హైడ్రాక్సీక్లోరోక్విన్: బ్రెజిల్ చర్చ

ABN , First Publish Date - 2020-05-28T07:54:11+05:30 IST

కరోనా మహమ్మారిపై చర్చలో సర్వత్రా పదే పదే విన్పిస్తున్న పదం ‘సైన్స్’. తమ నిర్ణయాలు సైన్స్ ప్రాతిపదికన తీసుకొంటున్నవేనని పలువురు ఘంటాపథంగా చెబుతున్నారు. కనుకనే అవి గురుత్వాకర్షణ...

హైడ్రాక్సీక్లోరోక్విన్: బ్రెజిల్ చర్చ

 కరోనా మహమ్మారిని మట్టుబెట్టే మందు ఏదీ అందుబాటులో లేకపోవడంతో మలేరియా వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తున్న ఔషధం హైడ్రాక్సిక్లోరోక్విన్ నే వివిధ దేశాలు ఉపయోగిస్తున్నాయి. అయితే ఈ మలేరియా ఔషధం కొవిడ్- 19 రోగులకు హానికరంగా పరిణమిస్తుందని కొన్ని వైజ్ఞానిక అధ్యయనాలు నిర్ధారించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గత సోమవారం నాడు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ క్లినికల్‌ పరీక్షలపై నిషేధం విధించింది. ఫ్రాన్స్ సైతం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను నిషేధించింది. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా తరువాత ద్వితీయ స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో చాలా రోజులుగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడకంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ‘సైన్స్’ పేరిట ఈ ఔషధాన్ని వ్యతిరేకించడంలోని అశాస్త్రీయతను ఖండిస్తూ ఆ దేశ శాస్త్రవేత్తలు పలువురు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ ప్రజాహిత కృషికి బ్రెజీలియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సభ్యుడు మార్కోస్ నొగూయెరా ఇబెర్లిన్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆ లేఖలోని కొన్ని భాగాలు: 


కరోనా మహమ్మారిపై చర్చలో సర్వత్రా పదే పదే విన్పిస్తున్న పదం ‘సైన్స్’. తమ నిర్ణయాలు సైన్స్ ప్రాతిపదికన తీసుకొంటున్నవేనని పలువురు ఘంటాపథంగా చెబుతున్నారు. కనుకనే అవి గురుత్వాకర్షణ నియమం లాగా నిరాక్షేపణీయమూ, అమోఘమైనవనీ మనలను నమ్మమంటున్నారు. ‘సైన్స్ నిపుణుల’ బృందాలలో లేదా సుప్రసిద్ధ యూట్యూబ్ శాస్త్రవేత్తలలో చాలా మంది శాస్త్ర పరిశోధనల్లో ‘ప్రారంభ దశ’లో వున్నవారు మాత్రమే. వారిలో కొంత మంది మహమ్మారులపై పోరులో ఎలాంటి అనుభవం లేని వారే. మరి లాక్‌డౌన్‌కు ‘శాస్త్రీయ ప్రాతిపదిక’ను సమకూర్చేందుకు, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ (హెచ్‌సిక్యు) ఒక నిరుపయోగకర ఔషధమని, అంతేకాదు ప్రాణాంతక విషమని ఖండించేందుకు పాలక వర్గాలు, మీడియా ఆ తరహా శాస్త్రవేత్తలనే ఎంపిక చేసుకున్నారు!


