నేను ఒక రైతు

ABN , First Publish Date - 2020-12-21T06:52:11+05:30 IST

నేను బాధల గుమ్మిని కష్టాలు దాచిన గాదెని సవాళ్లు నింపిన బానను...

నేను ఒక రైతు

నేను బాధల గుమ్మిని

కష్టాలు దాచిన గాదెని

సవాళ్లు నింపిన బానను

నేను కన్నీటి కొలకుండను

నేను చీకటి దారుల్లో నడిచే

బతుకు బండిని లాగుతున్న

ఎడ్ల మెడలో ఆగి ఆగి మ్రోగుతున్న గంటని

నేను ఒంటరిని

నేను నిత్యం భూమితో మాట్లాడే రైతుని

2

నేను పశువుల మధ్య పుట్టి

వాటి గిట్టల కింద నలిగి మనిషైన వాడ్ని

నేను కొట్టంలో కట్టుగొయ్యలకాడ

మేతకోసం బుద్ధిగా నిలబడ్డ పశు శిశువుని

నేను ఎద్దు అర్రుకు పచ్చివెన్న రాసి

వాటి పుండ్లను మాన్పిన వాడ్ని

నేను కుడితి గాబులోంచి మెతుకులు దేవి

అరచేతిలో పశువులకు అన్నం ముద్దలు పెట్టినవాడ్ని

నిత్యం భూమితో కలలు పంచుకున్న మనిషిని

నేను విత్తనం కట్టినవాడ్ని

పెత్తనం మీకు వొదిలి పెట్టినవాడ్ని

నేను నారు పోసినవాడ్ని

నేను గింజ నేలలోంచి మొలకెత్తిన తీరును

యుగాలుగా చూస్తూ పరవశించినవాడ్ని

నేను నేలసారం బతుకు భారమెరిగిన మనిషిని

నేలతల్లి వొడిలోనే సౌఖ్యం వెతుక్కున్నవాడ్ని

నేను వలపట దాపట లెరిగినవాడ్ని

ఈ దేశపు పరువును భుజాన నాగలిగా

ధరించి ముందుకు నడిచినవాడ్ని

నేను మంచె మీద నిలబడి

పంటను కాపాడుకొన్నవాడ్ని

పాలుపోసుకున్న జొన్న కంకుల మీద

వాలిన పిట్టలకు నా పంటలో భాగమిచ్చినవాడ్ని

జీవకోటి మొత్తానికీ హక్కులున్నాయని

తొలిగా గుర్తించిన మానవుడ్ని

ఈ భూమికి తొలి కానుపు బిడ్డని

నేను మేడిని, నేను కాడిని

నేను మోకులెయ్యటం నేర్చినవాడ్ని

మోరలెత్తిన మృగాలను తరిమేసిన వాడిని

నేను ఇరుసుని అవమానాలు తాళలేక

ఎత్తిన శిరస్సుని

నేను పుట్లకు పుట్లు ధాన్యాన్ని కలగంటూ

పొలాల వెంట పరుగులెత్తిన పంట కాలువను

నేనిప్పుడు కార్పోరేట్‌ పురుగులాశించిన

పచ్చని పంట భూమిని

నేను విషపు గాలుల జాడ తెలిసినవాడ్ని

నేను మానవ ప్రవృత్తి వైపరీత్యాలకు

వరదలో కొట్టుకుపోయిన ధాన్యపు రాశిని

నేను కొడవళ్లు, గొడ్డళ్లు వాడటం తెలిసినవాడ్ని

మీరు ఎండి కంచాల్లోనో, బంగారు పళ్లెరాలలోనో

ముద్ద వెనక ముద్ద మింగేటప్పుడు

గుర్తుకు రావాల్సిన వాడిని

నేను రేపటిని ఈనాడే

సాగు చేసేందుకు అడుగేస్తున్నవాడ్ని

సీతారాం

Updated Date - 2020-12-21T06:52:11+05:30 IST