నా ఫోన్ కెమెరాకి ప్లాస్టర్ వేశాను, ఇక వేయాల్సింది కేంద్రానికే : మమత బెనర్జీ

ABN , First Publish Date - 2021-07-21T21:19:20+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ

నా ఫోన్ కెమెరాకి ప్లాస్టర్ వేశాను, ఇక వేయాల్సింది కేంద్రానికే : మమత బెనర్జీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ బుధవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పెగాసస్ స్పైవేర్‌తో అనేక మంది నేతలపై నిఘా పెట్టినట్లు వస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. ఈ ఆరోపణలపై స్వీయ విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరారు. తాను నిఘా నుంచి తప్పించుకోవడం కోసం తన మొబైల్ ఫోన్‌ కెమెరాకు ప్లాస్టర్ వేసేశానని, ఇక కేంద్ర ప్రభుత్వానికి ప్లాస్టర్ వేయవలసి ఉందని చెప్పారు. అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఆమె వర్చువల్ పద్ధతిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు.


తన మొబైల్ ఫోన్ కెమెరాకు టేప్ అంటించి ఉండటాన్ని మమత బెనర్జీ చూపించారు. వీడియో అయినా, ఆడియో అయినా, అన్నిటినీ ట్యాప్ చేస్తున్నారని మండిపడ్డారు.  పెగాసస్ చాలా ప్రమాదకారి అని, వాళ్ళు (బీజేపీ) జనాన్ని వేధిస్తున్నారని చెప్పారు. తాను ఢిల్లీ, ఒడిశా ముఖ్యమంత్రులతో మాట్లాడలేకపోతున్నానన్నారు. కొన్నిసార్లు తాను ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నానని తెలిపారు. దేశాన్ని నిఘా రాజ్యంగా మార్చాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


దేశంలో స్పైగిరి జరుగుతోందని, మంత్రులు, జడ్జిల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. ఎన్నికల ప్రక్రియ, న్యాయ వ్యవస్థ, మంత్రులు, మీడియా హౌస్‌లను పెగాసస్ ఆక్రమించుకుందన్నారు. ప్రజాస్వామ్యానికి బదులుగా నిఘా రాజ్యంగా మార్చాలనుకుంటున్నారన్నారు. 


పశ్చిమ బెంగాల్‌తోపాటు దేశ ప్రజలను అభినందిస్తున్నానని చెప్పారు. ధన బలం, కండ బలం, మాఫియా, అన్ని రకాల వ్యవస్థలతో పోరాడామని చెప్పారు. అన్ని విధాలుగా ఎదురైన ఇబ్బందులను అధిగమించామన్నారు. రాష్ట్ర ప్రజలు తమకు ఓటు వేశారని, అందుకే తాము గెలిచామని తెలిపారు. దేశ, ప్రపంచ ప్రజల ఆశీర్వాదాలు తమకు అందాయని తెలిపారు. 


తాను తన మొబైల్ ఫోన్‌ కెమెరాకు ప్లాస్టర్ వేశానని, ఇక కేంద్ర ప్రభుత్వానికి ప్లాస్టర్ వేయాలని, లేనిపక్షంలో దేశం నాశనమవుతుందని హెచ్చరించారు. సమాఖ్య నిర్మాణాన్ని బీజేపీ అణగదొక్కిందన్నారు. 


ఓ ఇంటర్నేషనల్ మీడియా కన్సార్షియం ఆదివారం సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. పెగాసస్ స్పైవేర్ ద్వారా హ్యాకింగ్ చేయడం కోసం భారత దేశంలోని 300 మొబైల్ ఫోన్ నంబర్లను లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చునని తెలిపింది. ఇద్దరు మంత్రులు, దాదాపు 40 మంది పాత్రికేయులు, ముగ్గురు ప్రతిపక్ష నేతలు, ఓ సిటింగ్ జడ్జి, అనేక మంది వ్యాపారవేత్తల ఫోన్ నంబర్లు ఈ టార్గెట్‌లో ఉన్నట్లు వెల్లడించింది. 


ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. నిర్దిష్టంగా వ్యక్తులపై నిఘా పెట్టలేదని వివరించింది. ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని తెలిపింది. 


Updated Date - 2021-07-21T21:19:20+05:30 IST