నా ప్రమాణం ముస్లింల అభివృద్ధికి మాత్రమే కాదు : నఖ్వీ

ABN , First Publish Date - 2022-07-13T23:19:06+05:30 IST

భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్

నా ప్రమాణం ముస్లింల అభివృద్ధికి మాత్రమే కాదు : నఖ్వీ

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ (Mukhtar Abbas Naqvi) భవితవ్యంపై అనేక ఊహాగానాలు ప్రచారమవుతున్నాయి. ఆయనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నిలపాలని బీజేపీ అధిష్ఠానం గట్టిగా ఆలోచిస్తున్నప్పటికీ, అందుకు ఆ పార్టీలోని కొందరు సీనియర్లు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అంతే గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయనను జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir) లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలం ముగియడంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు పార్టీ నుంచి ఎటువంటి హామీ లభించలేదని చెప్పారు. 


బీజేపీలో సుప్రసిద్ధ ముస్లిం నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ. ఆయన 17 ఏళ్ల వయసు నుంచి ప్రజా జీవితంలో ఉన్నారు. దాదాపు 47 ఏళ్ళ నుంచి  ఆయన రాజకీయాల్లో సేవలందిస్తున్నారు. మూడుసార్లు రాజ్యసభ సభ్యునిగా సేవలందించారు. 


తాను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా మైనారిటీల అభివృద్ధికి ఎంతో కృషి చేశానని చెప్పారు. ఉప రాష్ట్రపతి లేదా జమ్మూ-కశ్మీరు లెఫ్టినెంట్ గవర్నర్ - ఈ రెండు పదవుల్లో దేనిని తనకు ఇస్తారో తనకు తెలియదని చెప్పారు. 


బుజ్జగింపులు లేవు

గతంలో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటే కేవలం ముస్లింల మంత్రిత్వ శాఖగా ఉండేదన్నారు. ప్రస్తుతం ముస్లింలతోపాటు క్రైస్తవులు, పారశీకులు, బౌద్ధులు, జైనులు, సిక్కులను కూడా కలుపుకుని పోతున్నట్లు తెలిపారు. తన మంత్రిత్వ శాఖ చాలా హుందాగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. గతంలో మాదిరిగా బుజ్జగింపులకు పాల్పడటం లేదన్నారు. మోదీ ప్రభుత్వం ఎవరిపైన అయినా వివక్ష చూపించినట్లు ఎవరూ ఆరోపించలేరని చెప్పారు. 


ముస్లింల అభివృద్ధి మాత్రమే కాదు

దేశ జనాభాలో ముస్లింలు 16 శాతం మంది ఉన్నారని, మోదీ మంత్రివర్గం నుంచి నఖ్వీ నిష్క్రమణ తర్వాత, ముస్లింలకు ప్రాతినిధ్యం లేదని కొందరు ఆరోపిస్తుండటంపై ఆయన స్పందిస్తూ, తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు, కేవలం ముస్లింలను మాత్రమే అభివృద్ధి చేస్తానని ప్రమాణం చేయలేదన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని అందరు మంత్రులు రాజ్యాంగబద్ధంగా ప్రతిజ్ఞ చేశారని చెప్పారు. 


బీజేపీకి ఓటు వేయడంలో వివక్ష ఎందుకు?

‘అందరితో కలిసి, అందరి అభివృద్ధి, అందరి కృషి’ అనేది బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానం, ఉద్దేశం అని తెలిపారు. గతంలో ముస్లిం సమాజాన్ని రాజకీయంగా దోచుకున్నారని, ఉద్దేశపూర్వకంగా రాజకీయ సాధికారతకు దూరం చేశారని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) 3.31 కోట్ల మందికి గృహ నిర్మాణ పథకం క్రింద ఇళ్లను ఇచ్చారని, వీటిలో 31 శాతం ఇళ్ళను మైనారిటీలకు ఇచ్చారని తెలిపారు. కిసాన్ సమ్మాన్ నిధి (Kisan Samman Nidhi)లో మైనారిటీల వాటా 35 శాతమని తెలిపారు. ముద్రా యోజనలో 35 శాతం వాటాను మైనారిటీలు పొందారన్నారు. తాము అభివృద్ధిలో వివక్ష చూపనపుడు, తమకు ఓటు వేయడంలో ఏ సమాజమైనా ఎందుకు వివక్ష చూపించాలని ప్రశ్నించారు. 


దేశంలోని అతి పెద్ద మైనారిటీ వర్గానికి రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయని కొందరు అంటుండటంపై మాట్లాడుతూ, ఎవరైనా ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ కాలేకపోతే, ఉగ్రవాది అయిపోడన్నారు. ఇలాంటి ఆలోచనలు అభివృద్ధి మార్గం నుంచి ఓ వర్గాన్ని వేరు చేసే ప్రయత్నమేనని చెప్పారు. 


ఆ పార్టీలు చేసినదేమిటి?

మెజారిటీ ముస్లిం ఓట్లను పొందే పార్టీలు మైనారిటీలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చాయని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముస్లింలకు బీజేపీ అవకాశం ఇవ్వడం లేదనే విమర్శలపై స్పందిస్తూ, తాను బీజేపీ టిక్కెట్‌పై ఐదుసార్లు పోటీ చేశానని, నాలుగుసార్లు ఓడిపోయానని చెప్పారు. తాను బీజేపీలో వివిధ స్థాయుల్లో పని చేశానని, పార్లమెంటు, శాసన సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా దాదాపు 350 మంది ముస్లింలకు టిక్కెట్లు ఇచ్చిందని తెలిపారు. ఎన్నికల్లో పరాజయం పొందిన ముస్లింలకు లెజిస్లేచర్ ద్వారా ప్రాతినిధ్యం కల్పించేందుకు బీజేపీ (BJP) ప్రయత్నిస్తోందని చెప్పారు. 


Updated Date - 2022-07-13T23:19:06+05:30 IST