నేను డాక్టర్‌ని.. డయాగ్నసిస్‌ చేయడమూ తెలుసు!

ABN , First Publish Date - 2022-08-08T08:22:59+05:30 IST

బాసర ట్రిపుల్‌ ఐటీలో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నిరసన తెలపడం ఒక తల్లిగా తనను కలచివేసిందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు.

నేను డాక్టర్‌ని..   డయాగ్నసిస్‌ చేయడమూ తెలుసు!

అమ్మగా వచ్చా.. సమస్యలు తెలుసుకున్నా.. విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవే

పరిష్కారానికి ఒత్తిడి తెస్తా.. నేను రోజూ రావాలని విద్యార్థులు అడుగుతున్నారు 

గవర్నర్‌కు ప్రొటోకాల్‌ ‘బహిరంగ రహస్యమే’.. బాసర ట్రిపుల్‌ ఐటీలో తమిళిసై 

విద్యార్థులతో ముఖాముఖి.. రోడ్డుపై ప్రెస్‌మీట్‌ పెట్టించిన అధికారులు!

తెలంగాణ వర్సిటీలోనూ తమిళిసై పర్యటన.. సరస్వతీ ఆలయంలో పూజలు


ముథోల్‌/బాసర/డిచ్‌పల్లి, ఆగస్టు 7: బాసర ట్రిపుల్‌ ఐటీలో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ  నిరసన తెలపడం ఒక తల్లిగా తనను కలచివేసిందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే ఓ అమ్మగా ఇక్కడికి వచ్చానని చెప్పారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవేనని, వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై తన వంతు ఒత్తిడి తీసుకొస్తానని తమిళిసై స్పష్టం చేశారు. తాను మంచి డాక్టర్‌నని.. తనకు డయాగ్నసిస్‌ చేయడం కూడా తెలుసని వ్యాఖ్యానించారు. ఆదివారం ఆమె బాసర ట్రిపుల్‌ ఐటీతో పాటు నిజామాబాద్‌ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. తొలుత ట్రిపుల్‌ ఐటీని సందర్శించిన ఆమె.. ఉదయం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థి వసతి గృహాలు, తరగతి గదులు, భోజన శాలలన్నింటినీ పరిశీలించారు. సుమారు నాలుగు గంటల పాటు ట్రిపుల్‌ ఐటీలో గడిపారు. ఆ తర్వాత విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.


ట్రిపుల్‌ ఐటీలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. నాణ్యమైన భోజనం అందడం లేదని, లైబ్రరీలో సరైన సౌకర్యాలు లేవని, గత కొన్నేళ్ల నుంచి క్రీడా కార్యకలాపాలు జరగడం లేదని గవర్నర్‌ దృష్టికి తెచ్చారు. అనంతరం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ గేటు ఎదుట గవర్నర్‌ తమిళిసై విలేకరులతో మాట్లాడుతూ.. ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల సమస్యలన్నింటినీ తెలుసుకున్నానని, ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానని చెప్పారు. విద్యార్థులకు నైతిక మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. ట్రిపుల్‌ ఐటీలో అధ్యాపకుల కొరతతోపాటు 2017 నాటి ల్యాప్‌టా్‌పలు ఉన్నాయన్నారు. అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు విద్యార్థులు తనకు తెలిపారని గవర్నర్‌ వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు తాను ట్రిపుల్‌ ఐటీని సందర్శించి సమస్యలను తెలుసుకున్నట్లు తమిళిసై చెప్పారు. క్యాంప్‌సలో పోలీసుల జోక్యం వద్దని విద్యార్థులు కోరారన్నారు. ఇటీవల మృతి చెందిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి సంజయ్‌ కిరణ్‌ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. బాధిత కుటుంబానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని గవర్నర్‌ హామీ ఇచ్చారు.


విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించేలా చర్యలు తీసుకుంటానన్నారు. అలాగే భద్రతా విషయంలో కూడా అమ్మాయిలు ఫిర్యాదు చేసినట్లు గవర్నర్‌ తెలిపారు. ట్రిపుల్‌ ఐటీలో సమస్యలను ఎలా పరిష్కరిస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తనకు డయాగ్నసిస్‌ చేయడం కూడా తెలుసని తమిళిసై స్పష్టం చేశారు. మెస్‌ విషయంలో విద్యార్థులు సంతోషంగా లేరన్నారు. ుూఇవాళ మీరు వచ్చారని మంచి అల్పాహారం పెట్టారు. రోజూ వస్తే మాకు మంచి భోజనం దొరుకుతుంది్‌్‌ అని విద్యార్థులు తనతో అన్నట్లు గవర్నర్‌ తెలిపారు. ఇక నుంచి ట్రిపుల్‌ ఐటీలో ఒక్కో సమస్యా పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గవర్నర్‌కు ఇస్తున్న ప్రోటోకాల్‌ విషయం బహిరంగ రహస్యమేనని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పోస్టులకు అధికారులు గౌరవం ఇవ్వాలని హితవు పలికారు. 


పోలీసుల తీరుపై గవర్నర్‌ ఆగ్రహం 

గవర్నర్‌ బాసర సరస్వతీ ఆలయానికి వచ్చిన సందర్భంగా కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. ఒక దశలో మీడియా ప్రతినిధులను తోసేశారు. గమనించిన గవర్నర్‌.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను ఎందుకు అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు. అయినా పోలీసులు మీడియా ప్రతినిధులను ఆలయంలోకి వెళ్లనివ్వకపోవడం గమనార్హం. 


ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు గాయబ్‌

గవర్నర్‌ ట్రిపుల్‌ ఐటీ పర్యటనలో జిల్లా ఉన్నతాధికారులు ఎవరూ కనిపించలేదు. హైదరాబాద్‌ నుంచి రైలులో వచ్చిన గవర్నర్‌.. నిజామాబాద్‌ నుంచి రోడ్డుమార్గాన ఆదివారం తెల్లవారుజామున ట్రిపుల్‌ ఐటీకి చేరుకున్నారు. ఉదయం సరస్వతీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్‌కు నిర్మల్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ రాంబాబు, ట్రిపుల్‌ ఐటీ వీసీ వెంకటరమణ మాత్రమే స్వాగతం పలికారు. కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఎస్పీ తదితరులు ఎవరూ రాలేదు. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో స్థానికులెవరూ గవర్నర్‌ను కలిసే అవకాశం లేకపోయింది.


టీయూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

నిజామాబాద్‌ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయం (టీయూ)లో అనేక సమస్యలు ఉన్నాయని.. చాన్స్‌లర్‌ హోదాలో వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని గవర్నర్‌ తమిళిసై తెలిపారు. ఆదివారం ఆమె టీయూలో పర్యటించారు. వర్సిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాగా, టీయూ ఏర్పాటు చేసి దశాబ్దంన్నర అవుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని విద్యార్థులు గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చారు. గవర్నర్‌ నిజామాబాద్‌ జిల్లాకు తొలిసారి వచ్చారు. అయినా ఆమె పర్యటనలో జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, పోలీసు కమిషనర్‌ నాగరాజు పాల్గొనలేదు. అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీసీపీ అరవింద్‌ బాబు తదితర అధికారులు మాత్రమే గవర్నర్‌ వెంట ఉన్నారు. 


రోడ్డుపైనే గవర్నర్‌ ప్రెస్‌మీట్‌!

గవర్నర్‌ తమిళిసై ట్రిపుల్‌ ఐటీ పర్యటనలో యూనివర్సిటీ అధికారులు ఆంక్షలు విధించారు. దాదాపు 4 గంటల పాటు గవర్నర్‌  వర్సిటీ లోపల కార్యక్రమాల్లో పాల్గొంటే.. మీడియాను మాత్రం లోపలికి అనుమతించలేదు. తిరుగు ప్రయాణంలో ట్రిపుల్‌ ఐటీ గేటు బయట రోడ్డుపైనే గవర్నర్‌ మీడియా సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. వర్సిటీ అధికారుల చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి.

Updated Date - 2022-08-08T08:22:59+05:30 IST