నిత్య జీవిత వ్యవహారంలో ‘నీ మీద ఒట్టు’ అన్నంత తేలిగ్గా ‘సైన్స్’ పేరిట మాట్లాడడం సరికాదు. ‘ఇదీ సైన్స్’ అని మాట్లాడేందుకు ఎవరిని అనుమతించాలి, సైన్స్ ఏమిటి అనే విషయమై పలు మేధో వివాదాలున్నాయని, సైన్స్ భావం, ఆశయంపై శాస్త్రవేత్తల మధ్య ఎడతెగని చర్చ నడుస్తోందని నాకు తెలుసు. ‘విశ్వం, జీవితం గురించిన సత్యాల ఆవిష్కరణకు అనాసక్తి అన్వేషణే సైన్స్. సంశయించే సంస్కృతే సైన్స్’ అని రిచర్డ్ ఫెయిన్మన్ అన్నారు. నేను ఇంకా ఇలా అంటాను: ‘చర్చించే, భిన్నభిప్రాయాలను గౌరవించి, ప్రోత్సహించే సంస్కృతే సైన్స్’. వైజ్ఞానిక పరిశోధనా వ్యవహారాలలో ఏకాభిప్రాయమనేది చాలా అరుదు. విశ్వం పుట్టుక విషయమై ‘మహావిస్ఫోటం’ (బిగ్‌బ్యాంగ్) సిద్ధాంతాన్ని, జీవం పుట్టుకకు సంబం ధించి పరిణామ సిద్ధాంతాన్ని కొంతమంది సమర్థిస్తారు. మరి కొంతమంది సందే హిస్తారు. భూతాపం మానవ కార్యకలాపాల ఫలితమేనని కొందరు నిర్దిష్ట శాస్త్రీయ సమాచారం ప్రాతిపదికన ప్రతిపాదిస్తుండగా మరికొంతమంది అదే శాస్త్రీయ సమాచారం ఆధారంగా భూమి వేడెక్కిపోవడానికి మానవుల కార్యకలాపాలు కారణమనడం అసంగతమని వాదిస్తున్నారు. ఇవి సంశయవాదుల, అన్వేషకుల స్వీయ అభిప్రాయాలు. శాస్త్రవేత్తలందరికీ తమ తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉన్నది. అయితే సైన్స్ పేరిట, ఏదైనా ఒక విషయమై నిశ్చిత ప్రకటనలు చేసేందుకూ ఏ శాస్త్రవేత్తకూ లేదా శాస్త్రవేత్తల బృందానికీ ఎలాంటి హక్కు లేదు.


చెప్పవచ్చేదేమిటంటే సైన్స్ పేరిట మాట్లాడేందుకు లేదా సైన్స్ మార్గదర్శకత్వంలో తాను సాగుతున్నానని ప్రకటించేందుకు ఎవరినీ, అవును, ఏ ఒక్కరినీ అనుమతించకూడదు. ముఖ్యంగా కరోనా లాంటి మహమ్మారుల మహోపద్రవంలో ‘ఇదీ సైన్స్’ అని మాట్లాడగలగడం అసాధ్యం. ఎందుకంటే మనం ఒక అపరిచిత శత్రువు నెదుర్కొంటున్నాం. మరి కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు హెచ్‌సిక్యు ఉపయోగపడుతుందా లేదా అనే విషయమై శాస్త్రవేత్తల మధ్య వాద ప్రతివాదాలు జరుగతున్నాయి. ఇది సహజమే. ప్రపంచ వ్యాప్తంగాను, ప్రత్యేకించి బ్రెజిల్‌లోను పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు కరోనా నియంత్రణకు హెచ్‌సిక్యు వినియోగాన్ని సమర్థిస్తున్నారు. ఏ అధ్యయనాల ప్రాతిపదికన సమర్థిస్తున్నారో అవే అధ్యయనాల ఆధారంగా మరి కొంత మంది శాస్త్రవేత్తలు హెచ్‌సిక్యు నిరర్థక ఔషధమని అంటున్నారు. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, ఇండియా, ఇజ్రాయెల్, రష్యా, కోస్టారికా, సెనెగల్ మొదలైన దేశాలు కొవిడ్ -19 పై పోరుకు హెచ్‌సిక్యుని వినియోగిస్తున్నాయి. ఇతర దేశాలు ఆ మహమ్మారిని అదుపు చేయడంలో ఆ ఔషధాన్ని ఉపయోగించుకోవడాన్ని నిలిపివేశారు. మరి ఈ ఇరు వర్గాలలో ఎవరు సైన్స్ పేరిట మాట్లాడుతున్నారు? 


