జల విద్యుత్తు జోష్‌ ఎన్నాళ్లు?

ABN , First Publish Date - 2021-10-19T08:02:45+05:30 IST

దేశవ్యాప్తంగా బొగ్గు కొరత తీవ్రంగా ఉండి... థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు మూతపడుతుండగా...

జల విద్యుత్తు జోష్‌ ఎన్నాళ్లు?

  • ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి వస్తే ఆపేస్తారేమో!.. 
  • ఇప్పుడు దేశమంతటా కరెంటు సంక్షోభం
  • ఒడ్డున ఉన్న కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ
  • రాష్ట్రంలో మూడో వంతు జల విద్యుత్తే
  • బోర్డులకు అధికారుల్ని ఇచ్చిన తెలంగాణ
  • లెక్క తేలాకే ప్రాజెక్టులు అప్పగిస్తాం
  • కృష్ణా బోర్డు ఏపీకి కొమ్ము కాస్తోందని
  • మండిపడుతున్న తెలంగాణ అధికారులు


హైదరాబాద్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా బొగ్గు కొరత తీవ్రంగా ఉండి... థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు మూతపడుతుండగా... తెలంగాణ విద్యుత్తు అవసరాలు తీర్చడంలో జల విద్యుత్కేంద్రాలు థర్మల్‌ ప్లాంట్లతో పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది జూన్‌ నుంచే కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టుల్లో జల విద్యుదుత్పాదన ప్రారంభమైంది. ఆదివారం దాకా రాష్ట్రవ్యాప్తంగా 11 కేంద్రాల్లో 4,041 మిలియన్‌ యూనిట్ల జలవిద్యుదుత్పత్తి జరగడం గమనార్హం. జల విద్యుత్తు కేంద్రాలన్నీ కృష్ణా బేసిన్‌లోనే ఉన్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్‌లలోని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకొస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ అమలుకు జల విద్యుత్‌ కేంద్రాలే ప్రతిబంధకంగా ఉన్నాయి. తెలంగాణ జల విద్యుత్తు కేంద్రాలను అప్పగిస్తేనే తాము తమ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగిస్తామని ఏపీ ప్రభుత్వం మెలిక పెట్టింది. వివాదమంతా శ్రీశైలం భూగర్భ జల విద్యుత్తు కేంద్రంతో పాటు నాగార్జున సాగర్‌లోని రెండు కేంద్రాలపైనే ఉంది. తెలంగాణలో 2,441.8 మెగావాట్ల జల విద్యుత్తు కేంద్రాలు ఉండగా.. వీటిలో కీలకమైనవన్నీ కృష్ణానది పైనే ఉన్నాయి. 


గోదావరి బేసిన్‌లో ఉన్నవన్నీ చిన్నాచితక కేంద్రాలే. వీటి సామర్థ్యం 70 మెగావాట్ల దాకే ఉంది. ఏపీ మెలిక పెడుతున్న శ్రీశైలంలో ఈ సీజన్‌లో 1,526 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయ్యింది. నాగార్జునసాగర్‌ ప్రధాన డ్యామ్‌లో 1,547 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి జరిగింది. రాష్ట్రంలోని జల విద్యుత్తు కేంద్రాల్లో 4,041 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి జరగ్గా.. అందులో 3,959 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులపైనే జరిగింది. ఇంత కీలకమైన జల విద్యుత్‌ కేంద్రాలను బోర్డులకు అప్పగించడానికి తెలంగాణ విముఖత చూపుతోంది. అవి బోర్డుల పరిధిలోకి వెళితే ప్రస్తుతం దేశంలో ఉన్న విద్యుత్తు సంక్షోభం లాంటి పరిస్థితి మళ్లీ తలెత్తితే రాష్ట్రంలో చీకట్లు తప్పవనే ఆందోళన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. 


రాష్ట్ర అవసరాలు తీర్చుతున్న జల విద్యుత్తు

రాష్ట్రంలో జలవిద్యుదుత్పాదన జోరుగా ఉంటోంది. థర్మల్‌ కేంద్రాలపై ఆధారపడే పరిస్థితి తగ్గింది.  దేశవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్న బొగ్గు కొరత ప్రభావం తెలంగాణపై పాక్షికంగానే ఉంది. 4  రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయి. రాష్ట్ర అవసరాలు తీర్చడంలో జలవిద్యుత్‌ పాత్ర కీలకంగా మా రింది. ఆదివారం రాష్ట్ర విద్యుత్తు వినియోగం 157 మిలియన్‌ యూనిట్లు కాగా.. మూడోవంతు (43 మి.యూ) జలవిద్యుత్తు కేంద్రాలే అందించాయి. ఏప్రిల్‌ 1నుంచి ఆదివారం దాకా జెన్‌కో థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో 13,287 మిలియన్‌ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. జలవిద్యుత్తు కేంద్రాల్లో 4,041 మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. ఈ సీజన్‌లో మొత్తం 5వేల మిలియన్‌ యూనిట్లు దాటుతుందని అంచనా.


