బ్యాటింగ్ చేస్తూ చనిపోయినా పర్వాలేదు: విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్

ABN , First Publish Date - 2020-04-10T02:46:15+05:30 IST

నాకు ఎంతగానో ఇష్టమైన ఆటను ఆడుతూ చనిపోయినా నేను బాధపడను. నాకు ఆ ఆటపై ఉన్న ఇష్టం అలాంటిది... ఈ మాటతో తనకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో...

బ్యాటింగ్ చేస్తూ చనిపోయినా పర్వాలేదు: విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్

సిడ్నీ: నాకు ఎంతగానో ఇష్టమైన ఆటను ఆడుతూ చనిపోయినా నేను బాధపడను. నాకు ఆ ఆటపై ఉన్న ఇష్టం అలాంటిది... ఈ మాటతో తనకు క్రికెట్ అంటే ఎంత ఇష్టమో వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ చెప్పేశాడు. వివ్‌కు హెల్మెట్ ధరించి బ్యాటింగ్‌కు వెళ్లడమంటే తెలియదు. ఎదురుగా ఏ బౌలర్ బౌలింగ్ చేస్తున్నా కేవలం క్యాప్ పెట్టుకుని గ్రౌండ్‌లోకి వచ్చేవారు. డెన్నిస్ లిల్లీ, జెఫ్ థాంప్సన్ వంటి బౌలర్లను కూడా హెల్మెట్ లేకుండానే ఆయన ఎదుర్కొన్నారు. దీనికి తోడు అప్పట్లో బౌన్స్‌కు సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవు. అసలు అలాంటి నిబంధనలు ఉంటాయని కూడా అప్పటి క్రికెటర్లకు తెలియదు.


ఇటీవల ఓ ఇంటర్వూలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్‌తో వివ్ తన జ్ఞాపకాలను పంచుకున్నారు.  మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకోరు అని వాట్సన్ అడగ్గా.. ‘నేను గ్రౌండ్‌లోకి హెల్మెట్ లేకుండా వెళ్లడానికే ఇషపడతా.. అలాంటప్పుడు పెట్టుకుని ఎందుకెళ్లాలి..?’ అని సమాధానమిచ్చారు. ‘నేను మిగతా క్రీడల్లో పాల్గొంటున్న ఆటగాళ్లను ఎప్పుడూ గమనిస్తుంటా.. వారంటే నాకు చాలా గౌరవం. సాధిచాలనుకున్న దాని కోసం ప్రాణాలను కూడా పణంగా పెడతారు వాళ్లు. ఓ ఫార్ములా వన్ రేసర్ కారులో రయ్ మని దూసుకుని వెళ్లూ రేస్‌లో పాల్గొంటాడు. అంతకంటే ప్రమాదకరం ఏముంటుంది’అని రిచర్డ్స్ చెప్పారు. దీనికి వాట్సన్ నవ్వుతూ ‘150 కిలోమీటర్ల వేగంతో వస్తున్న బంతిని హెల్మెట్ లేకుండా ఎదుర్కోవడమే’ అని చమత్కరించారు.


తన డెంటిస్ట్ ఎప్పుడూ మౌత్ గార్డ్ పెట్టుకుని బ్యాటింగ్ వెళ్లమంటాడని, ఒకదానిని తయారుచేసి మరీ ఇచ్చాడని, కానీ తాను అతి తక్కువ సార్లు దానిని ఉపయోగించానని వివ్ చెప్పారు. ‘మౌత్ గార్డ్ వల్ల చూయింగ్ గమ్ నమలడం వీలయ్యేది కాదు. అందుకే  దానిని పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేను బ్యాటింగ్‌కు దిగినప్పుడు నాకు చూయింగ్ మంచి పార్ట్‌నర్. ప్రశాంతంగా ఉండేందుకు అది బాగా ఉపయోగపడుతుంది. అందుకే గ్రౌండ్‌లోకి వస్తున్నానంటే కచ్చితంగా చూయింగ్ గమ్ నములుతూనే వస్తా. అయితే ఎక్కువసేపు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం అది కాస్త చప్పగా తయారవుతుంది. అయినా బాగానే ఉంటుంది’ అని వివ్ రిచర్డ్స్ నవ్వుతూ అన్నారు. ఆట మాత్రమే కాదు.. తెగువ, తనకు నచ్చినట్లు ఉండడం వంటి గుణాలే ఆయనను గొప్ప ఆటగాడిని చేశాయనడానికి ఇంతకంటే ఇంకేం ఉదాహరణలు కావాలి. అందుకే ఆయనను క్రికెట్ దిగ్గజం అంటారు.

Updated Date - 2020-04-10T02:46:15+05:30 IST