Abn logo
Aug 11 2020 @ 23:34PM

విష్ణులా అబద్ధాలు చెప్పడం నాకు రాదు: దేవ కట్టా

నిర్మాత విష్ణు ఇందూరిపై ట్విట్టర్‌ వేదికగా ప్రస్థానం’ దర్శకుడు దేవకట్టా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017లో తను రాసి, రిజిస్టర్‌ చేయించిన ఓ కథ ఐడియాను విష్ణు కాపీ కొట్టారని దేవ కట్టా ఆరోపించారు. దీని గురించి  ‘చిత్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.  ‘‘2015 అక్టోబర్‌లో ‘రాజనీతి’ పేరుతో ఓ  సినిమా రీమేక్‌ చేద్దామంటూ విష్ణు ఇందూరి నా దగ్గరికొచ్చారు. రీమేక్‌ సినిమా చేయడం నాకు ఇంట్రెస్ట్‌ లేదని చెప్పి, ‘మహాభారతం’లో ఓ పాయింట్‌ తీసుకుని ఒక తెలుగుస్టార్‌, ఒక తమిళ స్టార్‌తో మల్టీస్టారర్‌ చేద్దామని చెప్పి రెండు ఐడియాలు ఇచ్చా. అందులో ఒకటి ఎన్టీఆర్‌ బయోపిక్‌. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌తో తీయొచ్చని చెప్పా. కథ చాలా యాంబిషీయస్‌గా ఉంటుందని  కూడా ఆయనకు చెప్పాను. ఇక నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి మధ్య స్నేహం, రాజకీయ వైరం గురించి వివరిస్తూ ఫిక్షనల్‌గా ‘గాడ్‌ఫాదర్‌’లాంటి సినిమా ఇవ్వవచ్చనీ, ఈ ఇద్దరు నాయకుల అభిమానులు ఒకరిని ఒకరు గౌరవించుకునేలా ఈ కథ ఉంటుందనీ నా ఐడియా చెప్పాను. అయితే ఆయనకు ఈ రెండు ప్రాజెక్ట్‌లు చేయడం ఇష్టం లేదు. కాంట్రవర్సీ అవుతుందనీ, సినిమాను ముందుకు వెళ్లనివ్వరని  భయపడ్డారు. . ఇది  జరిగిన ఏడాదికి ఎన్టీఆర్‌ బయోపిక్‌  ప్రకటన వచ్చింది. బాలకృష్ణగారి కన్నా ఆయన తండ్రి గురించి ఎవరూ బాగా చెప్పలేరని నేను సైలైంట్‌గా ఉండిపోయా. అయితే ఆ సినిమా డైరెక్టన్‌ కోసం విష్ణు మళ్లీ నన్ను పిలిచారు. బాలకృష్ణగారి దగ్గరికి వెళ్లేసరికి నేననుకున్న కథ వేరు, అక్కడున్న కథ వేరు అని అర్థమైంది. ‘ప్రస్థానం’ హిందీ రీమేక్‌ కూడా నేను అదే సమయంలో చేస్తుండడంతో సున్నితంగా తిరస్కరించి బయటికొచ్చేశాను. అదే విషయం బాలయ్యకు కూడా చెప్పాను. అక్కడితో ఆ ఇష్యూ క్లోజ్‌ అయింది. తాజాగా సాయిధరమ్‌తేజ్‌ సినిమా చేస్తూ కూడా చంద్రబాబు, వైఎస్సార్‌ కథపై వర్క్‌ చేస్తున్నా. ఎప్పుడో మూడు వెర్షన్లుగా రాసుకొన్న ఆ కథను వెబ్‌ సిరీస్‌లా చేయాలనుకున్నా. ఇంతలో గతంలో నేను చెప్పిన ఐడియాతో సినిమాగా తీస్తున్నట్లు ఇటీవల విష్ణు ప్రకటించారు. నాకు మాట మాత్రమైనా చెప్పకుండా అలా చేయడంతో కోపం వచ్చింది. చంద్రబాబు, వై.ఎస్‌.రాజశేఖరరెడ్డిల కథ నా బ్రెయిన్‌ చైల్డ్‌. ఫిక్షనల్‌గా ఆరు యాంగిల్స్‌లో ఆ కథ రాశా. అతను ఏ యాంగిల్‌లో ఆ కథను టచ్‌ చేసినా నా కథకు పోలికలు రాక మానదు. అందుకే వెనక్కి తగ్గదల్చుకోలేదు. న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. అయితే నిజంగా ఆ ప్రాజెక్ట్‌ను ప్రెస్టీజియస్‌గా తీయాలనుకుంటే మాత్రం అందులో నేనూ భాగస్వామిని అవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఒక గొప్ప కథ చిల్లర ప్రాజెక్ట్‌ కావడం మాత్రం నాకు ఇష్టం లేదు. విష్ణు ఇందూరిలాగా అబద్ధాలు చెప్పడం కూడా నాకు రాదు’’ అని వివరించారు. 

దేవ కట్టా ట్వీట్‌లకు విష్ణు ఇందూరి రిప్లై ఇచ్చారు. ‘‘2015లో ఓ రీమేక్‌ కోసం దేవ కట్టాని కలిశాను. నేను కూడా ఆయనకు ఎన్టీఆర్‌ బయోపిక్‌ బేసిక్‌ స్ర్కీన్‌ప్లేతో ఐడియా ఇచ్చా. అది దేవాకు కూడా నచ్చింది. అంతే కానీ ఆయన ఆ బయోపిక్‌ గురించి ఎలాంటి కథ నాకు చెప్పలేదు’’ అని ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement
Advertisement