Abn logo
Mar 7 2021 @ 00:00AM

నాకు మరొకరి అవసరం లేదు!

నటిగా దక్షిణాది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న తెలుగమ్మాయి గౌతమి కేన్సర్‌పైనా విజయం సాధించారు. తాను గెలవడమే కాదు ఇప్పుడు వందలాది మందిని ఆ మహమ్మారిని జయించి నవ్వుతూ బతికేలా చేస్తున్నారు. ఒకవైపు సామాజిక కార్యక్రమాల్లో, మరోవైపు రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్న గౌతమి ‘నవ్య’తో  ప్రత్యేకంగా పంచుకున్న ముచ్చట్లివి...


‘‘తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నాయి కదా, కాస్త బిజీగా ఉన్నమాట వాస్తవమే. నాకు వాజ్‌పేయి, మోదీ అంటే ఇష్టం. నేను ఎప్పుడో బీజేపీలో చేరాను. బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశాను. అయితే మా అమ్మాయి బాగోగులు చూడడం కోసం రాజకీయాలకు కొంత దూరం జరిగాను. ఇప్పుడు మళ్లీ క్రియాశీలకంగా పని చేస్తున్నాను. విరుదునగర్‌ జిల్లా రాజపాళయం శాసనసభ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నాను. అక్కడే ఇల్లు తీసుకున్నాను. ఎక్కువగా అక్కడే ఉంటున్నాను. మూడు నాలుగేళ్లుగా మా ఫౌండేషన్‌ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన పలు కార్యక్రమాలను తమిళనాడులో చేపడుతున్నాం. రాజపాళయంలోనూ సేవా కార్యక్రమాలు చేశాం. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి సమాజానికి దూరంగా ఉన్న వారిని వెతుక్కుని మరీ వెళ్తాను. వారిలో ఆత్మవిశ్వాసం నింపడం, వారికి అండగా నిలవడం నా ప్రధానోద్దేశం. 35 ఏళ్లుగా నా ఇల్లు, నా ప్రపంచం అంతా తమిళనాడే!


మా నాన్నగారిది నిడదవోలు పక్కనున్న తాడిమళ్ల. అమ్మగారిది కాకినాడ. నేను కడుపులో ఉండగా హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో గొడవలు జరిగాయట. దాంతో మరో రెండు వారాల్లో డెలివరీ అనగా అమ్మను కారులో ఎక్కించి ఆంధ్రాకు పంపించారట. అయితే శ్రీకాకుళం వెళ్లేసరికి అమ్మకి పురిటినొప్పులు వచ్చాయి. అక్కడే నేను పుట్టాను. మా ఇంటిపేరు తాడిమళ్ల. అమ్మ, నాన్న ఇద్దరూ వైద్యులే. నాలుగేళ్ల వయసు వరకూ వైజాగ్‌లో తరువాత కేరళ, బెంగళూరు హాస్టల్లో ఉన్నాను. 15వ ఏట మళ్లీ వైజాగ్‌ వెళ్లి, రెండేళ్లపాటు అక్కడే ఉన్నాను. 


మా కులం ఏంటో నాకు తెలియదు..

బెంగళూరులో చదువుకుంటూ వైజాగ్‌ వచ్చాను. అక్కడ గీతంలో ఇంటర్‌లో చేరాను. నా పక్కన కూర్చొన్న ఒకమ్మాయి ‘మీరేమిట్లు’ అనడిగింది. ఆమె అడుగుతున్నదేమిటో అప్పటికీ నాకు అర్థం కాలేదు.  ఇంటికెళ్లాక మా నాన్నగారికి ఈ విషయం చెప్పాను. ‘‘ఆ అమ్మాయి ఏదో ఇడ్లీయో, అట్లో ఏదో అంది పప్పా... నాకేమీ అర్థం కాలేదు. ఆమె అడిగిందేమిటీ?’’ అన్నాను. ‘‘ఏమందమ్మా’’ అని అడిగారు. ‘‘మీరు ఏమి ట్లీయో, డ్లీయో... ఏదో అంది’’ అని చెప్పాను. ‘‘ఏమిట్లు అనడిగిందా?’’ అన్నారు. ‘‘అవును’’ అని చెబితే... పెద్దగా నవ్వుతూ ‘‘ఆ మాటకు నీకు అర్థం తెలియనందుకు నేను చాలా గర్వపడుతున్నాను’’ అని నన్ను కౌగిలించుకుని అభినందించారు. మా కులం ఏంటో నాకు తెలియదు. ఎప్పుడూ మాట వరుసకు కూడా కుల ప్రస్తావన చేయను. ఇప్పటిదాకా ఏ అప్లికేషన్‌ ఫారంలోనూ కులం పేరు రాయలేదు. మొదట్లో మతం కాలం కూడా పూర్తి చేసేదాన్ని కాదు. 


