Sep 27 2020 @ 02:46AM

నేను గీతం.. తాను గానం

నేను గీతమైతే తాను గానమైన వాడు, నాకు ప్రాణసమానమైన వాడు, నా వాడు బాలసుబ్రమణ్యం. జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంది అవార్డుల కార్యక్రమం నెల్లూరులో జరిగింది. ఆ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా విచ్చేశారు. ఆ సభలో ఆమె ఒక గొప్ప చారిత్రక సత్యం చెప్పారు. సాహితీ, సంగీత, నాట్య, కళా, సాంస్కృతిక చరిత్ర ఆంధ్ర, తమిళ రాష్ట్రాలకు ఉన్నట్లు మరే ఇతర రాష్ట్రాలకు లేవని అన్నారు. ఈ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న కోనేటంపేటలో పుట్టిన బాలు ఆంధ్రులకీ, తమిళులకీ ఉమ్మడి సినీ గాయకుడు. ఘంటసాల, టి.ఎం. సౌందరరాజన్‌లు ఆంధ్ర తమిళ రంగాలకే పరిమితమయ్యారు. కానీ బాలు కన్నడ, హిందీ రంగాలకు కూడా వ్యాపించి అఖండమైన కీర్తి సంపాదించారు. 


సాధనతో ఒక వ్యక్తి ఎంతటి శక్తిగా మారగలడో నిరూపిస్తుంది బాలసుబ్రమణ్యం జీవితం. ముత్యాలొలికే దస్తూరి, మూలాగ్రాలెరిగిన ఆంధ్ర సాహితీ పరిచయం, ధ్వన్యనుకరణ వంటి కళల్లో ప్రవేశం, అనర్గళంగా ఆంగ్లంతో పాటు దేశభాషలు ఐదారు మాట్లాడగల వాగ్‌ఝరి అతను. శాస్త్రీయ సంగీతం గురువు వద్ద నేర్చుకొనకపోయినా, మామ, పుగళేంది వంటి విజ్ఞుల వల్ల దానిని సాధించి పాడి మెప్పించిన సాధకుడు. సంగీతదర్శకుడిగా గంగిగోవుపాల వంటి నాలుగైదు చిత్రాలే చేసినా మధురంగా మనోహరంగా సంగీతం వినిపించిన వాడు బాలు. ‘మయూరి’, ‘జాకీ’, ‘తూర్పు వెళ్లే రైలు’ అతని సంగీత దర్శకత్వ ప్రతిభకు దర్పణాలు. 


‘మయూరి’ చిత్రంలో ఉన్న ఉదాత్త సన్నివేశాలకి బాలు సమకూర్చిన సంగీతం కథలో  ఉన్న మూడ్‌ను ఇనుమడింప చేయడమేగాక, ఎంతో హార్ధికమైన హాయిని శ్రోతలకు పంచింది. అలాగే ‘ప్రతిమ’ అనే చిత్రంలోనూ ఎంతో హృదయంగమమైన సంగీతం అందించాడు. కొన్ని నా భావగీతాలకు బాలు ట్యూన్‌ చేసిన పద్ధతిని విని ‘మళ్లీ దేవదాసు వంటి సినిమా తెలుగులో తీస్తే ఇతని సంగీత దర్శకత్వంలోనే చేయాలి’ అనుకున్న వారూ ఉన్నారు. ‘బ్రతుకులాంటి పాటలో బ్రతకలేని బాటలో బాటసారిని నన్నీ పాటపాడనీ’ వంటి గీతాలను మధుర విషాద గీతాలుగా మలిచిన మనస్వి అతను. బాపూరమణలకు బాలూ అన్నా, అతని సంగీతమన్నా ఎంతో ఇష్టం. ‘చుట్టూ చెంగావి చీర’(తూర్పు వెళ్లే రైలు), ‘శశివదన మనవి వినలేవా’(జాకీ), ‘అలా మండి పడకే జాబిలి’(జాకీ), ‘కోనసీమలో కొంగుజారిన ఆకుపచ్చ చందమామా’(సీతమ్మపెళ్లి) పాటలన్నీ బాలూ సంగీత దర్శకత్వ మధురిమకు స్వర దర్పణాలు. గొంతులు మార్చి పాడడంలో గాత్రధారులకు కొత్తకోణాలు ఆవిష్కరించిన ‘దశకంఠుడు’ అనిపించుకున్న బాలు ‘రవైతీతి రావణః’ అన్నట్లు మరో నాదమూర్తి. ‘బాలోచ్చిష్టం స్వరం సర్వం’ అంటే అతన్ని  కొంతైనా అర్థం చేసుకున్నట్టే!


