సెకండ్‌ వేవ్‌ ఇంత ప్రమాదకరమని ఊహించలేదు

ABN , First Publish Date - 2021-05-11T07:02:00+05:30 IST

సెకండ్‌ వేవ్‌ ఇంత ప్రమాదకరంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అయినప్పటికీ మన శాస్త్రవేత్తలు వేగంగా పరిశోధనలు చేసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను రూపొందించారని ఆయన అన్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లోని పలు విభాగాలను డైరెక్టర్‌ వికాస్‌ భాటియా, డీన్‌ నీరజ్‌ అగర్వాల్‌తో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు.

సెకండ్‌ వేవ్‌ ఇంత ప్రమాదకరమని ఊహించలేదు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో కొవిడ్‌ బెడ్ల సంఖ్య 200కు పెంపు 

దశలవారీగా ఆక్సిజన్‌ బెడ్ల విస్తరణ 

ఐసీయూతో పాటు ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటుకు యోచన 

ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 100 నుంచి 125కు పెంపు 

బీబీనగర్‌ ఎయిమ్స్‌ను సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి 


బీబీనగర్‌, మే 10: సెకండ్‌ వేవ్‌ ఇంత ప్రమాదకరంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అయినప్పటికీ మన శాస్త్రవేత్తలు వేగంగా పరిశోధనలు చేసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ను రూపొందించారని ఆయన అన్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లోని పలు విభాగాలను డైరెక్టర్‌ వికాస్‌ భాటియా, డీన్‌ నీరజ్‌ అగర్వాల్‌తో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. కొవిడ్‌ సెంటర్‌లో ఏర్పాట్లు, పాజిటివ్‌లకు అందుతున్న వైద్య సేవలు, వ్యాక్సినేషన్‌ అంశాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తయారు చేసిన ప్రపంచంలోని నాలుగైదు కంపెనీల్లో మన దేశానికి చెందినవి రెండు ఉండగా, హైదరాబాద్‌ కేంద్రంగా భారత్‌ బయోటెక్‌ ఉండటం గమనార్హం అన్నారు. కరోనా తొలి వేవ్‌ను దేశం సమర్థంగా ఎదుర్కొని ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అయితే కరోనా రెండో దశలో పాజిటివ్‌ల కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందన్నారు. ఆక్సిజన్‌ కొరత తీర్చేందుకు 500 పారిశ్రామిక ఉత్పత్తి కంపెనీల నుంచి వైద్య అవసరాల కోసం ఆక్సిజన్‌ తయారికి ఆదేశించినట్లు తెలిపారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచామన్నారు. 


ఎయిమ్స్‌లో బెడ్ల స్థాయి పెంపు

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో ప్రస్తుతం 50 బెడ్లతో కొవిడ్‌ సేవలు కొనసాగుతున్నాయని, పది రోజుల్లో దశలవారీగా 200 పడకలకు పెంచుతామని కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఐసీయూ యూనిట్‌ ఏర్పాటుకు వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను అందించనున్నట్లు తెలిపారు. 750 పడకల సామర్థ్యంలో ఎయిమ్స్‌ను పూర్తి స్థాయి ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు అద్భుతమైన మాస్టర్‌ ప్లాన్‌ను కేంద్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు. కొన్ని కారణాల వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. మొదటి సంవత్సరం 50 మంది మెడికల్‌ విద్యార్థులకు, రెండో సంవత్సరంలో 62 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు వైద్య విద్యా బోధన అందిస్తున్నామన్నారు. మూడో సంవత్సరం 100 నుంచి 125 మెడికల్‌ సీట్లను విస్తరించనున్నామని తెలిపారు. బీఎస్సీ నర్సింగ్‌, పారామెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు అనుమతి వచ్చిందని, స్థానిక యువతీ, యువకులకు ఇందులో ప్రవేశం కల్పించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చనున్నామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-05-11T07:02:00+05:30 IST