May 17 2021 @ 01:19AM

నేను అడగలేదు... విరాళాలు ఇచ్చాను

కరోనా బాధితుల సహాయార్థం కొందరు నిధులు సమీకరణ కార్యక్రమం చేపట్టారు. ఆ విధంగా చేయడం ప్రశంసనీయం అయినప్పటికీ... తనకు ఇతరుల్ని అలా అడగటం ఇబ్బందిగా ఉంటుందనీ, అందుకని తానెప్పటికీ ‘నిధుల సమీకరణ’ (ఫండ్‌ రైజింగ్‌) కార్యక్రమం ప్రారంభించనని అమితాబ్‌ బచ్చన్‌ వెల్లడించారు. ‘‘నేను అడగలేదు... విరాళాలు ఇచ్చాను’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రశంసల కోసం తాను చేసిన ధానధర్మ కార్యక్రమాల వివరాలు వెల్లడించలేదనీ, తాను నిరుపయోగ వాగ్దానాలు చేయడకుండా నిజంగా సహాయం చేస్తున్నానని చెప్పడానికి మాత్రమే వెల్లడించానని ఆయన వివరించారు. కరోనాపై పోరాటంలో భాగంగా వ్యక్తిగతంగా తాను రూ. 25 కోట్లు సాయం చేశానని అమితాబ్‌ వెల్లడించారు. 


వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్నారు

అమితాబ్‌ బచ్చన్‌ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌ తీసుకున్నారు. అప్పుడు దిగిన ఫొటోను ఆదివారం ఆయన సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ‘‘వ్యాక్సిన్‌ రెండో డోసు తీసుకున్నాను. మా కుటుంబంతో పాటు సిబ్బందికి కొవిడ్‌ వైద్య పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. అభిషేక్‌ త్వరలో వ్యాక్సిన్‌ తీసుకుంటాడు’’ అని అమితాబ్‌ చెప్పారు. అలాగే కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు హాస్పిటల్స్‌కు తాజాగా మరో 10 వెంటిలేటర్లు, 50 ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్లు అందించినట్లు తెలిపారు. గతేడాది కరోనా బారిన పడిన అమితాబ్‌ కోలుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 2న ఆయన తొలి డోసు తీసుకున్నారు.