నేను ముఖ్యమంత్రిని కాను.. మరొకరిని చేస్తా

ABN , First Publish Date - 2022-03-14T08:48:48+05:30 IST

నేను ముఖ్యమంత్రిని కాను.. మరొకరిని చేస్తా

నేను ముఖ్యమంత్రిని కాను.. మరొకరిని చేస్తా

  • తెలంగాణలో అధికారమే అంతిమ లక్ష్యం
  • కేసీఆర్‌ను ఫాంహౌస్‌ నుంచి బయటికి రప్పించాం
  • ఆయనకు బీజేపీ అంటే ఏంటో చూపెట్టాం
  • సీఎం పిలిస్తే దేశంలోని ఏ నాయకుడూ రావట్లేదు
  • నన్ను చంపేందుకు మూడుసార్లు ప్రయత్నించారు
  • కిషన్‌రెడ్డి, నేను మిత్రులం.. మా మధ్య గ్యాప్‌ లేదు 
  • ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సంజయ్‌
  • కేసీఆర్‌ను జైలుకు ఎప్పుడు పంపుతారు..? 
  • ఈలోపు ఆయనే మిమ్మల్ని పంపేశారు కదా..?


బండి సంజయ్‌.. ఒకప్పుడు కరీంనగర్‌ జిల్లాలో కొన్ని ప్రాంతాల వారికి మాత్రమే తెలిసిన పేరు. కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యేగా పోటీ చేసి గతంలో కరీంనగర్‌ నియోజకవర్గానికే పరిమితమయ్యారాయన. శిశుమందిర్‌లో చదువుకుని, ఏబీవీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, స్వయం సేవక్‌గా పనిచేసి బీజేపీలో గుర్తింపు తెచ్చుకున్నారు. రెండుసార్లు కార్పొరేటర్‌గా సేవలందించి అనతికాలంలోనే ప్రజలకు దగ్గరయ్యారు. 2014, 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా.. 2019లో బోయినపల్లి వినోద్‌ను ఓడించి కరీంనగర్‌ ఎంపీ అయ్యారు. ఆ వెంటనే పార్టీ అధిష్ఠానం ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి సంజయ్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై పదునైన విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఢీ అంటే ఢీ అంటూ టీఆర్‌ఎ్‌సకు దీటుగా బదులిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్న సంజయ్‌.. ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.


సంజయ్‌: 317 జీవోను నిరసిస్తూ ఉపాధ్యాయుల పక్షాన పోరాడి జైలుకెళ్లాను. ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకొంటాను. కేసీఆర్‌ను జైలుకు పంపడం ఖాయం. సెంట్రల్‌ పార్టీకి ఆ ఆలోచన లేనిదే ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఆ విషయాన్ని చెప్పలేను. నా వ్యాఖ్యలు తప్పయితే అధిష్ఠానం మందలించేది. బీజేపీ అధినాయకులు సమయం కోసం చూస్తున్నారు. కేసీఆర్‌ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన సీఎం అయ్యాక కూడా సీబీఐ వాళ్లు వచ్చి విచారణ చేశారు. ప్రధాని మోదీపై ఎప్పుడూ అలా జరగలేదు. కేంద్ర ప్రభుత్వంలో అవినీతి ఉంటే కేసీఆర్‌ బయటపెట్టాలి కదా. ఆయన దేశమంతా తిరుగుతున్నారు. విచిత్రమేమిటంటే ఇప్పుడు కేసీఆర్‌ పిలిచినా ఏ నాయకులూ రావట్లేదు. ఈయనే వాళ్లకు విమానాలు పంపి పిలిపించుకుంటున్నాడు. వాళ్లు ఇక్కడి నుంచి పోయి కేసీఆర్‌ను వ్యతిరేకిస్తున్నారు. కేసీఆరే రైతు సంఘాలను ఏర్పాటు చేసి ఒక రైతు నాయకుడిని తయారు చేసి.. దేశవ్యాప్తంగా టికాయత్‌లా ఏదో ఒక ఉద్యమం తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారట. సీఎంలు ఎవరూ సహకరిస్తలేరని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట.


ఎలా నడుస్తోంది బీజేపీ బండి? ఈ స్పీడు సరిపోతుందా? ఇంకా పెంచుతారా..? 

బండి వేగంతో నడుస్తోంది. ఇప్పటికైతే స్పీడులోనే ఉంది. ప్రజల ఆలోచనలను బట్టి కార్యక్రమాలను బట్టి స్పీడు పెంచాల్సి వస్తది. 

ముల్లును ముల్లుతోనే తీయాలనుకున్నట్టు.. కేసీఆర్‌ను తిట్టాలనుకున్నారా..? 

కేసీఆర్‌ తిడుతుండు. మేం పొలైట్‌గా విమర్శిస్తున్నాం. చాలా సందర్భాల్లో కేసీఆర్‌ను నా గురువు అని చెప్పినా ఆ తిట్లు నేర్చుకోలేకపోతున్నా. సంస్కారం ఉంది కాబట్టి కేసీఆర్‌ లెక్క బూతులు మాట్లాడలేను. తిట్టు వేరు.. విమర్శలు వేరు. నేను విమర్శలే చేస్తున్నవ్యక్తిగత విమర్శలు బాగా పెరిగాయ్‌.. 

మీడియా పరంగా చూస్తే ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ లేకపోతే మాలాంటి నాయకులు ముందుకు పోయే అవకాశం ఉండదు. ఇది నిజం. ఇది ఎక్కడైనా చెబుతాను. మీలాంటి వాళ్లను స్ఫూర్తిగా తీసుకునే ముందుకు వెళుతున్నాం. ఇన్ని రోజులు కేసీఆర్‌ ఆడింది ఆట పాడింది పాట మాదిరిగా ఉండె. ఆయన్ను విమర్శించే వాళ్లు లేరు. ఎవరైనా విమర్శించినా వారి ఆర్థిక కార్యకలాపాలపై ఆరా తీసి కేసుల బూచీ చూపి బెదిరించేవారు. నేను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని అయ్యాక కూడా నా అకౌంట్స్‌ ఎంక్వయిరీ చేశారు. ఆరా తీసేందుకు హైదరాబాద్‌లో, కరీంనగర్‌లో 16 మంది ఇంటెలిజెన్స్‌ సిబ్బందిని పెట్టారు. నా భార్య ఎస్బీఐ అధికారి. ఆమె వద్దకు ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి వెళ్లి బండి సంజయ్‌ అకౌంట్‌ నంబరు చూపెట్టు అన్నాడు. ఆమె ఈ విషయాన్ని నాతో చెప్పింది. నంబరు చూపెట్టు ఇబ్బంది లేదు అని చెప్పాను. ఇక్కడే ఇంటెలిజెన్స్‌ ఫెయిలైంది. ఏదైనా వివరాలు కావాలంటే నేనే ఇస్తానని మరుసటి రోజే మీడియా సమావేశంలో చెప్పాను. మళ్లీ మొన్న ఓ కేసులో ఇరికించి జైలుకు పంపారు. నేను ఎనిమిదో సారి జైలుకు వెళ్లడం. 


కేసీఆరే కాదు.. వ్యక్తుల గురించి ఆరా తీయడం అనేది అందరూ చేస్తున్నారు కేంద్రం మీదా ఇవే ఆరోపణలున్నాయి. గవర్నమెంట్‌కు మెయిన్‌ ఎజెండా అవుతోంది. 

ప్రధాని మోదీ అవినీతికి దూరం ఉంటారు. ఎవరు అవినీతికి పాల్పడినా ప్రత్యేక దృష్టిపెడతారు. ఇక్కడ వేరు. అవినీతికి పాల్పడేవారిని కేసీఆర్‌ ప్రోత్సహిస్తారు. ఎందుకంటే వారిని తన కంట్రోల్‌లో పెట్టుకోవడానికి. ఓసారి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కలిసి.. నా దగ్గర వంద కోట్లు తీసుకున్నాడన్నా అని చెప్పాడు. సదరు ఎమ్మెల్యేకు హిందూత్వ భావజాలం ఎక్కువని, పార్టీ నుంచి బయటకు పోతాడేమోనని డబ్బు తీసుకున్నాడట. 


ఎందుకు? రూ.100 కోట్లు ఇచ్చి కేసీఆర్‌ పార్టీలో ఉండాల్సిన ఖర్మేమిటి? 