‘సైన్స్’ గురించిన ఈ చర్చను బ్రెజిల్‌లో క్లోరోక్విన్ (హెచ్‌సిక్యు)తో నిర్వహించిన ఒక అధ్యయనం, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో వెలువడిన ఆ అధ్యయన నివేదిక పురిగొల్పాయి. విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులకు భారీ మోతాదులో క్లోరోక్విన్‌ ఇవ్వడం జరిగిందని ఆ నివేదిక పేర్కొంది. హెచ్‌సిక్యు కంటే క్లోరోఫిన్ అధిక విషపూరితమైనది. ఫలితాలను అంచనావేయడంలో జరిగిన చిన్న పొరపాట్ల మూలంగా రోగికి ఇచ్చిన క్లోరోఫిన్ మోతాదు పెరుగుతూ పోయింది. బ్రెజిల్ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి లూయిజ్ హెన్రిక్ మాండెట్టా ఈ నివేదికను ఉటంకిస్తూ ‘కొవిడ్ -19 రోగులకు హెచ్‌సిక్యు ఇవ్వడాన్ని నేనెంత మాత్రం సమర్థించను. సైన్స్ ప్రాతిపదికనే నేనీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానని’ ఘంటాపథంగా చెప్పారు. చైనీస్ పరిశోధకులు నిర్వహించిన మరో అధ్యయన నివేదిక బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయింది. ఈ అధ్యయనమూ హెచ్‌సిక్యుని ఉపయోగించడాన్ని వ్యతిరేకించింది. పరిశోధకులు ఇలా పేర్కొన్నారు: ‘రోగ లక్షణాలు మధ్యస్థాయి నుంచి తీవ్ర స్థాయిలో వున్న రోగులకు మూడురోజులపాటు మూడు మిల్లీ గ్రాముల చొప్పున ఇచ్చాము. ఆ తరువాత 12 నుంచి 21 రోజుల పాటు 800 మిల్లీగ్రామలు చొప్పున ఇచ్చాము’. మరింత స్పష్టంగా చెప్పాలంటే భారీ మోతాదులో హెచ్‌సిక్యు ఔషధాన్ని ఇచ్చారు. ఇలా ఇచ్చిన ఔషధం చివరకు 20 గ్రాముల స్థాయికి చేరింది! ఇది పూర్తిగా అసంబద్ధం. అదీ రోగులకు వ్యాధి చాలా తీవ్ర దశలో ఉండగా ఇవ్వడం జరిగింది. హెచ్‌సిక్యును, రోగ లక్షణాలు చాలా ప్రాథమిక దశలో ఉన్నప్పుడు లేదా అంతకు పూర్వ దశలోనే ఇవ్వాలి. హెచ్‌సిక్యును గానీ, ఆ మాటకొస్తే మరే ఔషధాన్ని గానీ భారీ మోతాదులో ఇవ్వడమంటే రోగికి విషాన్ని ఎక్కించడంతో సమానమే. ఇది మంచి సైన్సేనా? బ్రెజిల్ కొత్త ఆరోగ్య మంత్రి ఆదేశాల ప్రకారం 2020 మే 20 నుంచి రోగులకు మొదటి రోజున రెండు సార్లు (ప్రతి 12 గంటలకు ఒకసారి) మొత్తం 400 మిల్లీగ్రాములు, ఐదు రోజులపాటురోజుకు 400 మిల్లీగ్రాముల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం 2.8 గ్రాముల హెచ్‌సిక్యుని కరోనా రోగులకు ఇస్తున్నారు.


