బియ్యపు గింజలపై భగవద్గీత

ABN , First Publish Date - 2020-10-20T22:11:30+05:30 IST

బియ్యపు గింజలపై తాజ్‌మహాల్‌, చార్‌మినార్‌ వంటి ఎన్నో కళాకృతులను చిత్రించడం మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఏకంగా భగవద్గీతనే...

బియ్యపు గింజలపై భగవద్గీత

బియ్యపు గింజలపై తాజ్‌మహాల్‌, చార్‌మినార్‌ వంటి ఎన్నో కళాకృతులను చిత్రించడం మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి ఏకంగా భగవద్గీతనే  బియ్యపు గింజలపై రాసి రికార్డు సృష్టించారు. దీనికోసం వేల సంఖ్యలో బియ్యపు గింజలను వినియోగించారు. రోజుల కొద్దీ శ్రమించారు. ఇంతవరకు ఎవరూ సృష్టించని కళాఖండాన్ని రూపొందించి తన గొప్పతనాన్ని చాటారు.


హైదరాబాద్‌కు చెందిన సారికకు చిన్నప్పటి నుంచి కళలంటే ఎంతో ఇష్టం. పాటలు పాడడం, వివిధ రకాల కళాకృతులు తయారు చేయడంపై ఎక్కువ ఇష్టం కనబరిచేవారు. 2009లో లక్ష మందితో కలిసి ఓకేసారి కీర్తనలు ఆలపించినందుకుగానూ సారికకు గిన్నీస్‌ రికార్డు కూడా లభించింది. గత నాలుగేళ్లుగా సారిక మైక్రో ఆర్ట్‌పై దృష్టి సారించారు. మొదట బియ్యపు గింజలపై ఇంగ్లీషు అక్షరాలను రాసి వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. ఆ తరువాత మరికొన్ని కళాకృతులకు గీయడం నేర్చుకున్నారు. గతేడాది నార్త్‌ ఢిల్లీ కల్చరల్‌ అకాడమీ నుంచి నేషనల్‌ అవార్డును కూడా అందుకున్నారు. అయితే ఇంకా ఏదైనా గొప్పగా చేయాలని సారిక అనుకున్నారు. అందులో భాగంగానే బియ్యపు గింజలపై భగవద్గీత రాయాలనే ఆలోచన చేశారు.


బియ్యపు గింజలపై భగవద్గీతను రాయడం అంత సులువేమీ కాదు. రోజుల తరబడి శ్రమించాలి. ఎంతో ఏకాగ్రతతో ఒక్కో గింజపై అక్షరాలను రాయాలి. అయితే సారిక ఆ కష్టాన్ని ఎంతో ఇష్టంగా భావించారు. తన ఆశయం ముందు మిగతా ఇబ్బందులన్నీ ఆమెకు చిన్నవిగా కనిపించాయి. ఎట్టకేలకు 150 గంటలు శ్రమించి మొత్తం భగవద్గీతను బియ్యపు గింజలపై రాశారు. దీనికోసం 4,042 బియ్యపు గింజలను వినియోగించారు. ఈ సందర్భంగా సారిక మాట్లాడుతూ, ఈ ఘనత సాధించినందుకు తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు. తన కళకు మరింత పదును పెడతానని, ఇంకా ఎన్నో కళాఖండాలను తీర్చిదిద్దాలనుకుంటున్నానని సారిక చెప్పారు.


మైక్రో ఆర్టిస్ట్‌గా సారిక ఇప్పటివరకు 2వేలకు పైగా కళాకృతులను బియ్యపు గింజలపై చిత్రించారు. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలి యువ మైక్రో ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. బియ్యపు గింజలే కాకుండా పేపర్‌ కార్వింగ్, సిసీమీ సీడ్స్‌పై కళాకృతులు చెక్కడం, మిల్క్‌ ఆర్ట్‌ వంటి ఎన్నో కళాఖండాలను సారిక రూపొందించారు. అంతేకాకుండా భారత రాజ్యాంగ ఉపోద్ఘాతాన్ని వెంట్రుకలపై చిత్రించి గవర్నర్‌ తమిళిసై అభినందనలు కూడా అందుకున్నారు. 

Updated Date - 2020-10-20T22:11:30+05:30 IST