ఆయనది రాజకీయ చతురత. ఆ డబ్బు మళ్లీ అడుగుతడని.. ఫస్ట్‌ ఓ మంత్రినో ఇంకెవర్నో ఆ ఎమ్మెల్యే దగ్గరకు కేసీఆర్‌ పంపిస్తడు. ‘నీ గురించే మాట్లాడుతుండన్నా.. నువ్వు అంత దగ్గరనా అన్నా ఆయనకు?’ అని ఆ వ్యక్తితో చెప్పిస్తడు. ఆ ఎమ్మెల్యేమో.. కేసీఆర్‌ దృష్టిలో పడ్డానంటే నెక్స్ట్‌ మంత్రినైత కావొచ్చు అని ఐస్‌ అయిపోతడు. డబ్బులడిగే సమయానికి ఎవరో వ్యక్తి ద్వారా బ్రేక్‌ ఫాస్ట్‌కు పిలుస్తాడట. ముఖ్యమంత్రి గారితో బ్రేక్‌ ఫాస్ట్‌ అని ఐస్‌ అయిపోతడు. మరో ఆర్నెల్ల తర్వాత కేటీఆరో వాళ్ల కుటుంబసభ్యులెవరైనా ఆ ఎమ్మెల్యేను కలిసి.. ‘ఏమైంది.. మా నాన్నగారు నా కన్నా ఎక్కువ నిన్నే కలవరిస్తున్నాడు’ అని చెప్పేసరికి మరో ఆర్నెల్ల దాకా డబ్బులు అడగడు. ఇదంతా నాకు ఓ ఎమ్మెల్యే చెప్పిన విషయం.


తెలంగాణ ధనిక రాష్ట్రం అనుకున్నాం గానీ మంత్రి పదవికి రూ.100కోట్లు ఇస్తున్నారంటే వ్యక్తులు కూడా ఇంత ధనికులు అనుకోలేదు.

టీఆర్‌ఎస్‌ పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు ఎక్కువ కాదు. అంత డబ్బు వారికి సింపుల్‌. 

కేసీఆర్‌ను ఇంత తిడుతున్నారు కదా.. మీకు ఎప్పుడూ బెదిరింపులు రాలేదా? 

అన్నింటికి తెగించి వచ్చాను. యువమోర్చాలో ఉన్నప్పుడు చాలాసార్లు నన్ను చంపే ప్రయత్నం చేశారు. ఇవన్నీ అలవాటే కాబట్టి పెద్ద లెక్కలేదు. పైగా ధర్మం కోసం పనిచేస్తూ ధర్మకార్యంలోనే పోతే చాలా మంచిది కదా. అది ఎంతో మందికి స్ఫూర్తి కూడా. 

మీ ఫ్యామిలీలో ఎవరూ రాజకీయాల్లో లేరు. చాలా చిన్న కుటుంబం.. ఆర్థికంగా కూడా. మరి.. రాజకీయాల్లోకి ఎట్లా వచ్చారు? 

నేను శిశుమందిర్‌ విద్యార్థిని. చిన్నప్పుడే శాఖకు వెళ్లేవాడిని. తర్వాత ఏబీవీపీలో అంచెలంచెలుగా ఎదిగాను. తర్వాత యువమోర్చాలో పనిచేశాను. అక్కడ ఆల్‌ ఇండియా సెక్రెటరీగా చేశాను. ఆడ్వాణీ యాత్రప్పుడు వెంకయ్యనాయుడు అవకాశమిచ్చారు. 35 రోజులు ఆడ్వాణీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. సెంట్రల్‌ ఆఫీసులో ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్న వెంకయ్యనాయుడి వద్ద పనిచేశాను. 

2019లో కరీంనగర్‌ ఎంపీగా టికెట్‌ ఎలా వచ్చింది? వినోద్‌ లాంటి ప్రత్యర్థిపై పోటీ చేయాలంటే డబ్బు ఎలా సమకూర్చుకున్నారు? 