అధికారులకు పోస్టింగ్‌లు

కేంద్ర గెజిట్‌ నేపథ్యంలో కృష్ణా, గోదావరి బోర్డు ప్రాధాన్యం పెరుగుతుండటంతో ఆయా బోర్డుల్లో తెలంగాణ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  నీటిపారుదల శాఖ ప్ర త్యేక ప్రధాన కార్యదర్శి వద్ద విధులు నిర్వర్తిస్తున్న కె.ప్రసాద్‌కు గోదావరి బోర్డులో ఎస్‌ఈగా పోస్టింగ్‌ ఇచ్చారు. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎం.రవికుమార్‌కు బాన్సువాడ ఎస్‌ఈగా పోస్టింగ్‌ ఇచ్చారు. కృష్ణాబోర్డులో ఎస్‌ఈగా పనిచేస్తున్న బాబా షర్ఫుద్దీన్‌ను వాలంతరిడైరెక్టర్‌గా పంపించారు. కృష్ణా బోర్డులో బాబా షర్ఫుద్దీన్‌ క్రియాశీలకంగా విధులు నిర్వర్తించడం లేదని తప్పించారు. పెబ్బేరులో పనిచేస్తున్న దక్షిణామూర్తికి కేఆర్‌ఎంబీలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పోస్టింగ్‌ ఇచ్చారు. సీడీవోలో పనిచేస్తున్న వి.రఘునాథశర్మను గోదావరి బోర్డులో ఈఈగా నియమించారు. ఈఎన్‌సీ కార్యాలయంలో పనిచేస్తున్న మాధవిని గోదావరి బోర్డులో డీఈఈగా నియమించారు. ఈఎన్‌సీ వద్ద డీఈఈగా పనిచేస్తున్న ఎస్‌.శ్రీధర్‌కుమార్‌ను కృష్ణాబోర్డులో డీఈఈగా వేశారు. కృష్ణాబోర్డులో ఈఈగా పనిచేస్తున్న అశోక్‌కుమార్‌ ఎస్‌ఈగా బాధ్యతలు నిర్వర్తిస్తారని ప్రకటించారు.

 

లెక్క తేలాకే ప్రాజెక్టుల అప్పగింత

శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలోని తమ ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తెస్తూ జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్‌ సర్కారు తెలంగాణ ప్రాజెక్టులతో కలిపే వాటిని స్వాధీనం చేసుకోవాలని జీవోలో మెలిక పెట్టింది. దాంతో తె లంగాణ ప్రాజెక్టులు అప్పగించే దాకా ఏపీ ప్రాజెక్టులను కృష్ణా బోర్డు స్వాధీనం చేసుకునే అవకాశాలు లేకుండా పోయింది. దీనిపై తెలంగాణ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఏపీ జీవోపై సోమవారం తెలంగాణ అధికారులు నీటి పారుదల శాఖ ఈఎన్‌సీ కార్యాలయంలో చర్చించారు. గెజిట్‌కు సహకరించాలనే గుణమే ఏపీకి ఉంటే.. తొలుత ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించాలని, తెలంగాణ ప్రాజెక్టులతో మెలిక పెట్టడం దేనికని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు నుంచి కేటాయింపుల మేరకు 34 టీఎంసీలకు మించి తరలించబోమని కృష్ణా బోర్డు, ఏపీ ప్రభుత్వాలు మాటిస్తే తెలంగాణలోని ప్రాజెక్టులను అప్పగించడానికి అభ్యంతరం లేదని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మా ణం జరిగిందే జల విద్యుత్తు కోసమని పేర్కొన్నారు.  ఏపీ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్‌ పాటపాడుతోందని ఆక్షేపించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాల విడుదలపై కేంద్ర జల వనరుల సంఘం(సీడబ్ల్యూసీ) ప్రొటోకాల్‌పై అధ్యయనం చేయిస్తుండటంతో కమిటీ నివేదిక ఇచ్చేదాకా అయినా ఆగాలని సూచిస్తోంది.  

Updated Date - 2021-10-19T08:02:45+05:30 IST