అతడిని చూస్తే బాధగా ఉంది.. పసిడి పతక విజేత నీరజ్ చోప్రా కామెంట్స్

ABN , First Publish Date - 2021-08-08T22:33:31+05:30 IST

జావెలిన్ త్రోలో భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించిన నీరజ్ చోప్రా తాజాగా వెటర్ వ్యాఖ్యలపై స్పందించారు.

అతడిని చూస్తే బాధగా ఉంది.. పసిడి పతక విజేత నీరజ్ చోప్రా కామెంట్స్

ఇంటర్నెట్ డెస్క్: ‘‘ఈసారి 90మీటర్ల కంటే ఎక్కువ దూరానికే ఈటెను విసురుతా..  నన్ను నీరజ్ గెలవడం కష్టమే..’’ ఒలింపిక్స్ పోటీలకు ముందు ప్రపంచం నెం.1, జర్మనీ క్రీడాకారుడు యొహానెస్ వెటర్ కామెంట్ ఇది. అతడి కామెంట్స్‌కు తగినట్టుగానే..ఒలింపిక్స్‌లో పసిడి అతడిదేనని అందరూ ఊహించారు. కానీ..ఫైనల్స్‌లో మాత్రం పరిస్థితి తారుమారైంది. పసిడి పతకం నీరజ్ సొంతమైంది.  వాస్తవానికి ఈ ఏడాది మొదటి నుంచీ వెటర్ అద్భుత ఫాంలో కొనసాగుతున్నాడు. వివిధ టోర్నమెంట్లలో పలు మార్లు 90మీటర్ల దూరానికి పైగానే ఈటెను విసిరాడు. కానీ.. ఒలింపిక్స్‌లో మాత్రం అంతా తలకిందులైంది. 82.52 మీటర్ల దూరానికి మించి అతడు ఈటెను విసరలేకపోయాడు. దీంతో..ఫైనల్స్‌లో తొలి మూడు రౌండ్లకే వెనుదిరిగాడు. 


నీరజ్ చోప్రా తాజాగా వెటర్ వ్యాఖ్యలపై స్పందించాడు. ‘‘వెటర్ కామెంట్స్ నా దృష్టికి వచ్చాయి. కానీ..ఆ సమయంలో నేనేమీ మాట్లాడదలచుకోలేదు. ఒలింపిక్స్‌కు వచ్చేసరికి ఎవరు నెం.1 అనేది పెద్ద విషయం కాదు. ఆ రోజు ఎవరికి సొంతమవుతుందో ఎవరం చెప్పలేం. కానీ..ఇప్పుడు అతడిని చూస్తే నాకు బాధేస్తోంది. తొలి మూడు రౌండ్లలోనే అతడు ఎలిమినేట్ అయిపోయాడు. క్రీడలంటే అంతే.. అత్యద్భుత క్రీడాకారులు కూడా ప్రతిరోజూ విజయాన్ని అందుకోలేరు. ఈ ఏడాది తొలి నుంచి వెటర్ అద్భుత ఫాంలో ఉన్నాడు. మరి..ఒలింపిక్స్‌లో మాత్రం ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేదు. ఒలింపిక్స్‌కు మునుపు అతడు అవసరమైన దానికంటే అధిక సంఖ్యలో టోర్నమెంట్లలో పాల్గొని ఉండొచ్చు. లేదా..అతడిపై ఒత్తిడి పెరిగిపోయి ఉండొచ్చు.. అసలేం జరిగిందో చెప్పలేను. కానీ.. ఓ ఆటగాడి తొలి త్రో అద్భుతంగా ఉంటే..అతడి తరువాత బరిలోకి దిగేవారు ఒత్తిడిలో పడిపోతారు.’’ అని నీరజ్ కామెంట్ చేశారు. నీరజ్ చోప్రా తొలిపర్యాయం.. 87.03, రెండో పర్యాయంలో అత్యధికంగా 87.58 మీటర్ల దూరానికి ఈటెను విసిరిన విషయం తెలిసిందే. ఇతర క్రీడాకారులెవరూ ఈ రికార్డును అధిగమించలేకపోయారు. దీంతో పసిడి పతకం నీరజ్ సొంతమైంది.

Updated Date - 2021-08-08T22:33:31+05:30 IST