టికెట్‌ వస్తదని నేను కూడా అనుకోలేదు. అయితే సర్వే రిపోర్టులన్నీ నాకు అనుకూలంగా ఉన్నాయని హైకమాండ్‌ చెప్పడంతో పోటీ చేయాల్సి వచ్చింది. నేను డబ్బేమీ పెట్టలేదు. కరీంనగర్‌ హెడ్‌ క్వార్టర్స్‌, ఆ చుట్టు పక్కల నా కార్యక్రమాలు సాగేవి. దీంతో యువత అంతా వన్‌సైడ్‌ అయ్యారు. అప్పటికి ఎమ్మెల్యే ఎన్నికలు కూడా అయిపోయాయి. దీంతో గ్రామాల్లోని యువత కూడా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ‘ఎమ్మెల్యే ఎన్నికల్లో మేం మీకు ఓటేశాం. ఎంపీ ఎన్నికల్లో బండి సంజయ్‌కి ఓటేస్తాం. మీరు మవ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు’ అని చెప్పారు. అప్పట్లో చాలా మండలాల్లో నేను తిరగలేదు. టికెట్‌ వచ్చినప్పుడు గెలుస్తానని అనుకోలేదు పోలింగ్‌కు చివరి ఐదు రోజులు వాతావరణం బాగుంది అనిపించింది. ఆ ఎన్నికల తర్వాత జడ్పీటీసీ ఎన్నికలు జరగడం.. ప్రచారానికి వెళితే నన్ను చూసేందుకు వేలల్లో జనం రావడంతో గెలుస్తాననే నమ్మకం కలిగింది. ఎదుటి వ్యక్తి విపరీతంగా పెట్టడం.. జిల్లాలో ఏడుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు.. అందులో కేటీఆర్‌, ఈటల, గంగుల వంటి హేమాహేమీలు ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఉన్నా.. కేవలం క్యాడర్‌ అండతో గెలిచాను. కేసీఆర్‌.. ‘హిందుగాండ్లు.. బొందుగాండ్లు’ అనే వ్యాఖ్యలు చేయడం.. దాన్ని సమాజం ఒప్పుకోకపోవడంతో ఆ వ్యతిరేకత పనిచేసింది. 


ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్న మిమ్మల్ని పెళ్లి చేసుకునేందుకు మీ మిసె్‌సను ఏం చెప్పి ఒప్పించారు? 

అందరికీ అదే ఆశ్చర్యం. నా భార్య బ్యాంక్‌ ఉద్యోగి. వాళ్ల నాన్న లేరు. పెద్దవాళ్లు అరేంజ్‌ చేశారు. డబ్బులేమీ లేవు. పిల్లల బాధ్యతలు సహా అన్నీ ఆమె చూసుకుంటుంది.

వ్యాపారాలేమీ లేవా మీకు? 

లేవు. అంత ఆలోచించే టైం కూడా లేదు. 

వ్యాపారాలేమీ లేకుండా, ఆదాయ మార్గలేమీ లేకుండా రాజకీయం చేయడం ఇవాళ రేపూ కష్టం కదా.

ఒకసారి గెలిచి చూపెట్టినం కదా. నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేస్తే ప్రజలే గెలిపిస్తారనే నమ్మకమే నడిపిస్తోంది

సడెన్‌గా పార్టీ ప్రెసిడెంట్‌ ఎట్లా కాగలిగారు? 

వాస్తవానికి నన్ను సెంట్రల్‌ పార్టీ లీడర్‌ పిలిపించి అధ్యక్ష పదవి చేపట్టాలని అడిగారు. వద్దని చెప్పిన. మొన్ననే అదీ తొలిసారి గెలిచానని, రాష్ట్రం మొత్తం తిరగడం కష్టమని చెప్పిన. ఎవ్వరికైనా ఆ పదవిచ్చినా మద్దతిస్తానని, కష్టపడి పనిచేస్తానని చెప్పిన. బయటకొచ్చినంక కూడా రేసులో లేనని అందరికీ చెప్పిన. తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా నన్నే నియమించారని తెలిసింది. అది నాకు సర్‌ప్రైజ్‌. 

మీరు నేరుగా కమ్యూనల్‌ ఎజెండానే తీసుకున్నారు. ఏమీ దాచుకోకుండా ముస్లిం ఓట్లు అవసరం లేదని అన్నారు. 

ముస్లిం ఓట్లు అవసరం లేదని అన్లేదు. మేమొచ్చి టోపీ పెట్టుకొని మసీదుల్లో నమాజ్‌ చేస్తే అలా వచ్చే ఓట్లు వద్దని చెప్పా. క్రైస్తవులు, ముస్లింల కోసం కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, కమ్యూనిస్ట్‌ పార్టీలు ఆలోచిస్తాయి. అవన్నీ సెక్యులర్‌ పార్టీలు. ఎక్కడా హిందూఅనే మాట వాడరు. మేమేమో అన్ని వర్గాలను సమానంగా చూడాలని అంటాం. మజ్లిస్‌ పక్కా కమ్యూనల్‌ పార్టీ. 15 నిమిషాలు టైమిస్తే చంపేస్తామని ప్రకటించారు. గోమాతను వధిస్తామంటారు. ధర్మాన్ని, దేవుళ్లను కించపరుస్తారు. 

వాళ్లస్థాయిలో వాళ్లు రెచ్చగొడుతున్నారు.. రాజాసింగ్‌ లాంటి వారు మీ స్థాయిలో మీరూ రెచ్చగొడతారు కదా! 

15 నిమిషాలు టైమిస్తే చంపేస్తామని అన్నప్పుడు భరించే అవసరం, సహనం నాకు లేదు. ఇదే మజ్లిస్‌ పార్టీ ఇప్పుడు టీఆర్‌ఎ్‌సతోనే కాదు.. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలతో కలిసి పనిచేసింది. టీడీపీ ప్రభుత్వం మాత్రం ఒవైసీని కంట్రోల్‌ చేసింది. మజ్లిస్‌ పార్టీ, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసి ఉంటున్నారు. మరి.. ఓల్డ్‌ సిటీలో అభివృద్ధి ఎందుకు జరగడం లేదు? ఓల్డ్‌సిటీ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఓల్డ్‌ సిటీని న్యూ సిటీ చేయాలని, అందుకు సహకరించాలని అంటున్నాం. దీనిపై భాగ్యలక్ష్మి టెంపుల్‌ వద్ద మాట్లాడినప్పుడు ముస్లిం మేధావి వర్గంలో ఓ వాతావరణం వచ్చింది. 


ఒవైసీ, బీజేపీ మధ్య లోతైన అవగాహన ఉందని బయట విస్తృత అభిప్రాయం ఉంది కదా..?

అదేం లేదు. ఇప్పుడు ఒవైసీని దేశం మొత్తం తిప్పుతా.. బీజేపీ సంగతి చూస్తా అని కేసీఆర్‌ అంటున్నారు. పాత బస్తీలో ఎంఐఎంపై వ్యతిరేకత మొదలైంది. నిజానికి ఒవైసీ కుటుంబానికి ఎక్కడా హిందువుల నుంచి ప్రమాదం లేదు. అక్బరుద్దీన్‌పై దాడి చేసింది ముస్లింలే. వాళ్ల కుటుంబం కూడా హిందువుల నుంచి ప్రమాదం ఉందని ఎప్పుడూ చెప్పలేదు. నరేంద్ర గారి నుంచి మా వరకు.. అధికారంలో ఉన్న పార్టీ వల్ల, పోలీసుల వల్ల ఇబ్బందులు పడుతున్నాం. నన్ను కరీంనగర్‌లో మూడుసార్లు చంపే ప్రయత్నం చేశారు. టీమ్స్‌ వచ్చి నాపై రెక్కీ నిర్వహించాయి. ఒక వ్యక్తి లెదర్‌ బ్యాగులు అమ్ముతున్నట్లు నా ఇంటి ముందు నెల రోజలు తిరిగాడు. అతడిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల తప్పించుకున్నాడు. నరేంద్ర, రాజాసింగ్‌, బద్ధం బాల్‌రెడ్డి ఇలా చాలా మందిపై జరిగింది. 


కేసీఆర్‌ బీజేపీ ముక్త్‌ భారత్‌ అని నాయకుందరినీ కలుస్తున్నారు కదా..?

ఆయనను ఎవరు పట్టించుకుంటారు. ఇక్కడి ప్రజలే టీఆర్‌ఎస్‌ ముక్త్‌ తెలంగాణ అంటున్నారు. ఆయన ఇంట్లో పోరు మొదలవుతుంది. ముందు సీఎం పదవి కాపాడుకోవాలి. 

ఒకవేళ కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తే..?

మేం సిద్ధంగా ఉన్నాం. ఒక్కో నియోజకవర్గంలో మా పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు రెడీగా ఉన్నారు. 

