కళ్లతోనే నటించాను

‘టాక్సీవాలా’తో ఆకట్టుకుంది ప్రియాంక జువాల్కర్‌. ఆ తరవాత ‘ఎస్‌.ఆర్‌. కల్యాణమండపం’, ‘తిమ్మరుసు’ చిత్రాలతో విజయాలు అందుకుంది. ఇప్పుడు ‘గమనం’లో మరో మంచి పాత్ర దక్కించుకుంది. శ్రియ, శివ కందుకూరి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. సంజనారావు దర్శకురాలు. ఈనెల 10న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ప్రియాంక జువాల్కర్‌ ఈ సినిమా గురించి ఏం చెప్పిందంటే..?


‘‘ఈ సినిమాలో నా పాత్ర పేరు ఝూరా. ఓ ముస్లిం అమ్మాయిని. ఈ పాత్ర  కోసం నన్ను ఆడిషన్‌ కూడా చేశారు. బుర్ఖాలో ఎలా కనిపిస్తానో అని లుక్‌ టెస్ట్‌ చేశారు. ఆ తరవాతే ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాలో డైలాగులు చాలా తక్కువగా ఉంటాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే కేవలం కళ్లతోనే నటించాల్సివస్తుంది. అందుకే కొంచెం కష్టం అనిపించింది. కానీ ఇదో కొత్త అనుభవం’’.


‘‘ఇలాంటి పాత్ర నేనెప్పుడూ చేయలేదు. అందుకే రిఫరెన్సులు అవసరం అయ్యాయి. నా చిన్నప్పుడు మా ఇంటి చుట్టు పక్కల కొన్ని ముస్లిం కుటుంబాలు ఉండేవి. వాళ్లు ఎలా మాట్లాడతారు? వారి హావభావాలు ఎలా ఉంటాయి? అనే విషయంలో కొంత పరిజ్ఞానం ఉంది. అది ఈ సినిమాకు ఉపయోగపడింది. నిత్యమీనన్‌ నటించిన ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చూశా. అందులో తను ముస్లిం యువతి పాత్ర పోషించింది. ఆ సినిమా కూడా నాకు బాగా ఉపయోగపడింది’’


‘‘నేను తెల్లగా ఉంటాను. కమర్షియల్‌ కథలకు మాత్రమే పనికొస్తానని అందరూ అనుకుంటారు. నాకు విలేజ్‌ అమ్మాయి పాత్రలు సెట్‌ కావు అనుకుంటారు. కానీ ఈ సినిమా చూశాక ఆ అభిప్రాయం మారుతుంది. ‘గమనం’ కథ వినగానే నచ్చింది. పైగా ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారని చెప్పారు. అందుకే ఇంకే విషయాలూ ఆలోచించలేదు. నేను చాలా సెలక్టీవ్‌. సినిమాలు చక చక ఒప్పుకోలేను. వచ్చిన ప్రతీ సినిమా చేసేస్తే బాగానే ఉంటుంది. కానీ అవన్నీ ఫ్లాప్‌ అయుతే పరిస్థితి ఏమిటి? అనేది ఆలోచిస్తా. కథ డిమాండ్‌ చేస్తే బోల్డ్‌గా నటించడానికి కూడా సిద్ధమే. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాని అందరూ బోల్డ్‌ సినిమా అంటారు. కానీ నాకు బాగా నచ్చింది’’.

Advertisement