవరితోనో పోన్లో మాట్లాడాడు. నన్ను వెళ్లిపొమ్మన్నాడు. బయటికి వచ్చాను. రోడ్డు మీద ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతను హఠాత్తుగా నా ముఖం మీద యాసిడ్‌ పోశాడు.


ఇరవైకి పైగా సర్జరీలు...

పట్టపగలు.... రోడ్డు మీద జనం చూస్తూ ఉండగానే ఈ దాడి జరిగింది. కేకలు వేశాను. చుట్టూ జనం చేరారు. కానీ నాకు ఎలా సాయం చెయ్యాలో వారికి తెలియలేదు. ఈలోగా నా ముఖం మీద ఎవరో నీరు చల్లారు. నిప్పుల వర్షం కురుస్తున్నట్టు విలవిలలాడాను. ఇక్కడున్న వారికి యాసిడ్‌ దాడుల పట్ల తగిన అవగాహన లేకపోవడం వల్ల... నన్ను ఆసుపత్రిలో చేర్చడంలో జాప్యం జరిగింది. నిజానికి పోలీస్‌ కేసు అవుతుందన్న భయంతో కొన్ని ఆసుపత్రులు నన్ను చేర్చుకోవడానికి నిరాకరించాయి. ఆ దాడిలో ఒక కన్ను పూర్తిగా పోయింది. మరో కంటి దృష్టి  దెబ్బతింది. నా ముఖాన్ని పునరుద్ధరించడం కోసం ఇరవైకి పైగా సర్జరీలు జరిగాయి. చికిత్సలు, ఆపరేషన్ల కోసం లక్షలు ఖర్చయ్యాయి. 2009లో జరిగిన ఈ సంఘటన తరువాత నా జీవితం కుప్పకూలిపోయింది. సర్జరీ చేయించుకున్న ప్రతిసారీ మళ్ళీ బతుకుతానో లేదో అనిపించేది. 


నాలాగ ఎందరో...

దాడి జరిగిన తరువాత నేను చాలా రోజులు బయటకు రాలేదు. తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిపోయాను. యాసిడ్‌ దాడి బాధితుల్లో మానసిక కల్లోలం ఒక ఎత్తయితే... వారికి ఎదురయ్యే ఆర్థిక సంక్షోభం మరో ఎత్తు. మందులకు, చికిత్సకు చాలా ఖర్చవుతుంది. నేను మందులు వాడకుండా ఒక్క రోజైనా గడవదు. ఇది జీవితాంతం కొనసాగే ప్రక్రియ. ఈ పరిస్థితి నాది మాత్రమే కాదు, నాలాంటి బాధితులందరిదీ.   బయటకు వచ్చి చూస్తే... యాసిడ్‌ దాడుల బాధితులు ఎందరో కనిపించారు. ‘ఇన్నాళ్ళూ చీకటి గదులకే పరిమితం అయ్యాను. ఇకమీదట నాలాంటి బాధితుల కోసం ఏదైనా చెయ్యాలి’ అనుకున్నాను. ఒక ఎన్జీవో గురించి తెలిసి, అందులో చేరాను. ఆ తరువాత... యాసిడ్‌ దాడి బాధితులకు సాయపడే అనేక స్వచ్ఛంద సంస్థల్లో భాగస్వామిని అయ్యాను. ఎన్నో సంస్థలతో కలిసి పని చేశాక... ‘బ్రేవ్‌ సోల్‌ ఫౌండేషన్‌’ పేరిట ఒక ఎన్‌జీఓను ప్రారంభించాను. ఈ సంస్ధ ద్వారా ఇప్పటి వరకూ మూడు వందల మందికి పైగా యాసిడ్‌ దాడుల బాధితులకు సాయపడ్డాం. కౌన్సెలింగ్‌ ద్వారా మానసిక స్థైర్యం, వైద్య సహకారం, సకాలంలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యేలా చూడడం, న్యాయ సహకారాన్ని అందించడం లాంటివి చేస్తున్నాం. వారు తమ కాళ్ళపై నిలబడి ఆర్థికంగా సాధికారత సాధించేలా చూస్తున్నాం. 


సిగ్గుపడాల్సింది వాళ్ళే...

అందవికారంగా మారిపోయిన నా ముఖాన్ని దాచుకోవాలని ఎప్పుడూ నేను అనుకోలేదు. యాసిడ్‌ దాడి చేసిన వాళ్ళు రోడ్ల మీద స్వేచ్ఛగా తిరుగుతున్నప్పుడు... బాధితులమైన మేము ముఖం ఎందుకు దాచుకోవాలి? ఇక్కడ తప్పు చేసింది మేము కాదు. తప్పు చేసినవాళ్ళు సిగ్గుతో మొహం దాచుకోవాలి. దాడి తరువాత నా జీవితం నాకెంతో నేర్పింది. జాతీయ స్థాయిలో ‘క్యాంపెయిన్‌ అగైనెస్ట్‌ యాసిడ్‌ అటాక్స్‌’కు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నాను.  నేను ప్రభుత్వం నుంచి కానీ, ఇతరత్రా కానీ ఎలాంటి సాయం తీసుకోలేదు. యాసిడ్‌ విక్రయాల మీద నిషేధం విధించాలని న్యాయస్థానాల్లో పోరాడుతున్నాను. దీనికి ప్రజల నుంచి మద్దతు కోరుతున్నాను. యాసిడ్‌ బాధితులకు వైద్య సాయం మాత్రమే కాదు.. ఆర్థికంగా, న్యాయపరంగా, భావోద్వేగపరంగా మద్దతు కావాలి. వేల కేసుల్లో ఇప్పటిదాకా ఎఫ్‌ఐఆర్‌లే నమోదు కాలేదు. బాధితులకు ఉచిత చికిత్సను సుప్రీంకోర్టు తప్పనిసరి చేసినా... అది సరిగ్గా అమలు కావడం లేదు. పరిహారంలో వైద్య ఖర్చులు భాగం కాకూడదు. ఎందుకంటే చికిత్సకు చాలా ఖర్చవుతుంది. పరిహారం అంతా వాటికే పోతే... ఇక బాధితులు ఎలా బతుకుతారు? ప్రధానంగా... బాధితులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలి. అప్పుడే ఆర్థిక స్వతంత్రం సాధించడానికీ, ఆత్మవిశ్వాసాన్ని తిరిగి సమకూర్చుకోవడానికీ వీలవుతుంది. ఈ అంశాలన్నిటిపైనా వివిధ వేదికల మీద నా గళాన్ని గట్టిగా వినిపిస్తున్నాను.’

Updated Date - 2022-07-07T09:09:45+05:30 IST