జిల్లా క్రీడాకారులుగా హైదరాబాదీలు..!

ABN , First Publish Date - 2022-08-16T05:30:00+05:30 IST

ప్రస్తుతం క్రికెట్‌ అంటే ఇష్టపడని వారు లేరు. క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న యువకులు చదువును సైతం పక్కనపెట్టి బ్యాట్‌ చేత పట్టి క్రికెట్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన సబ్‌ సెంటర్లలో చేరి క్రికెట్‌లో శిక్షణ పొందుతున్నారు. క్రికెట్‌ క్రీడాకారునిగా జిల్లాకు, రాష్ట్రానికి సేవలు పేరు తేవాలని తపన పడుతున్న క్రికెట్‌ క్రీడాకారునికి క్రికెట్‌ అసోసియేషన్‌ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా క్రీడాకారులను పక్కన పెట్టి హైదరాబాద్‌ నుంచి క్రీడాకారులను దిగుమతి చేసుకుంటోంది. వివరాల్లోకి వెళితే..

జిల్లా క్రీడాకారులుగా హైదరాబాదీలు..!

విద్య, నివాసం హైదరాబాద్‌లో.. క్రికెట్‌ ఆడేది కడప జిల్లాలో

వారినే ఎంపిక చేస్తున్న సెలక్టర్లు

సీఎం సొంత జిల్లాలో ఇదీ తీరు

కడప, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం క్రికెట్‌ అంటే ఇష్టపడని వారు లేరు. క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న యువకులు చదువును సైతం పక్కనపెట్టి బ్యాట్‌ చేత పట్టి క్రికెట్‌ అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన సబ్‌ సెంటర్లలో చేరి క్రికెట్‌లో శిక్షణ పొందుతున్నారు. క్రికెట్‌ క్రీడాకారునిగా జిల్లాకు, రాష్ట్రానికి సేవలు పేరు తేవాలని తపన పడుతున్న క్రికెట్‌ క్రీడాకారునికి క్రికెట్‌ అసోసియేషన్‌ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా క్రీడాకారులను పక్కన పెట్టి హైదరాబాద్‌ నుంచి క్రీడాకారులను దిగుమతి చేసుకుంటోంది. వివరాల్లోకి వెళితే..

జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ క్రికెట్‌ క్రీడను ప్రోత్సహించేందుకు ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు, మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠం, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు పట్టణం, కడప నగరాలలో సబ్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ సబ్‌ సెంటర్లలో కోచ్‌లను నియమించి యువకులకు క్రికెట్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ప్రతి ఏటా అండర్‌-14, అండర్‌-16, అండర్‌ -19, ఆపై సీనియర్‌ విభాగాలకు సంబంధించి జిల్లా టీమ్‌ ఎంపిక చేస్తారు. అయితే జిల్లా సబ్‌సెంటర్ల నుంచి వచ్చిన క్రీడాకారులు ఆయా విభాగాలలో తక్కువ మంది మాత్రమే ఎంపిక అవుతున్నారు. ఎక్కువగా హైదరాబాద్‌ నుంచి వచ్చిన క్రీడాకారులు ఎంపిక అవుతున్నారు. ఇది ఎలా సాధ్యం అవుతోందో అర్థం కాక జిల్లా క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.


హైదరాబాద్‌ వారు ఇక్కడ ఎలా..?

హైదరాబాద్‌లో తల్లిదండ్రులు నివాసం ఉంటారు. క్రీడాకారుడు కూడా అక్కడే చదువుతుంటాడు. అయితే కడపలోని ఓ కళాశాలలో చదువుకుంటున్నట్లుగా అడ్మిషన్‌ చేయించి ప్రతి ఏటా పరీక్షా సమయంలో మాత్రమే ఇక్కడికి వచ్చి పరీక్ష రాసి వెళతారు. జిల్లాలో చదవరు. జిల్లాలో నివాసం ఉండరు. సబ్‌సెంటర్లలో హాజరు ఉంటుంది. అలాగే కళాశాలలో కూడా హాజరు ఉంటుంది. ఈ వ్యవహారమంతా డబ్బులు చేతులు మారడంతో నడుస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


ప్రతి విభాగంలోనూ హైదరాబాదీలే

అండర్‌-14, 16, 19 విభాగాలలో ప్రతి టీమ్‌లో ఏడుగురు వరకు ఉంటే జిల్లా క్రీడాకారులు ముగ్గురు నలుగురు మాత్రమే ఎంపికవుతారు. మిగిలిన వారంతా హైదరా బాదీలే. జిల్లాలో ప్రతిభ కనపరిచిన వారు ఉన్నప్పటికీ స్టాండ్‌బైలో స్థానం పొంది క్రీడాకారులకు నీళ్ల బాటిళ్లు అందిస్తూ మరో సంవత్సరమైనా ఎంపిక కాకపోతామా అని ఎదురు చూస్తుంటారు.


