జూపార్క్‌లో కరోనా వ్యాపించకుండా ఏం చేస్తున్నారంటే...

ABN , First Publish Date - 2020-04-07T15:10:17+05:30 IST

అమెరికాలో బ్రాంక్స్‌ జూలో ఉన్న పులికి కరోనా వైరస్‌ వ్యాపించిందన్న వార్తలతో నెహ్రూ జూపార్క్‌ సిబ్బంది

జూపార్క్‌లో కరోనా వ్యాపించకుండా ఏం చేస్తున్నారంటే...

  • మార్చి మొదటి వారం నుంచి జూపార్క్‌లో శానిటైజేషన్‌
  • జూపార్క్‌ మొత్తం యాంటీవైరల్‌ ద్రావణాల పిచికారి,
  • ఎన్‌క్లోజర్‌లు ప్రాంతాల్లో సున్నం, బ్లీచింగ్‌ 
  • ప్రతిరోజు సిబ్బందికి ధర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజర్ల అందజేత


హైదరాబాద్‌ : అమెరికాలో బ్రాంక్స్‌ జూలో ఉన్న పులికి కరోనా వైరస్‌ వ్యాపించిందన్న వార్తలతో నెహ్రూ జూపార్క్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. జూపార్క్‌ సిబ్బందిని అప్రమత్తం చేసి పలు చర్యలు చేపట్టారు. జంతువులను ఉంచే ఎన్‌క్లోజర్లు, రాత్రి పూట ఉంచే ప్రాంతాలను శానిటైజ్‌ చేయడంతోపాటు సిబ్బందికి కూడా శానిటైజర్లు, మాస్కులు అందిస్తున్నారు. నిత్యం భౌతిక దూరం పాటించాలన్న సూచనలు అందిస్తున్నారు. ఇప్పటి వరకూ మన దేశంలో మనుషుల నుంచి జంతువులకు కరోనా వ్యాప్తి చెందిన దాఖలాలు లేనప్పటికీ జూపార్క్‌ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు ప్రారంభించారు. కరోనాతో బాధపడే వారితో జంతువులకు కూడా ఈ వైరస్‌ వ్యాపిస్తుందని తెలియడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందనడానికి ఆధారాలు లేనప్పటికీ, మనుషుల ద్వారా జంతువులకు సులభంగా సోకుతుందని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు రుజువు చేశాయి. మార్చి మొదటి వారం నుంచే జూపార్క్‌లో శానిటైజేషన్‌ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ప్రస్తుత నేపథ్యంలో జూపార్క్‌లో జంతువులకు కరోనా వ్యాపించకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.  


గ్లవ్‌, మాస్క్‌ ,వారానికో శానిటైజర్‌

జూపార్క్‌లో సందర్శకులను నిలిపివేసినప్పటికీ జంతువుల సంరక్షణ చూసే వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, తోటమాలులు దాదాపు 150 మంది నిత్యం విధుల్లో పాల్గొంటున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రోజూ విధులకు వచ్చే సిబ్బందిని ప్రధాన గేటు వద్దే థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేస్తున్నారు. అందులో పాజిటివ్‌ వస్తేనే లోపలికి అనుమతిస్తున్నారు. పనిచేస్తున్న సిబ్బంది భౌతిక దూరం పాటించేలా ఆదేశాలు జారీచేస్తూ, ఎప్పటికప్పుడు వారిని గమనిస్తున్నారు. ఒక్కొక్కరికి వారానికి ఒక శానిటైజర్‌ బాటిల్‌ను అందిస్తున్నారు. పనిచేస్తున్న సమయంలో చేతులకు గ్లవ్స్‌, మాస్క్‌లు తప్పనిసరిగా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునే అవకాశం ఇవ్వకుండా జూపార్క్‌లోనే వారికి కావాల్సిన టీ, భోజనాలను ఏర్పాటుచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. చేతులు కడుక్కునేందుకు సబ్బులను ఏర్పాటుచేశారు. ఎట్టి పరిస్థితుల్లో జూలో జంతువులకు సిబ్బంది ద్వారా కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు


ఎన్‌క్లోజర్‌లు, రాత్రిబసలు శానిటైజ్‌

జూపార్క్‌లో జంతువులు, పక్షులు, సరీసృపాలు అన్నీ కలిపి దాదాపు 1700 ప్రాణులు ఉన్నాయి. వీటిని ఎన్‌క్లోజర్‌లతో ఉంచుతారు. కొన్ని జంతువులను రాత్రి సమయంలో నిద్రించేందుకు వేరే స్థానానికి చేర్చుతారు. జూపార్క్‌ సిబ్బంది మార్చి మొదటి వారం నుంచి ఎన్‌క్లోజర్‌లు, రాత్రిబస ప్రాంతాలను 4 సార్లు శానిటైజ్‌ చేశారు. జంతువులు ఉండే ఎన్‌క్లోజర్లు, రాత్రిబస ప్రాంతాల్లో యాంటివైరల్‌ ద్రావణం (వైరాసిడ్‌ 1 లీటర్‌ నీటిలో 10 గ్రాములు కలిపి) పిచికారీ చేశారు. క్రిములను నాశనం చేసేందుకు సున్నం, బ్లీచింగ్‌ పౌడర్‌లు జంతువులు సంచరించే ప్రాంతాల్లో చల్లారు. జూపార్క్‌ గోడల నుంచి మొదలు కొని సిబ్బంది క్వార్టర్స్‌తోపాటు  జూపార్క్‌ మొత్తం సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కరోనా వ్యాప్తి కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఎన్‌క్లోజర్‌ల వద్ద శుభ్రత చర్యలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.


జంతువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ

జూపార్క్‌లో ఉన్న జంతువుల ఆరోగ్య పరిస్థితిని వెటర్నరీ వైద్యులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. జంతువులకు సరైన పోషకాలున్న ఆహారంతోపాటు పరిశుభ్రమైన నీటిని అందిస్తున్నారు. ముఖ్యంగా పులులు, క్షీరదాల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.  ఏవైనా జంతువులు దగ్గు, జలుబుతో బాధపడుతున్నాయా అనే విషయాన్ని నిత్యం గమనిస్తున్నారు. జలుబు వంటి లక్షణాలతో ఏదైనా జంతువు బాధపడుతోందని అనుమానం వస్తే వాటిని ఇతర జంతువుల నుంచి వేరు చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లలో ఉంచి ట్రీట్‌మెంట్‌ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. జంతువులు ఉండే ఎన్‌క్లోజర్లు 

ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నారు. 


పరిసరాల్లో బ్లీచ్‌, సోడియం హైపోక్లోరైడ్‌ వంటి ద్రావణాలు చల్లి వైరస్‌ వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్‌క్లోజర్లు శుభ్రపరిచే సిబ్బంది, ఆహారం అందించే సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారో లేదో ప్రత్యేకంగా గమనిస్తున్నారు. జంతువులకు ఇచ్చే ఆహారాన్ని తనిఖీ చేస్తున్నారు. కరోనా సోకిన లేదా అనుమానితులైన మనుషులు స్వతహాగా క్వారంటైన్‌లోకి వెళ్లి ఇతరులతో కలవకుండా ఉండొచ్చు. కానీ జంతువులను క్వారంటైన్‌ చేయడం, వాటిని ఏకాంతంగా ఉంచి చికిత్స అందించడం కొంతవరకూ కష్టమైన పనే అని జూ అధికారులు తెలిపారు.


జాగ్రత్తలు పాటిస్తున్నాం

విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని నిత్యం తనిఖీలు చేయడం, వారు రక్షణ చర్యలైన మాస్క్‌లు, గ్లవ్‌ ధరిస్తున్నారోలేదో గమనిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో బయటి ఆహారం లేకుండా సిబ్బందికి భోజనం జూపార్క్‌లోనే సిద్ధం చేస్తున్నాం. వైర్‌స లు వ్యాప్తి చెందకుండా జూపార్క్‌ మొత్తం యాంటీ వైరల్‌ ద్రావణం, సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాలు పిచికారీ చేశాం. జంతువులు సంచరించే ప్రాంతాల్లో సున్నం, బ్లీచ్‌ చల్లడం ద్వారా ఎలాంటి వైర్‌సలు వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వెటర్నరీ సిబ్బంది ఎప్పటికప్పుడు జంతువుల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్నారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా సిబ్బందిని ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తూ  పర్యవేక్షిస్తున్నాం. - జూపార్క్‌ క్యూరేటర్‌ ఎన్‌ క్షితిజ

Updated Date - 2020-04-07T15:10:17+05:30 IST