నేను నిజాలు మాత్రమే మాట్లాడగలను : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-02-15T20:04:56+05:30 IST

తాను కేవలం నిజాలు మాత్రమే మాట్లాడగలనని, అబద్ధపు

నేను నిజాలు మాత్రమే మాట్లాడగలను : రాహుల్ గాంధీ

పాటియాలా : తాను కేవలం నిజాలు మాత్రమే మాట్లాడగలనని, అబద్ధపు వాగ్దానాలను వినాలనుకుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రసంగాలను వినవలసి ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఆయన మంగళవారం పాటియాలా జిల్లా, రాజ్‌పురలో శాసన సభ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ‘నూతన ఆలోచనలు, నవ పంజాబ్’ పేరుతో ఈ సభ జరిగింది. 


‘‘నేను తప్పుడు వాగ్దానాలు చేయను. తప్పుడు వాగ్దానాలను వినాలనుకుంటే, మోదీ, బాదల్, కేజ్రీవాల్ ప్రసంగాలను వినండి. కేవలం సత్యం మాట్లాడటమే నాకు నేర్పించారు’’ అని రాహుల్ గాంధీ చెప్పారు. పంజాబ్ ప్రమాదం నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ సమైక్యంగా నడవాలని చెప్పారు. 


రాహుల్ సోమవారం ఓ సభలో మాట్లాడుతూ, శాసన సభ ఎన్నికల్లో ప్రయోగాలు చేయవద్దని ఓటర్లను కోరారు. సరిహద్దుల్లో ఉన్న పంజాబ్‌లో శాంతియుత పరిస్థితులు ఉండటం తప్పనిసరి అని తెలిపారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్రంలో ప్రశాంతతను కాపాడగలదని తెలిపారు. హోషియార్‌పూర్, గురుదాస్ పూర్‌లలో జరిగిన సభలలో మాట్లాడుతూ, పంజాబ్‌ను కాంగ్రెస్ బాగా అర్థం చేసుకోగలదని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నల్లధనం, నిరుద్యోగం గురించి మాట్లాడటం లేదన్నారు. 


Updated Date - 2022-02-15T20:04:56+05:30 IST