ఇంకా న్యూఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ మొదలైన సుప్రసిద్ధ జర్నల్స్‌లో వెలువడిన పరిశోధనా పత్రాలలో కూడా హెచ్‌సిక్యుని భారీ మోతాదులో ఇవ్వడం వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యల గురించి విపులంగా పేర్కొనడం జరిగింది. స్త్రీల కంటే పురుషులు, శ్వేత జాతీయుల కంటే నల్ల జాతి ప్రజలు, ధూమ పానం అలవాటు లేని వారి కంటే ధూమ పానప్రియులలో మరణాల రేటు అధికంగా వున్నట్టు ఆ పరిశోధనల్లో వెల్లడయింది. ముఖ్యమైన విషయమేమిటంటే రోగులకు హెచ్‌సిక్యుని ఇవ్వడంలో పాటించవలసిన జాగ్రత్తలు పాటించలేదన్న వాస్తవాన్ని ఆ పరిశోధనా పత్రాలు చెప్పకనే చెప్పాయి. ఒక పరిశోధనా పత్రంలో రోగ లక్షణాలు బయటపడిన 16వ రోజున హెచ్‌సిక్యుని ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. అసలు విషయం ఏమిటంటే హెచ్ సిక్యుని ఐదో రోజునే ఇవ్వాలి. అలా కాకుండా, ఔషధాన్ని ఇవ్వడంలో పాటించవలసిన జాగ్రత్తలు పాటించనప్పుడు అదెలా సత్ఫలితాలనిస్తుంది?