ఎంసెట్‌ కోసం వెళ్తే... నటిగా ఛాన్స్‌ వచ్చింది...

మా కుటుంబంలో సినిమా రంగానికి చెందిన వారెవరూ లేరు. ఎంసెట్‌లో ర్యాంక్‌ వస్తే ప్లేస్‌మెంట్‌ కోసం నాన్నగారితో కలిసి హైదరాబాద్‌ వెళ్లాను. ఆ సమయంలో మా కజిన్‌ వారి ఇంటికి భోజనానికి వెళ్లాం. ఆ ఇంటి పక్కనే విజయచందర్‌గారు ఉండేవారు. అప్పట్లో ‘దయామయుడు’ సినిమా చేస్తున్నారాయన. నన్ను చూసి ‘‘మా సినిమాలో ‘వెరోనికా’ పాత్ర కోసం ఈమె సరిపోతుంది, పంపించండి’’ అని అడిగారు. నాకు సినిమాలు చూసే అలవాటు లేదు. ప్లేస్‌మెంట్‌ అయిపోవడంతో వైజాగ్‌ వచ్చేశాం. కానీ విజయచందర్‌ గారు మాత్రం కంటిన్యూగా మా నాన్నగారికి ఫోన్‌ చేసి అడుగుతూనే ఉన్నారు. మా అమ్మ నాన్నలకు కళలంటే ఇష్టం. ఫైన్‌ ఆర్ట్స్‌ అంటే ఇక చెప్పక్కర్లేదు. విజయచందర్‌ గారు కూడా సర్ది చెప్పడంతో వారు నన్ను కూర్చోబెట్టి విషయం వివరించారు. ‘ఈ అవకాశం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు ఎప్పుడైనా చదువుకోవచ్చు. కానీ ఈ అవకాశం పోతే రాదు. నువ్వే నిర్ణయించుకో’ అని చెప్పారు. దాంతో ఆలోచించుకుని ‘‘సరే, ఒకసారి చేసి చూద్దాం’’ అని నిర్ణయించుకున్నాను. అలా ‘దయామయుడు’లో వెరోనికా పాత్ర చేశాను. 


