షర్మిల ప్రజాప్రస్థానం రేపే

ABN , First Publish Date - 2021-10-19T07:10:04+05:30 IST

: వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల సుదీర్ఘ పాదయాత్ర బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభం కానుంది.

షర్మిల ప్రజాప్రస్థానం రేపే

  • చేవెళ్ల నుంచి పాదయాత్ర ఆరంభం
  • 90 నియోజకవర్గాల్లో.. 400 రోజుల నడక
  • ఉదయం 8.30 నుంచి 12.30 గంటల వరకు
  • తిరిగి సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు
  • భోజన విరామంలో స్థానికులతో మాట- ముచ్చట
  • సాయంత్రం స్థానిక పార్టీ నేతలతో సమీక్షలు 
  • నేడు ఇడుపులపాయలో వైఎస్‌కు నివాళి
  • పాదయాత్రను విజయలక్ష్మి ప్రారంభించే చాన్స్‌

హైదరాబాద్‌/చేవెళ్ల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల సుదీర్ఘ పాదయాత్ర బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభం కానుంది. ప్రజాప్రస్థానం పేరిట నిర్వహిస్తున్న పాదయాత్రకు శంకర్‌పల్లి క్రాస్‌ రోడ్డు వద్ద తొలి అడుగు పడనుంది. ఉదయం 11 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభ, సర్వమత ప్రార్థనల అనంతరం షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వైఎ్‌సఆర్‌ సతీమణి విజయలక్ష్మి జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ‘తెలంగాణలో రాజన్న సంక్షేమం, అభివృద్ధి కోసం 20న చేవెళ్లలో షర్మిల ప్రజా ప్రస్థానం ప్రారంభించబోతోంది. ఆమె అడుగులో అడుగేయండి. చేతిలో చేయి కలపండి. మీరు.. ఆమె కలిసి ప్రభంజనం సృష్టించి రాజన్న రాజ్యం సాధించుకోండి’ అంటూ విజయలక్ష్మి సోమవారం ఓ వీడియో సందేశంలో ప్రజలకు పిలుపునిచ్చారు. 


బుధవారం నుంచి ఏకంగా 400 రోజుల పాటు 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో సాగే ఈ పాదయాత్ర కోసం ఇప్పటికే రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల రూట్‌ మ్యాప్‌ కూడా ఖరారైంది. ప్రతి రోజూ ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కానున్న పాదయాత్ర మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతుంది. మధ్యాహ్న భోజన సమయంలో స్థానిక ప్రజలతో ‘మాట- ముచ్చట’ పేరుతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు పాదయాత్ర మొదలైౖ 6 గంటల వరకు సాగుతుంది. పార్టీ ముఖ్య నాయకులు కొండా రాఘవరెడ్డి, పిట్టా రాంరెడ్డి, ఏపూరు సోమన్న తదితరులు షర్మిలతో పాటుగా నడవనున్నారు. కాగా, పాదయాత్రలో భాగంగా ప్రతి మంగళవారం తాను ఎక్కడుంటే.. అక్కడే శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ నిరాహార దీక్ష నిర్వహించనున్నారు. ఇదిలావుండగా, షర్మిల.. మంగళవారం ఇడుపులపాయలోని తన తండ్రి వైఎ్‌సఆర్‌ సమాధి వద్ద ప్రార్థనలు నిర్వహించనున్నారు. మంగళవారం సాయంత్రం లేదా.. బుధవారం ఉదయమే హైదరాబాద్‌కు చేరుకుని చేవెళ్లకు వెళ్తారు. 


పీకే బృందం ప్రణాళిక 

పాదయాత్రలో షర్మిల ఏయే మార్గాల గుండా వెళ్లాలి? ఏ అంశాలను ప్రస్తావించాలి? ప్రజలతో ఎలా మెలగాలి? అన్న దానిపై ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే) బృందం పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఈ బృందం రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల రూట్‌ మ్యాప్‌నూ ఖరారు చేసింది. సుదీర్ఘ పాదయాత్రను దిగ్విజయం చేయడంతో పాటు.. సోషల్‌ మీడియాలోనూ విస్తృత ప్రచారం కల్పించేందుకూ ఏర్పాట్లు చేస్తోంది. 


తొలి రోజు పాదయాత్ర ఇలా...

షర్మిల బుధవారం ఉదయం 10గంటలకు హైదరాబాద్‌ నుంచి బయలుదేరి 10.45 గంటలకు చేవెళ్లలోని హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారి పక్కనే ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు. సభా వేదికకు వైఎస్సార్‌ ప్రజాప్రస్థాన వేదిక అని నామకరణం చేశారు. 11 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఆ తర్వాత షాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న వైఎ్‌సఆర్‌ విగ్రహనికి పూలమాలలు వేసి, నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి కందవాడ గ్రామం మీదుగా పాదయాత్ర సాగిస్తారు.  పాదయాత్ర మొదటి రోజు చేవెళ్ల మండలం మీదుగా మొయినాబాద్‌ మండలం నక్కలపల్లికి చేరుతుంది. రాత్రి షర్మిల అక్కడే బస చేస్తారు. 

Updated Date - 2021-10-19T07:10:04+05:30 IST