ఈ అధ్యయనాలు సూచిస్తున్నదేమిటి? కొంతమంది శాస్త్రవేత్తలు ‘సైన్స్’ను ఎలా ఆచరించాలన్న విషయాన్ని మరచిపోయారని స్పష్టం చేస్తున్నాయి. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే హెచ్‌సిక్యు నిష్ప్రయోజన ఔషధమని నిరూపించేందుకు వారు ఈ అధ్యయనాలు నిర్వహించారన్న అభిప్రాయాన్ని అవి దృఢంగా నెలకొల్పుతున్నాయి. ఇటువంటి అధ్యయనాలను తమ నిర్ణయాలకు ప్రాతిపదికగా వైద్యమండళ్ళు, మెడికల్ ఆకాడమీల పెద్దలు ఎలా ఉటంకిస్తున్నారో అర్థం కావడం లేదు. ఫ్రాన్స్‌లో డాక్టర్ డిడియెర్ రావౌల్ట్ సకాలంలో సరైన మోతాదులో హెచ్‌సిక్యుని ఇవ్వడం ద్వారా మరణాల రేటుని 0.4 శాతానికి తగ్గించగలిగారు. బ్రెజిల్‌లోని ప్రివెంట్ సీనియర్ క్లినిక్ అనుభవం కూడా ఇదే. అయితే హెచ్‌సిక్యుని వ్యతిరేకిస్తున్న వారు ఎలాంటి వ్యర్థ వాదనలు చేస్తున్నారో చూడండి: ‘డాక్టర్ డిడియెర్ వివాదాస్పద పరిశోధకుడు’; ‘ప్రివెంట్ సీనియర్ క్లినిక్‌లో రోగనిదానం ఎలా చేయాలో కూడా తెలియదు’ (స్పష్టమైన కొవిడ్ రోగ లక్షణాలతో ఈ క్లినిక్‌లో చేరిన వారెవ్వరూ చనిపోలేదు); ‘ప్లేసెబో ఎఫెక్ట్’ (రోగ నివారణకుగాక రోగి మనస్సును తృప్తిచెందడానికి ఇచ్చే మందు); ‘ఆరోగ్య భద్రతా ప్రణాళికా కంపెనీలు నిర్వహించిన అధ్యయనాలు’ ఇత్యాదులు. హెచ్‌సిక్యుకి అనుకూలంగా ఉన్న అధ్యయనాల వివరాలను నేను ప్రతిరోజూ నా ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటాను. చాలా మంది నన్ను సమర్థిస్తున్నారు. వ్యతిరేకిస్తున్నవారు ‘ఒక సుప్రసిద్ధ శాస్త్రవేత్త బోల్సానారో (బ్రెజిల్ అధ్యక్షుడు) లాంటి పాలకుడిని ఎలా సమర్థిస్తున్నారు?’ అంటూ విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఇదలా వుంచితే ఒక ముఖ్యమైన ప్రశ్నకు వెళదాం. కరోనా వ్యాధిగ్రస్తుల ప్రాణాలను కాపాడడంలో హెచ్‌సిక్యు సమర్థంగా పనిచేయగలదని ‘సైన్స్’ ప్రాతిపదికన చెప్పగలమా? అలా నిశ్చితంగా చెప్పలేము. ఏ నిజమైన శాస్త్రవేత్తా అలా చెప్పడు. కొద్ది సంవత్సరాల తరువాత మాత్రమే హెచ్‌సిక్యు గురించి మరింత మెరుగ్గా తెలుసుకోగలం. మరి హెచ్‌సిక్యు పనిచేయదని కచ్చితంగా చెప్పగలమా? చెప్పలేము. నిజాయితీగా ఆలోచించేవారు ఎవరూ అలా చెప్పరు. కనుక ‘సంశయాత్మక సైన్స్’ను అలా వదిలివేసి న్యాయశాస్త్రానికి వెళదాం. బ్రెజిల్‌లో కొవిడ్ రోగులకు హెచ్‌సిక్యుని ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ‘సైన్స్’పై చర్చకు భరత వాక్యం పలకాలని న్యాయమూర్తులను అర్థించారు. ఒక సందిగ్ధ పరిస్థితిని తొలగించడంలో న్యాయశాస్త్రంలో నిరాక్షేపణీయమైన, బహుజనసమ్మతమైన పద్ధతి ఒకటి ఉన్నది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఏదైనా ఒక కేసులో బలమైన సంశయ ముంటే ప్రతివాదికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని ఆ పద్ధతి నిర్దేశిస్తుంది (ఈ సందర్భంలో ప్రతివాది హెచ్‌సిక్యు అని మరి చెప్పనవసరం లేదు). హెచ్‌సిక్యుకి అనుకూలంగా అనేక వాదనలు చేసేందుకు అవకాశమున్నదనడంలో సందేహం లేదు. ఒక అంతిమ వాదనను కూడా పరిగణనలోకి తీసుకుందాం. కొవిడ్ రోగికి హెచ్‌సిక్యుని ఉపయోగించనప్పుడు అతని ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశం అధికంగా లేదా? ఉన్నది కాబట్టే సుప్రీం కోర్టు హెచ్‌సిక్యుకి అనుకూలంగా నిర్ణయించింది. వాస్తవాలు, హేతువు ఆధారంగా తీసుకున్న నిర్ణయమది. రోగులు ప్రాణాలున్న ప్రజలేగానీ పరిశోధనా పత్రాలు కారు కదా. అంటే డాక్టర్లు తప్పనిసరిగా రోగులను ప్రత్యక్షంగా చూడడం ద్వారా వారికి చికిత్స చేయాలి. డాక్టర్ -రోగికి మద్య ముఖాముఖి సంబంధం తప్పనిసరి. ఆసుపత్రి ద్వారా అందే సేవలన్నీ రోగికి అందాలి. వైద్యశాస్త్రం తొలినాళ్లనుంచీ ఈ పద్ధతిలోనే అసంఖ్యాకుల ప్రాణాలను కాపాడడం జరిగింది. రోగ నిర్మూలన, ఆరోగ్యపరిరక్షణలో ఆసుపత్రి నిర్వహించేపాత్ర సర్వస్వతంత్రమైనది. ఇది విస్మరించరాని సత్యం. 

(‘కొనెక్సా పొలిటికా’ సౌజన్యం)

Updated Date - 2020-05-28T07:54:11+05:30 IST