ఆ సమయంలో ప్రముఖ దర్శకుడు పీఎన్‌ రామచందర్‌రావు గారు ‘గాంధీ నగర్‌ 2వ వీధి’ సినిమాలో హీరోయిన్‌ కోసం చూస్తున్నారు. ‘దయామయుడు’ ఫుటేజీ చెన్నై ల్యాబ్‌లో ఫోకస్‌ చేయడంతో ఇండస్ట్రీలోకి కొత్త అమ్మాయి వచ్చిందంటూ టాక్‌ వచ్చింది. దాంతో రామచందర్‌రావుగారు నా ఫోన్‌ నెంబరు దొరకబట్టుకొని మా ఇంటికి ఫోన్‌ చేయడం మొదలుపెట్టారు. నాకేం అర్థం కాలేదు. నేనేమో ఎంబీఏ చేయడానికి బోలెడన్ని ప్లాన్స్‌ పెట్టుకున్నాను. రామచందర్‌రావు గారు ఫైనల్‌గా ఒకసారి అమ్మతో మాట్లాడారు. ‘సినిమా ఇండస్ట్రీ గురించి మీరు విన్నదంతా నిజం కాదు. మీరు ఒకసారి చెన్నై రండి. మమ్మల్ని కలవండి, యూనిట్‌తోనూ మాట్లాడండి. మీకు కంఫర్టబుల్‌గా అనిపిస్తేనే సినిమా చేయండి. అప్పటికీ నచ్చకుంటే వెంటనే మీరు ఫ్లయిట్‌లో వెళ్లిపోవచ్చు. నా సినిమాలో హీరోయిన్‌ పాత్రకు మీ అమ్మాయి బాగా సరిపోతుందన్న ఉద్దేశంతోనే ఇంతగా చెబుతున్నాను’ అని సర్ది చెప్పారు. అమ్మ నా అభిప్రాయం అడిగింది. నేనూ ఓకే చెప్పేశాను. దాంతో నేను, అమ్మ కలిసి చెన్నై వచ్చేశాం. చెన్నైలో ఆ రోజు రమాప్రభ గారింట్లో భోజనం చేశాం. వారి బ్రదర్‌ కూడా నిర్మాతే. అందరితో కలిసి మాట్లాడాక మాకు సౌకర్యంగా అనిపించింది. దాంతో ఆ సినిమాకు అంగీకరించాం. ఆ తరువాత మురారి గారు తీసిన ‘శ్రీనివాస కల్యాణం’ చేశాను. అది చేస్తుండగానే తమిళ   ఇండస్ట్రీ నుంచి ఒక కాల్‌ వచ్చింది. అది ‘గురు శిష్యన్‌’ సినిమా కోసం. ఆ తరువాత అలా అలా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాను.

చాలా అవకాశాలు మిస్సయ్యా...

మొదట్లో అన్ని భాషల చిత్రాల్లో చేశాను. కానీ ఆ తరువాత డేట్స్‌ కుదరక తెలుగులో పెద్ద సినిమాలు చాలా మిస్సయ్యాను. అప్పట్లో ఏడాదికి 14-15 సినిమాలు చేసేదాన్ని. సమయంతో పాటు పరుగులు పెట్టాల్సి వచ్చేది. డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడం చాలా కష్టమయ్యేది. నాగార్జునతో ‘చైతన్య’ సినిమా చేస్తున్న సమయంలోనే ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమా ఆఫర్‌ వచ్చింది. కానీ డేట్స్‌ కుదరక వదిలేయాల్సివచ్చింది. ఒక సినిమాకు కమిట్‌ అయ్యాక, పెద్ద అవకాశం వచ్చిందని ఆ సినిమాను వదిలేసి వెళ్లే అలవాటు నాకు లేదు.


ఏదో మిస్సవుతున్నానేమో అనిపించింది..!

ఏడున్నరేళ్లలో 120కి పైగా సినిమాలు చేశాను. అంటే గడియారం ముల్లుతో పాటే పరుగులు పెడుతూ పని చేశాను. ఒక దశలో జీవితం గురించి ఆలోచిస్తున్నప్పుడు.. ఏదో మిస్సవుతున్నానేమో అనిపించింది. నా జీవితంలో ఒక బిడ్డ అవసరం అనిపించింది. కానీ కెరీర్‌, డబ్బు, కుటుంబం... ఇవన్నీ  కావాలంటే కుదరదు. ఎక్కడో ఒకచోట బ్రేక్‌ వేయక తప్పదనిపించింది. 1997లో అనుకుంటా... ఒకరోజు ఉదయం నిద్రలేచి అమ్మ దగ్గరకు వెళ్లాను. ‘’అమ్మా! బ్రేక్‌ తీసుకోవాల్సిన సమయం వచ్చినట్లుంది. సినిమాయే జీవితం కాదు, బయటి ప్రపంచం కూడా చూడాలనుకుంటున్నాను’’ అని చెప్పేశాను. అంతే! అప్పటికప్పుడే మా మేనేజర్‌కి ఫోన్‌ చేసి ఎన్ని ప్రాజెక్టులున్నాయి, ఎంతకాలం పడుతుంది! అని తెలుసుకొని. ఇకమీదట సినిమాలు తగ్గిద్దామని ఆయనకు చెప్పేసింది. సినిమాల్లో నటించాలన్న నిర్ణయమూ నాదే, బ్రేక్‌ తీసుకోవాలన్న నిర్ణయమూ నాదే. 1998లో సందీప్‌ భాటియాతో పెళ్లి అయిన ఏడాదికే మా పాప పుట్టింది.