అండర్‌-19 ఎంపికల్లోనూ..

జిల్లాలో ప్రస్తుతం అండర్‌-19 జిల్లా క్రికెట్‌ ఎంపికలు పూర్తయ్యి అంతర్‌ జిల్లా జట్ల మధ్య పోటీలు జరుగు తున్నాయి. ఇందులో కడప జిల్లా జట్టులో ఏడుగురికి పైగా హైదరాబాదీలే స్థానం సంపాదించుకున్నారు. దీంతో జిల్లాలోని క్రీడాకారుల తల్లిదండ్రులు హైదరాబాదీ క్రీడాకారులు ఈ జిల్లా తరపున ఎలా ఆడుతారంటూ క్రికెట్‌ అసోసియేషన్‌ వారిని ప్రశ్నించారు. హైదరాబాదీలు అసోసియేషన్‌కు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు తమకు చూపాలని కోరారు. జిల్లా క్రికెట్‌ జట్టుకు ఎంపికైన 9 మంది హైదరాబాద్‌ వాసులని భావిస్తున్నారు. ఈ మేరకు ఆ 9 మంది వివరాలను ఇవ్వాలని జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యుడు రాజశేఖర్‌ ఎంపిక కమిటీని కోరారు. వారు గత 20 రోజులుగా ఇస్తామని చెప్పి ఇప్పుడు మాత్రం మీరే వెళ్లి వారి సర్టిఫికెట్లు తెచ్చుకొని పరిశీలించుకోవాలని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు అనుమానానికి బలం చేకూరినట్లు అవుతోంది.


రాష్ట్రంలో ఈ దుస్థితి కడప జిల్లాలో మాత్రమే..

రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా ఇతర జిల్లా క్రికెట్‌ క్రీడాకారులను పోత్సహించరు. కేవలం కడప జిల్లాలో మాత్రమే ఇక్కడి క్రీడాకారులను వదిలేసి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ నుంచి దిగుమతి చేసుకునే దుస్థితి దాపురించింది. సీఎం సొంత జిల్లాలో ఇంత జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం శోచనీయం.


క్రికెట్‌ అకాడమీలతో అటాచ్‌మెంట్‌

హైదరాబాద్‌లోని క్రికెట్‌ అకాడమీలతో క్రికెట్‌ అసోసియేషన్‌లోని ప్రముఖులు అటాచ్మెంట్‌ పెట్టుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రతి ఏటా అన్ని విభాగాలలో హైదరాబాద్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న వారే జిల్లా క్రికెట్‌ టీమ్‌లో స్థానం సంపాదించుకుంటున్నారు. దీంతో జిల్లాలో ప్రతిభ ఉన్న క్రీడాకారులు కేవలం ఎంపిక ప్రాపబుల్స్‌ గేమ్స్‌ వరకే పరిమితమవుతున్నారు.


రెండు సంవత్సరాలు సస్పెండ్‌ చేస్తాం

- సంజయ్‌కుమార్‌రెడ్డి, జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ 

కడప జిల్లాలో పుట్టి పెరిగిన వారు లేదా వారి తాతముత్తాతలు జిల్లా వారైనా ఉండి క్రీడాకారులు కడపలోనే చదువుకుంటున్నట్లైతే జిల్లా టీమ్‌లో ఎంపిక చేస్తున్నాము. 10వ తరగతి తరువాత ఇంటర్మీడియట్‌ ఎక్కడైనా చదవచ్చన్న నిబంధన కూడా బీసీసీఐ నుంచి ఉంది. క్రీడాకారులకు రెండు నెలల పాటు లీగ్‌ మ్యాచ్‌లు నిర్వహించి ఆ తరువాతే ఎంపిక చేస్తాము. క్రీడాకారులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు అసోసియేషన్‌కు సమర్పించి నట్లు రుజువైతే రెండు సంవత్సరాల పాటు ఎక్కడా క్రికెట్‌ ఆడేందుకు లేకుండా సస్పెండ్‌ చేస్తాం. 

Updated Date - 2022-08-16T05:30:00+05:30 IST