అతడితో కలిసి జీవించలేను!

ABN , First Publish Date - 2020-03-03T06:30:26+05:30 IST

నా పెళ్లి 2006లో అయ్యింది. నా భర్త పెద్ద తాగుబోతు అనే విషయం తెలియక నన్ను అతడికి కట్టబెట్టారు. మద్యానికి బానిసైన అతడి వేధింపులు భరించలేకపోయేదాన్ని. దీంతో 2010లో అతనికి దూరంగా హైదరాబాద్‌ వెళ్లిపోయాను. ఆ తరువాత మద్యం సేవించడం పూర్తిగా...

అతడితో కలిసి జీవించలేను!

నా పెళ్లి 2006లో అయ్యింది. నా భర్త పెద్ద తాగుబోతు అనే విషయం తెలియక నన్ను అతడికి కట్టబెట్టారు. మద్యానికి బానిసైన అతడి వేధింపులు భరించలేకపోయేదాన్ని. దీంతో 2010లో అతనికి దూరంగా హైదరాబాద్‌  వెళ్లిపోయాను. ఆ తరువాత మద్యం సేవించడం పూర్తిగా మానేశానంటూ చాలాసార్లు  వర్తమానం పంపాడు. అది అబద్దమని నాకు తెలుసు కాబట్టి, వాటన్నింటినీ తిరస్కరించాను. దీంతో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు. అక్కడ కూడా నేను విడాకులే కావాలని చెప్పాను. హైకోర్టు న్యాయ సేవా విభాగం ద్వారా కంజుగల్‌ పిటిషన్‌ వేశాడు. అయితే, ఆ కేసుకు నేను హాజరు కాలేదు.


ఈ తరహా వేధింపులు ఎక్కువవ్వడంతో రెండు మాసాల క్రితం అతనికి విడాకుల నోటీసు పంపించాను. డైవర్స్‌ వద్దని, పిల్లల కోసమైనా కలిసి ఉందామంటూ అతను లెటర్‌ పంపాడు. నేను పట్టించుకోలేదు. అయితే కొన్ని కారణాల వల్ల నేను హైదరాబాద్‌ నుంచి తిరిగి మా ఊరికే వచ్చి ఉంటున్నాను. అప్పటి నుంచి ‘నాతో వచ్చేయి... కలిసుందాం’ అంటూ తరచూ ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. నేను పోలీస్‌ కంప్లెయింట్‌ ఇచ్చాను. కొన్ని రోజుల తరువాత... నన్ను కౌన్సెలింగ్‌కు వచ్చేలా ఆదేశించమని కోర్టులో పిటిషన్‌ వేశాడు. మేజిస్ట్రేట్‌ గారు కౌన్సెలింగ్‌ కోసం ఆదేశిస్తారా? అతనితో కలిసి జీవించడానికి నేను సిద్ధంగా లేను. అలాంటప్పుడు నేనేం చేయాలి? 

  • - పి.సావిత్రి, నిజామాబాద్‌ 

మానవ హక్కుల సంఘం ద్వారా వైవాహిక జీవితం పునరుద్ధరించడానికి మీ భర్త నోటీసులు పంపినట్లు రాశారు. అయితే ఎలాంటి తీర్పు ఇచ్చారనే విషయాన్ని తెలియచేయలేదు. వివాహ పునరుద్ధరణ కోసం వేసిన కేసు ఏమయ్యిందో కూడా రాయలేదు. ఒకవేళ ఏ పరిష్కారం లేకుండానే ఆ కేసును మూసివేసినట్లయితే, సంబంధిత కోర్టులో... అంటే మీ ప్రదేశంలోని సబ్‌ కోర్టులో గానీ, జిల్లా కోర్టులో ఉండే ఫ్యామిలీ కోర్టులో గానీ మీ వైవాహిక జీవితాన్ని పునరుద్ధరించమని తిరిగి అతడు పిటిషన్‌ వేసుకునే అవకాశం ఉంది. ప్రతి కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవా సంస్థలు ఉన్నాయి. ఆ సేవా సంస్థకు వెళ్లి పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ‘నా భార్యను కాపురానికి పంపించమ’ని కోరవచ్చు.


అదొక విధానం అంతే..! అయితే అతడు ఒకవేళ సివిల్‌ కోర్టు నుంచి ఏదైనా ఆర్డర్‌ పొందినా మీరు కాపురానికి వెళ్లడానికి ఇష్టపడకపోతే విడాకులు ఇవ్వడం తప్ప అతడు చేయగలిగేదేమీ లేదు. కాకపోతే మీ వద్ద ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని జప్తు చే సే అవకాశమైతే అతనికి ఉంటుంది. మరో విషయం ఏమిటంటే, ఇంతకుముందు అతడు వైవాహిక జీవితపు పునరుద్ధరణకు ఏదైతే దరఖాస్తు చేశాడో... దాని తీర్పు ఏ విధంగా వచ్చిందో, అసలు తీర్పు వచ్చిందో లేదో మీరు రాయలేదు. ఆ విషయాలు తెలియనంత వరకు ఏ రకమైన సలహా ఇవ్వలేం. ఏమైనా ఇప్పటిదాకా జరిగిన ప్రొసీడింగ్‌ ప్రతులన్నీ తీసుకుని ఎవరైనా ఒక న్యాయవాదిని గానీ, న్యాయసేవా సంస్థలోని కార్యద ర్శిని గానీ సంప్రదిస్తే మీకు సరియైన సలహా ఇవ్వగలరు. 

  • - ఒడ్నాల శ్రీహరి 
  • న్యాయవాది, హైదరాబాద్‌

Updated Date - 2020-03-03T06:30:26+05:30 IST