నాది లవ్‌ కం అరేంజ్డ్‌ మ్యారేజ్‌. మూడేళ్ల తర్వాత ఆ బంధం తెగిపోయింది. ఒక బంధం కొనసాగాలంటే ఇద్దరి మఽధ్య అవగాహన, ఇద్దరికీ సమాన బాధ్యత ఉండాలి. అలా లేని బంధం ఎక్కువకాలం మనలేదు. నా జీవితంలోనూ అదే జరిగింది. ఆ తర్వాత నుంచి, నా జీవితంలో ఎప్పుడూ ఒంటరిగా లేను. ఎందుకంటే నాలో నేనున్నాను. నాకు మరో వ్యక్తి అవసరం లేదు. ఏ విషయమైనా మా అమ్మాయితో మనసు విప్పి మాట్లాడతాను. నా గతం, వర్తమానం అన్నీ ఆమెకు తెలుసు. నాకు కేన్సర్‌ ఉందని తెలిసే సరికి తను చాలా చిన్నది. ఆ వయసులో ఆమెకు ఎలా అర్థమవుతోందో అలా చెప్పాను. కేన్సర్‌ను ఎదుర్కొనే ప్రతి దశ గురించీ ఆమెకు విఫులంగా చెప్పాను. నేను ఆస్పత్రిలో ఉంటే, ఆమె స్కూలు అయ్యాక వచ్చి బ్యాగ్‌ పక్కన పడేసి... కార్టూన్లు చూసుకుంటూ ఉండేది. మరో వైపు నాకు కీమో థెరపీ జరుగుతుండేది. 


ఎంతో బెంగ పడ్టాను...

నాకు బ్రెస్ట్‌ కేన్సర్‌ అని ముందుగా నేనే గ్రహించాను. నాకు నేనే ‘సెల్ఫ్‌ ఎగ్జామ్‌’ చేసుకొని, దాన్ని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధమయ్యాను. తొలి దశలోనే తెలుసున్నాను కాబట్టి కోలుకొనే అవకాశాలు ఎక్కువే అనిపించింది. కేన్సర్‌ ఉందని తెలిసిన సమయంలో నా బెంగంతా నాకూతురి గురించే. ఆమెకోసమైనా నేను కేన్సర్‌ను జయించాల్సిందే అనిపించింది. ‘తన భవిష్యత్తు ఏమవుతుంది? తన ప్రత్యేక ప్రతిభను ఎవరు గుర్తిస్తారు?. భగవంతుడు నా చేతుల్లో పెట్టిన పనిని నేనే పూర్తి చేయాలి..’ ఇలా సాగేవి నా ఆలోచనలు.


అది ఆమె ఇష్టం..

ఇప్పటివరకూ మా అమ్మాయి సుబ్బలక్ష్మికి కెమెరా ముందుకెళ్లే ఆలోచన లేదు. తను ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ చదువుతోంది. బిహైండ్‌ కెమెరా ఉండడమే తనకు ఇష్టం. సినిమాల్లో నటించాలనుకుంటే ఆమె ఇష్టం. ‘ఎవరేం చెప్పినా గుడ్డిగా అనుసరించకు, నీకు నువ్వుగా ఆలోచించి నీ మనసుకు నచ్చిన నిర్ణయం తీసుకో!’’ అని తనకు చిన్నప్పటి నుంచే చెప్పాను.


ఆ సంతృప్తే వేరు..

మా ఫౌండేషన్‌ పని కోసం ఆరేడేళ్లుగా బయట తిరుగుతూ చాలామందిని గమనిస్తున్నాను. ఏదో కోల్పోయామన్న బాధ వారిలో కనిపిస్తుంది. వారికి ఏదైనా దారి చూపించినప్పుడు కలిగే సంతృప్తి  మరెందులోనూ లేదు.  