అన్నిటికి మించి బాలూని కళాకారుడిగా పెంచినది పూర్వులు, పెద్దలు అయిన సంగీత సాహితీవిదుల పట్ల అతనికున్న భక్తిభావం. ఘంటసాలగారంటే అతనికి గల భక్తి గౌరవాలు, ఆరాధన ఆదర్శప్రాయమైనవి. 


మహామహులైన సంగీత దర్శకుల, రచయితల మధుర గీతాలెన్నో పాడే అవకాశం ఇతర గాయకుల కన్నా ఎక్కువగా అతనికి దొరికింది. చరిత్ర సృష్టించిన చిత్రాలకు పాడి చరితార్ధుడైనాడు. ఎప్పుడో ఒక మహాయతిని గూర్చి ఆయన అతీతశక్తులకు ప్రణమిల్లి 

‘మనిషికిన్ని మహిమలా

ఘనసిద్ధుల గరిమలా

ఎదలోనే దైవమున్న హనుమలా

ఎదిగితే నీ దేహం తిరిగే తిరుమల’ అని 

పాడుకున్నది బాలూ విషయంలోనూ నిజమైంది. లేకపోతే ఇన్ని వైవిధ్యంగల పాటలతో పాటు, పాండితీ ప్రమాణాలు మెండుగా, నిండుగా ఉన్న వాగ్గేయాల వంటి పాటలు బాలూ పాడగలిగి ఉండేవాడా! స్ఫుటమైన తెలుగు సంస్కృత తమిళ కన్నడ పదాలను ఉచ్చారణా సౌలభ్యంతో పాడడానికి మానవ శక్తి కన్న దేవదత్తమైన గళం ఉండాలి. అతని కంఠం నిజంగా దేవదత్తమే. ధ్వన్యనుకరణలో, గాత్రదానంలో, గాత్రపరమైన నటనలో ఇంతటి కళాకారుడు ఇంతవరకు రాలేదు. 


బాలూకి సాహిత్యమంటే అమితమైన అభిమానం, ఎక్కడెక్కడి పద్యాలో, గీతాలో అవలీలగా అతని స్మృతిపథంలో నుంచి వస్తాయి. ‘పెళ్లినాటి ప్రమాణాలు’ చిత్రంలో పింగళి వారు రాసిన డైలాగులన్నీ నోటికివచ్చు. రఘురామయ్య గంధర్వగానంలోని ‘తాన్‌’లను అనునాసికంగా ఆ మహానుభావుడే అంటున్నాడా అన్నంతగా వినిపించగల చేవ అతని సొత్తు. డబ్బింగ్‌ రంగంలో అతని నేర్పు ప్రథమపంక్తిలో నిలబెట్టింది. నిద్రలేచింది మొదలు నిద్రపోయే వరకు నిర్ణిద్రగాత్రావధానమే అతని జీవితం. ‘నేను సైతం విశ్వఘోషకు తీపిగొంతుకనిచ్చి మ్రోశాను’ అనగల మొనగాడు. చిత్రవాణిజ్యంలో తెలుగు పాట విలువ, మర్యాద కాపాడుతూ పాడిన వాడు. పాటల్లోనే కాదు. మాటల్లోనూ మంచి చమత్కారి. హాస్యం అంటే ఇష్టం. సంగీతం అంటే ప్రాణం. వెరసి అతనొక ‘హాసం’. నటుడుగానూ రాణించాడు, వ్యాపారవేత్తగా కొన్ని సినిమాలు నిర్మించి చేతులూ కాల్చుకున్నాడు. నేనంటే అతనికి ఉన్న ప్రేమ, అభిమానం ఇతరులు చెప్పగా వినడానికి అలవాటు పడిపోయాను. కానీ సమక్షంలో ఎప్పుడూ విమర్శించడమే పనిగా పెట్టుకున్న కఠినాత్ముడు. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం! ఆత్రేయ మాటకు తిరుగేముంది. ‘చిత్రగాన కల్పవృక్షానికి ఫలపుష్పభరితమైన  కొమ్మలెన్నో! అందులో ఇళయరాజా ఒక చిటారు కొమ్మ. బాల రసాలసాల అభినవ ఘంటసాల బాలసుబ్రమణ్యం ఒక పుంస్కోకిల. ఏ కొమ్మనుంచి పాడినా ఈ కోకిల గానం మధురమే. స్వరాయురస్తు అని దీవించవలసింది రసజ్ఞలోకమే...!’ 

వేటూరి

(‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ పుస్తకం నుంచి)