America NRI తో పెళ్లంటూ ఈ Hyderabad Techie యువతి సంబరపడింది.. తీరా చూస్తే..

ABN , First Publish Date - 2021-09-03T19:09:30+05:30 IST

అమెరికాలో ఉండే ఎన్నారై అంటూ మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన ఓ కేటుగాడు హైదరాబాద్ మహిళకు ఏకంగా రూ. 21.70 లక్షలు కుచ్చుటోపి పెట్టిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

America NRI తో పెళ్లంటూ ఈ Hyderabad Techie యువతి సంబరపడింది.. తీరా చూస్తే..

హైదరాబాద్: అమెరికాలో ఉండే ఎన్నారై అంటూ మ్యాట్రిమోని వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన ఓ కేటుగాడు హైదరాబాద్ మహిళకు ఏకంగా రూ. 21.70 లక్షలు కుచ్చుటోపి పెట్టిన ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ భారీ మొత్తం దోచేశాడు. బాధితురాలు సైబర్‌క్రైం  పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సికింద్రాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేసే ఓ మహిళ ఇటీవల ఒక మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుంది. ఈ క్రమంలో నెల రోజుల కింద ఆ వెబ్‌సైట్ ద్వారా ఆమెకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. తన పేరు వంశీ క్రిష్ణ అని, అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు ఫోన్ నెంబర్లు కూడా మార్చుకున్న తర్వాత కొన్నిరోజులు బాగానే చాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరం అమెరికాలోనే సెటిల్ అవుదామని ఆమెను నమ్మించాడు వంశీ. 


ఇక వంశీ మాటలు నమ్మిన ఆమె.. పూర్తిగా అతని మాయలో పడిపోయింది. ఈ విషయం గ్రహించిన వంశీ ఓ ప్రణాళిక ప్రకారం ఆమె నుంచి రూ. 21.70 లక్షలు తన ఖాతాలో వేయించుకున్నాడు. వీసా కోసం దరఖాస్తు చేయాలని, దానికోసం ఖర్చు అవుతుందంటూ ఆమె నుంచి ఈ భారీ మొత్తాన్ని తీసుకున్నాడు. వంశీని నమ్మిన ఆమె వెనుకముందు ఆలోచించకుండా ఈ భారీ మొత్తాన్ని అతని బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఇంకేముంది.. ఆ తర్వాతి రోజు నుంచి వంశీ ఫోన్ స్వీచాఫ్ అయింది. దాంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-03T19:09:30+05:30 IST