సినిమాల్లో నటించేందుకు సిద్ధమే!

ఈ మధ్య వెబ్‌ఫిల్మ్‌ చేయడానికి రాజమండ్రి వెళ్తే ప్రజలు ఎంతో ఆదరించారు. ‘శ్రీనివాస కల్యాణం’ మూవీ క్రేజ్‌ ఇప్పటికీ అంతే ఉందని తెలిసి సంతోషం కలిగింది. నేను సినిమాలు మానేశానని చాలామంది అనుకుంటున్నారు. నిజానికి ఇప్పుడే నేను ఫ్రీ అయ్యాను. ఇంతకాలం సినిమాలు చేయకపోవడానికి కారణం మా అమ్మాయే. ఇప్పుడామె సెటిల్‌ అయింది. కాబట్టి సినిమాల్లో నటించడానికి సిద్ధం. 


కమల్‌ని విమర్శించాల్సి వస్తే..!

అఫ్‌కోర్స్‌! విమర్శిస్తా. రాజకీయ ప్రత్యర్థుల్ని విమర్శించాల్సి వస్తే తప్పదు కదా!


అదే గొప్ప అవకాశం

ప్రతి ఒక్కరికీ జీవితంలో కొన్ని గొప్ప పనులు చేయడానికి అవకాశం వస్తుంది. అన్ని అవకాశాల్లోనూ తల్లిదండ్రులుగా ఉండడం గొప్ప అవకాశం. తల్లి పాత్ర మరీ ముఖ్యమైంది. నా కూతురు నాకు దేవుడిచ్చిన వరం. తను వచ్చాక తను తప్ప మరి ఏ బాధ్యతా, ఏ లక్ష్యం నాకు గొప్పగా అనిపించలేదు.


అలాగైతే ఇవి సాధ్యమయ్యేవా?

కొవిడ్‌ సమయంలో మా మీడియా ఆఫీసులో 15 మందికి పైగానే సిబ్బంది ఉన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆఫీసు సిబ్బందిని బయటకు వెళ్లనీయలేదు. వారికి అక్కడే వండుకొని తినేలా అన్నీ ఏర్పాట్లు చేశాను. ఒక్క పైసా కూడా కోత లేకుండా వారందరికీ జీతాలు ఇచ్చాను. చాలా ప్రాంతాల్లో వందలకొద్దీ బస్తాల బియ్యం, మందులు, లక్షకు పైగా మాస్కులు కూడా పంపిణీ చేశాను. నేను ఆర్థికంగా చితికిపోయు ఉంటే ఇవన్నీ సాధ్యమయ్యేవే కావు.  


తెలుగు రాష్ట్రాలకూ సేవలందిస్తాం...

‘లైఫ్‌ ఎగైన్‌ ఫౌండేషన్‌’ను ఏడెనిమిదేళ్ల క్రితం ఏర్పాటు చేశాను.. ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే ఈ సంస్థ లక్ష్యం. అందులో కూడా కేన్సర్‌, ‘నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌’ (ఎన్‌సీడీ)లపైనే ప్రధానంగా దృష్టి సారించాం. డయాబెటిక్‌, కిడ్నీ డిసీజ్‌, హార్ట్‌ డిసీజ్‌, కొలెస్ట్రాల్‌, బీపీ లాంటివన్నీ ఎన్‌సీడీలే. వీటిపైన అవగాహన కల్పించడం, స్ర్కీనింగ్‌ చేయడం, చికిత్స, లైఫ్‌స్టయిల్‌  కోచింగ్‌ లాంటివి చేపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వారు కేన్సర్‌కు సంబంధించిన అవగాహన, సహాయసహకారాల కోసం 8939663399 ఫోన్‌ నెంబరులో సంప్రతించవచ్చు. నాతో సహా మా సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటాం.’’

డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా  

ప్రత్యేకం మరిన్ని...