డీజీపీ ఆఫీస్‌ వద్ద హైడ్రామా

ABN , First Publish Date - 2021-09-18T08:40:02+05:30 IST

డీజీపీ ఆఫీస్‌ వద్ద హైడ్రామా

డీజీపీ ఆఫీస్‌ వద్ద హైడ్రామా

టీడీపీ ఎమ్మెల్యేలకు నో ఎంట్రీ

ఆళ్లను దగ్గరుండి తోడ్కొళ్లిన ఎస్పీ అమ్మిరెడ్డి

ఇది పోలీస్‌ కార్యాలయమా..? వైసీపీ ఆఫీసా!

మండిపడ్డ టీడీపీ నేతలు


అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే జోగి, వైసీపీ నేతలు దాడి చేసిన ఘటనపై ఫిర్యాదు చేయడానికి టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు శుక్రవారం మధ్యాహ్నం డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. రోడ్డు పక్కనే ఉన్న ప్రధాన గేటు వద్దే వారిని పోలీసులు అడ్డుకున్నారు. తాము వినతి పత్రం ఇచ్చేందుకు మాత్రమే వచ్చామని నేతలు ఎంత చెప్పినా పోలీసులు ససేమిరా అన్నారు. డీజీపీని కలిసి వినతిపత్రం ఇవ్వకుండా అక్కడ నుంచి కదిలేది లేదంటూ తెలుగుదేశం నేతలు భీష్మించారు. దీంతో డీఎ్‌సపీ స్థాయి అధికారులు బయటకువచ్చి వెళ్లిపోవాలంటూ హెచ్చరించారు. వారిని టీడీపీ ఎమ్మెల్యేలు స్వామి, రామానాయుడు లోపలికి పంపించాలంటూ బతిమలాడారు. వారు సానుకూలంగా స్పందించలేదు. సుమారు గంటకుపైగా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు బయటే ఉండిపోయారు. టీడీపీ నేతలు వస్తున్నారన్న సమాచారంతో పోటీగా వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి డీజీపీ కార్యాలయానికి అదే సమయంలో వచ్చారు. కొన్ని నెలల క్రితం వరకూ గుంటూరు ఎస్పీగా పనిచేసిన అమ్మిరెడ్డి డీజీపీ కార్యాలయం లోపలి నుంచి బయటికి వచ్చి ఆళ్లను గౌరవంగా లోపలికి తీసుకెళ్లారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు పోలీసు అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దళిత ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి అరగంటకు పైగా బతిమాలుతుంటే అనుమతించని పోలీసు అధికారులు వైసీపీ ఎమ్మల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డిని ఎంతో గౌరవంగా తీసుకెళ్లడం ఏంటని నిలదీశారు. ‘‘డీజీపీ కార్యాలయంలోకి వచ్చేందుకు వైసీపీ ఎమ్మెల్యేలకు తప్ప టీడీపీ ఎమ్మెల్యేలకు అనుమతి లేదా? వినతి పత్రం ఇచ్చుకునే హక్కు కూడా మాకు లేదా? ఇది డీజీపీ ఆఫీసా! వైసీపీ ఆఫీసా?’’ అంటూ ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి కుమార్‌, ఏలూరి సాంబశివరావు, మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, దేవినేని ఉమా మహేశ్వరరావు, అమర్నాథ రెడ్డి, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌ కుమార్‌, దూళిపాళ్ల నరేంద్ర, బోడే ప్రసాద్‌, జీవీజీ ఆంజనేయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వినతిపత్రం ఇచ్చే తీరుతామంటూ టీడీపీ నేతలు పట్టుబట్టడంతో నలుగురిని మాత్రం లోపలికి అనుమతిచ్చారు. 


చంద్రబాబును చంపాలనే... టీడీపీ ఫిర్యాదు

‘‘ప్రతిపక్ష నేత చంద్రబాబును అంతమొందించేందుకు వైసీపీ నేతలు పక్కా ప్రణాళికతో దాడి చేశారు ఇందుకు బాధ్యులైనవారిపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలి’’ అని టీడీపీ డిమాండ్‌ చేసింది. ఆమేరకు శాంతి భద్రతల ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌కు టీడీపీ ఎమ్మెల్యేలు వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు ఇంటిపైకి వెళ్తానంటూ ఈ నెల 16న సోషల్‌మీడియాలో హెచ్చరించి 17న భారీ కాన్వాయ్‌తో వచ్చి దాడికి దిగినా పోలీసులు అనుమతించారని ఆరోపించారు. వైసీపీ నేతల విధ్వంసాన్ని ఆపని పోలీసుల పాత్రపైనా టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. కాగా, శుక్రవారం రాత్రి వరకూ పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించలేదు. ఉన్నతాధికారులను సంప్రదించగా ఇరుపార్టీలు ఫిర్యాదు చేశాయని, పరిశీలిస్తున్నామని సమాధానమిచ్చారు. 

Updated Date - 2021-09-18T08:40:02+05:30 IST