Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్టీసీ ఉద్యోగులకు ఇక నుంచి 1వ తేదీనే జీతాలు?

జాతీయ బ్యాంకుతో యాజమాన్యం ఒప్పందం

హైదరాబాద్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు చెల్లించేందుకు యాజమాన్యం ఒక జాతీయ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ప్రతి నెలా మొదటి రోజునే వేతనాలకు అవసరమైన  మొత్తాన్ని ఓడి (ఓవర్‌డ్రాఫ్ట్‌) కింద ఆ బ్యాంకు సమకూర్చి ఉద్యోగుల ఖాతాల్లో జమచేయనున్నట్లు తెలిసింది. 47 వేల మందికిపైగా ఉద్యోగులకు నెలనెలా వేతనాలకు రూ.230 కోట్లకు పైగా కావలసి ఉంది. పీఎఫ్‌ సుమారు రూ.40 కోట్లు, సీసీఎస్‌ రూ.30 కోట్లు మొత్తం రూ.70 కోట్లను ఆర్టీసీ ఆ తర్వాత సర్దుబాటు చేసుకుంటుంది. ఈ మొత్తాన్ని మినహాయించి వేతనాల వరకు సుమారు రూ.160 కోట్లు ఓడీ కింద బ్యాంకు సమకూర్చడానికి అంగీకరించినట్లు తెలిసింది. గత నెల రోజులుగా ఆర్టీసీ పూర్తిస్థాయిలో బస్సులను పునరుద్ధరించింది. కానీ, కరోనా భయంతో ఆశించిన స్థాయిలో బస్సుల్లో ప్రజలు ప్రయాణించడంలేదు. రోజువారీ ఆర్టీసీ ఆదాయం రూ.15 కోట్ల నుంచి రూ.9.5 కోట్లకు పడిపోయింది. దీనికి తోడు డీజిల్‌, బస్సుల విడిభాగాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సంస్థ ఆర్థిక సంక్షోభాన్నిఎదుర్కొంటోంది. కాగా, ఆర్టీసీలో దీర్ఘకాలిక సెలవుల్లో వెళ్లే ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు నిలిపివేస్తూ అధికారులు సర్క్యులర్‌ జారీ చేశారు. విదేశాలకు వెళ్లే వారికి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసేవారు. ఇక నుంచి ఉద్యోగులు వారి పరిమితి మేరకు వినియోగించే సెలవులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తారు.


5న ఆర్టీసీ పరిరక్షణ-అమరవీరుల సంస్మరణ దినం: జేఏసీ పిలుపు

 అక్టోబర్‌ 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలు, యూనిట్లలో ‘ఆర్టీసీ పరిరక్షణ దినం- అమరుల సంస్మరణ దినం’గా పాటించాలని జేఏసీ చైర్మన్‌ కె.రాజిరెడ్డి పిలుపునిచ్చారు. బస్‌భవన్‌ వద్ద  గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి నిరసనగా అక్టోబర్‌ 7న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తూ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాలని తీర్మానించినట్లు తెలిపారు. 

Advertisement
Advertisement