బీజేపీ దక్షిణ తెలంగాణలో బలం పుంజుకోలేదు. ఖమ్మం, నల్లగొండ, పాతబస్తీలో బీజేపీ వీక్‌. ఇవన్నీ చూస్తే కనీసం 40 సీట్లు బీజేపీకి చాన్సే ఉండదు కదా..?

హైదరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కార్వాన్‌, గోషామహల్‌, మలక్‌పేట్‌, చాంద్రయాణగుట్ట స్థానాల్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తాం. ఖమ్మం కార్పొరేషన్‌లో బీజేపీకి పోలైన ఓట్ల శాతం పెరిగింది. నల్లగొండలో ఇప్పుడు మా బలం పెరిగింది. 

కిషన్‌రెడ్డికీ మీకు పడదట కదా..?

అలాంటిదేం లేదు. కలిసుంటాం. కలిసి తిరుగుతాం. మా మధ్య గ్యాప్‌ ఎందుకు వస్తుంది..?

గ్యాప్‌ ఎందుకు వస్తుందంటే.. రేపు పార్టీ అధికారంలోకి వస్తే సీఎం కావడం కోసం..

నేను సీఎంను కానని స్పష్టంగా చెప్పాను. నా దృష్టిలో సీఎంను చేసినోడే గొప్పోడు. నేను సీఎంను పక్కా చేస్తా.

మోదీగానీ, అమిత్‌షాగానీ, నడ్డాగానీ ఇలాంటి అధినేతల నుంచి బెస్ట్‌ కామెంట్‌ ఏం వచ్చింది..?

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చేస్తున్న పో రాటాలు, ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు, వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్న తీరును మెచ్చుకున్నారు. 

మీ లక్ష్యం ఏంటి ఫైనల్‌గా..?

తెలంగాణలో అధికారంలోకి రావడమే.


కేసీఆర్‌ చాలా పథకాలు అమలు చేస్తున్నారు కదా..?

టీకాలు మేము ఇస్తుంటే కేసీఆర్‌ ఫొటో పెట్టుకుంటున్నారు. రైతు వేదికలకు మేము రూ.10 లక్షలు ఇస్తున్నాం. అక్కడ తండ్రీ కొడుకుల ఫొటోలు ఉంటున్నాయి. స్వచ్ఛ భారత్‌ పేరుతో మరుగుదొడ్లు కట్టించినా వాళ్ల ఫొటోలే పెట్టుకుంటున్నారు. రేషన్‌ బియ్యం మేమే ఇస్తున్నాం. రోడ్లు వేయిస్తున్నాం. వైకుంఠధామాలు నిర్మిస్తున్నాం. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు రూ.2వేలు పెట్టుబడి సాయం ఇస్తున్నాం. ఇలా ప్రతి దానికీ కేంద్రమే పైసలు ఇస్తోంది. 





అసలు బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య జరిగేది దొంగాటా..? ఏంటి..? 

మేమెప్పుడూ టీఆర్‌ఎ్‌సతో కలిసి పోటీ చేయలేదు. మాకు వాళ్లతో ఏ ఒప్పందం లేదు. మేమెప్పుడూ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. మా మధ్య ఒప్పందమే ఉంటే.. ఈ స్థాయిలో ఎందుకు కొట్లాడుకుంటాం. భవిష్యత్తులోనూ టీఆర్‌ఎ్‌సతో కలిసే ప్రసక్తే లేదు. అంతకుముందు ఫామ్‌హౌస్‌ నుంచి కేసీఆర్‌ బయటకొచ్చేవాడు కాదు. ఈరోజు ఫామ్‌ హౌస్‌ నుంచి ప్రగతి భవన్‌కు, ధర్నాచౌక్‌కు, అక్కడి నుంచి రాష్ట్రంలో తిరిగిచ్చినం.. ఇప్పుడు దేశంలో తిరిగిస్తున్నం. ఇంతకు ముందు విమర్శిస్తే.. బండి సంజయా? ఓ పోరడు.. వాడితో ఏమైతది అనుకున్నడు. కానీ సంజయ్‌ ఏంది? బీజేపీ ఏందనేది చూపెట్టినం. 

Updated Date - 2022-03-14T08:48:48+05:30 IST