హైదరాబాద్‌.. ‘టాప్‌’ లేపుతుందా?

ABN , First Publish Date - 2020-09-18T09:11:54+05:30 IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..ఐపీఎల్‌లో నిలకడగా సత్తా చాటే జట్లలో ఒకటి. డెక్కన్‌ చార్జర్స్‌ స్థానంలో 2013లో లీగ్‌లో ప్రవేశించిన సన్‌రైజర్స్‌ తొలి అడుగు ఘనంగా ..

హైదరాబాద్‌..  ‘టాప్‌’ లేపుతుందా?

గత ప్రదర్శన

2009 - విజేత 

(డెక్కన్‌ చార్జర్స్‌)

2016 - చాంపియన్‌

2018 - రన్నరప్‌


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..ఐపీఎల్‌లో నిలకడగా సత్తా చాటే జట్లలో ఒకటి. డెక్కన్‌ చార్జర్స్‌ స్థానంలో 2013లో లీగ్‌లో ప్రవేశించిన సన్‌రైజర్స్‌ తొలి అడుగు ఘనంగా వేసింది. ఆ సీజన్‌లో నాలుగో స్థానంలో నిలవడమేకాదు.. మరో మూడేళ్లలో ఏకంగా చాంపియన్‌గా నిలిచింది. దుర్భేద్యమైన టాప్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌తోపాటు తిరుగులేని పేస్‌, స్పిన్‌ బౌలింగ్‌తో అత్యంత బలీయంగా కనిపిస్తున్న ఈ జట్టు మిడిలార్డర్‌ కూడా రాణిస్తే మరో ట్రోఫీ అందుకోవడం కష్టం కాబోదు.


డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో విధ్వంసక బ్యాటింగ్‌తో అద్భుత ఆరంభం ఇస్తే దానిని కొనసాగించేందుకు కేన్‌ విలియమ్సన్‌ రూపంలో మరో గొప్ప బ్యాట్స్‌మన్‌ ఉండడం.. దానికి తోడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ మార్గదర్శనం, గత కోచ్‌ టామ్‌ మూడీ జట్టును నడిపిన విధానం.. వెరసి ఐపీఎల్‌లో హైదరాబాద్‌ తనదైన ముద్ర వేస్తోంది. నిరుడు విలియమ్సన్‌ సారథ్యంలో ఆడిన జట్టు ఈసారి మళ్లీ వార్నర్‌ కెప్టెన్సీలో బరిలోకి దిగుతోంది. 


బలం: ఓపెనింగ్‌ జోడీ వార్నర్‌, బెయిర్‌ స్టో సన్‌రైజర్స్‌కు అతిపెద్ద బలం. గత సీజన్‌లో వారి మెరుపు ఆరంభాలు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాయి. కాకపోతే ఆ శుభారంభాలను మిడిలార్డర్‌ ముందుకు తీసుకుపోలేకపోయింది. దాంతో ఈసారి వేలంలో మిడిలార్డర్‌ను పటిష్టం చేసుకొనే లక్ష్యంతో విరాట్‌ సింగ్‌, ప్రియం గార్గ్‌, జమ్మూ కశ్మీర్‌కు చెందిన అబ్దుల్‌ సమద్‌ వంటి యువ క్రికెటర్లను ఎంచుకుంది. బౌలింగ్‌ విభాగానికొస్తే పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌ భువనేశ్వర్‌ కుమార్‌, మేటి స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌తో తిరుగులేకుండా ఉంది. వారికి ఖలీల్‌ అహ్మద్‌, సిద్దార్థ్‌ కౌల్‌, బిల్లీ స్టాన్‌లేక్‌ మద్దతిస్తే హైదరాబాద్‌కు తిరుగుండకపోవచ్చు.


బలహీనత: మిడిలార్డర్‌లో అనుభవజ్ఞులైన బ్యాట్స్‌మెన్‌ లేకపోవడం జట్టుకు మైనస్‌. ఆ లోటును అధిగమించేందుకు ఈసారి టీమిండియా ఆటగాళ్లను ఎంచుకుంది. అయితే యువ క్రికెటర్లు ఒత్తిడిని తట్టుకొని అంచనాలను అందుకుంటారా లేదా అన్నది చూడాలి. ఆసీస్‌ ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ను రూ. 2 కోట్లతో కొనుగోలు చేసింది. కానీ టాప్‌ ఆర్డర్‌తోపాటు ప్రధాన స్పిన్నర్‌ విదేశీ క్రికెటర్లే అయినందున మార్ష్‌కు తుది జట్టులో చోటు లభించడం ప్రశ్నార్థకం. మిడిల్‌లో మనీష్‌ పాండే ఉన్నా..అతడు స్థాయికితగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. 


హైదరాబాద్‌ జట్టు

స్వదేశీ ఆటగాళ్లు: మనీష్‌ పాండే, అభిషేక్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌, ఖలీల్‌ అహ్మద్‌, వృద్ధిమాన్‌ సాహా, విజయ్‌ శంకర్‌, నటరాజన్‌, విరాట్‌ సింగ్‌, ప్రియంగార్గ్‌, సందీప్‌ బవనాక, షాబాజ్‌ నదీం, శ్రీవత్స గోస్వామి, బాసిల్‌ థంపి, అబ్దుల్‌ సమద్‌, సంజయ్‌ యాదవ్‌.


విదేశీ ఆటగాళ్లు: డేవిడ్‌ వార్నర్‌ (కెప్టెన్‌), బెయిర్‌ స్టో, కేన్‌ విలియమ్సన్‌, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ, బిల్లీ స్టాన్‌లేక్‌, ఫాబియన్‌, మిచెల్‌ మార్ష్‌.

Updated Date - 2020-09-18T09:11:54+05:30 IST