Abn logo
Jun 13 2021 @ 09:26AM

కరోనా వేళ కసరత్తుపై దృష్టి పెట్టిన హైదరాబాద్ యువత

  • ఫిట్‌నెస్‌తోనే ఇమ్యూనిటీ
  • వాకింగ్‌, యోగా వైపై మొగ్గు  
  • అభిరుచికి తగ్గట్టుగా ఏర్పాటవుతున్న జిమ్‌లు

హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్‌ : అమ్మాయిలకైతే జీరో ప్యాక్‌. అబ్బాయిలకైతే సిక్స్‌ ప్యాక్‌.. అందాన్నే కాదు.. దేహ సౌందర్యాన్ని ప్రతిబింబింపచేసే ఈ ప్యాక్‌ల కోసం యువత ఉర్రూతలూగేవారు. కండలు కనిపిస్తే ఫిట్‌గా ఉన్నామనేది వారి భావన. అయితే ఇప్పుడు కసరత్తులో కూడా యువత దృష్టి మారింది. కరోనా కాలంలో కండలు పెంచేకన్నా ఫిట్‌గా ఉండటంతోపాటు ఇమ్యునిటీ వైపు దృష్టి సారించారు. కసరత్తు చేసే సమయాన్ని పెంచారు. రోగ నిరోధక శక్తి పెంచడంతో పాటు రోగాలకు దూరంగా ఉండటం కోసం యోగా తదితర అంశాలతోపాటు కసరత్తు విధానంలో మార్పులు చేస్తూ బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో కొత్త తరహా జిమ్‌లు ఏర్పాటు అవుతున్నాయి. 


ప్రత్యేక ఏర్పాట్లు.. 

చెట్టుపై కోతి చేసే విన్యాసాలను ఎప్పుడైనా గమనించారా? లేదంటే ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకు గెంతడాన్ని గుర్తించారా? ఒళ్లంతా తేలికగా గాల్లో కదుపుతూ ఆధారాన్ని చేసుకుంటుంది. ఇదే సూత్రాన్ని ఇప్పుడు పాటిస్తున్నారు. చాలా స్పాలలో.. ఇందుకోసం రూఫ్‌ టాప్‌లపై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టుకొని వేళాడుతూ ముందుకు కదిలేందుకు వీలుగా ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరం గాలిలో తేలికగా కదులుతుంది. కండరాలు అన్నివైపులా సులువుగా కదులుతాయి.

బ్యాలెన్సింగ్‌ కోసం..  

ఇక శరీరాన్ని బ్యాలెన్సింగ్‌గా ఉంచడం మరో కళ. సాఽధారణ స్థితిలో కాకుండా అపసవ్య దిశలో ఇలాంటి బ్యాలెన్సింగ్‌ ప్రక్రియను ఇప్పుడు నేర్పుతున్నారు. రెండు చేతులు కిందకు పెట్టి కాళ్లను గాల్లో తేల్చి తలకిందులుగా ముందుకు నడవాలి. అలా నడిచేటప్పుడు బ్యాలెన్సింగ్‌ అదుపు తప్పకుండా ముందుకు వెళ్లాలి. అంతే కాకుండా.. గాల్లో కాసేపు తలకిందులుగా అలాగే నిల్చోవాలి. కాళ్లను కదిలించాలి. ముందుకు ఎంత వేగంగా వెళతామో వెనకకు అంతే వేగంగా కదలాలి. ఇలా చేయడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఈ వ్యాయామం అన్నికండరాలపై పనిచేస్తుంది. ఇలా 5 నుంచి 10 నిమిషాలు ఈ వ్యాయామం అలవాటు చేస్తున్నారు.


యోగా కోసం..

కరోనాలో యోగా ప్రాధాన్యం కూడా పెరిగింది. కొంతమంది జిమ్‌ నిర్వాహకులు కసరత్తుతో పాటు యోగాను నేర్పిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ట్రైనర్‌లను నియమించుకుంటున్నారు. జిమ్‌కు వచ్చే వారు తప్పనిసరిగా కొంత సమయం యోగా చేయాలని నిబంధన కూడా పెడుతున్నారు. ముఖ్యంగా సూర్యనమస్కారాలు, శ్వాసప్రక్రియ వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నారు.


క్రమపద్ధతిలో వ్యాయామం చేయాలి 

శరీరాన్ని కావాల్సిన ఆకృతిలో మలుచుకోవాలంటే క్రమ పద్ధతిలో వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఇప్పటి యువత సిక్స్‌ ప్యాక్‌ కావాలని కోరుకుంటుంది. ఇందుకు తగ్గట్టు వ్యాయామ పరికరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ పర్యవేక్షణలో ప్రతి రోజూ డైట్‌ మెయింటెన్‌ చేస్తూ వ్యాయామం చేస్తే సరిపోతుంది. ఇక అమ్మాయిలు నాజుకుగా రూపొందడానికి కొత్త టెక్నిక్‌లు అనేకం అందుబాటులోకి వచ్చాయి. ఓ చార్జ్‌ ప్రకారం వ్యాయామం చేస్తే బరువు తగ్గడం పెద్ద కష్టమేమి కాదు. అంతేకాకుండా ఇమ్యునిటీ పవర్‌ కూడా పెరుగుతోంది. - రాజుయాదవ్‌, బాడీబిల్డర్‌, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌.