గులాబీ జెండా.. సిటీ నిండా..

ABN , First Publish Date - 2022-04-28T17:23:57+05:30 IST

గులాబీ శ్రేణుల సందడితో మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో పండగ వాతావరణం ఏర్పడింది.

గులాబీ జెండా.. సిటీ నిండా..

హైదరాబాద్‌ సిటీ : గులాబీ శ్రేణుల సందడితో మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో పండగ వాతావరణం ఏర్పడింది. ప్లీనరీకి తరలివచ్చిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో గులాబీమయంగా మారింది.  నిర్ణీత సమాయానికి సభాస్థలికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ తన ప్రసంగంతో శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ముఖ్య నాయకుల రాక సందర్భంగా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. కాలనీలు, డివిజన్లు, బస్తీలలో కూడా టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు జరిగాయి.


ప్లీనరీలో ఎన్నారై ప్రతినిధులు..

టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేష్‌ బీగాలతో పాటు వివిధ దేశాల ఎన్నారై ప్రతినిధులు పాల్గొన్నారు. యూకే, యూఎ్‌సఏ, ఆస్ట్రేలియా, బహ్రెయిన్‌, మలేషియా, దక్షిణ ఆఫ్రికా, టాంజానియా, మారిషస్‌, జాంబియా, నార్వే, ఖతార్‌, ఫిలిపైన్స్‌, చైనా, జర్మనీ, ఒమన్‌ తదితర దేశాల ఎన్నారైలు హాజరయ్యారు.


ఆవిర్భావం.. ఖుషీగా గులాబీ..

టీఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బుధవారం గ్రేటర్‌లో ఘనంగా జరిగాయి. డివిజన్ల వారీగా బస్తీలు, కాలనీల్లో నేతలు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ పాటలు, డప్పు దరువుల మధ్య నృత్యాలు చేసి ఆనందం వ్యక్తం చేశారు. దేశ్‌ కి నేత కేసీఆర్‌ అంటు నినాదాలు చేశారు. ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో నగరం గులాబీమయంగా మారింది.


40 ఫీట్ల పార్టీ జెండా ఆవిష్కరణ

తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన 40 ఫీట్ల టీఆర్‌ఎస్‌ జెండాను మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవిష్కరించారు. కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు తినిపించారు. తెలంగాణ పాటలు, బాణాసంచా పేలుళ్లు, కార్యకర్తల చిందులతో తెలంగాణ భవన్‌ సందడిగా మారింది. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొన్నారు.


- సీఎం కేసీఆర్‌ను చూడగానే ప్రతినిధులు ‘దేశ్‌ కి నేత కేసీఆర్‌.. ఆప్‌ ఆగే బడావో.. హమ్‌ తుమారే సాత్‌ హై’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. 

- ఉదయం 11.12 గంటలకు సెక్రటరీ జనరల్‌ కే. కేశవరావు స్వాగతోపన్యాసం చేశారు.

- అనంతరం 11.18 గంటల నుంచి 12.35 వరకు 1.17 గంటలపాటు కేసీఆర్‌ ప్రసంగించారు.  

- ఉదయం 11.12 గంటలకు మొదలైన ప్లీనరీ రాత్రి 8.15 గంటలకు ముగిసింది. మొత్తం 13 తీర్మానాలు ఆమోదించారు. 

- సంసద్‌ ఆదర్శ గ్రామ యోజనలో మొదటి పది స్థానాలకు పది, 20 గ్రామాల్లో 19 తెలంగాణ నుంచి ఉండడాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించిన కేసీఆర్‌.. - పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును అభినందించారు. అనంతరం కేసీఆర్‌ను మంత్రి ఎర్రబెల్లి శాలువాతో సత్కరించారు.  

- తన ప్రసంగంలో కేసీఆర్‌ దేశ రాజకీయాలను ప్రస్తావించినప్పుడు సభా ప్రాంగణంలో హర్షధ్వానాలు వెల్లువెత్తాయి.

- తీర్మానాలు ప్రవేశపెట్టే సమయంలో కేసీఆర్‌ దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని నేతలు కోరినప్పుడు సభికుల నుంచి విశేష స్పందన కనిపించింది. 

- సభా ప్రాంగణంలోకి వచ్చిన కేటీఆర్‌, హరీశ్‌ రావుతో ఫొటోలు దిగేందుకు నాయకులు, కార్యకర్తలు పోటీ పడ్డారు. 

- తీర్మానాన్ని బలపరుస్తూ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ రెండు కథలు చెప్పారు. దీంతో కేసీఆర్‌తో పాటు సభికులంతా పగలబడి నవ్వారు.  

- ప్రధాన వేదిక పక్కన కళాకారుల కోసం వేదిక ఏర్పాటు చేసినా పాటలు పాడే అవకాశం వారికి దక్కలేదు. 


- సాయంత్రం 5.30 గంటల తర్వాత వక్తలు సుదీర్ఘంగా ప్రసంగిస్తుండగా ముగించాలంటూ సభికులు చప్పట్లు కొడుతూ, ఈలలు వేశారు.  

- రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతుండగా సభికులు చప్పట్లు కొట్టడంతో ప్రసంగం ముగించమని చెప్పాలని కేసీఆర్‌.. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సూచించారు. పల్లా సంజ్ఞతో తీర్మానాన్ని బలపర్చకుండానే వెంకట్రామిరెడ్డి ప్రసంగాన్ని ముగించారు. దీంతో తీర్మానాన్ని బలపరుస్తున్నవా..? లేదా..? అని కేసీఆర్‌ చమత్కరించారు.  

- తీర్మానాలు ప్రవేశపెట్టిన వారి ప్రసంగాలను కేసీఆర్‌ ఆసక్తిగా విన్నారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై వారు మాట్లాడిన తీరును ప్రశంసించారు.

- సీనియర్‌ పాత్రికేయులు టంకశాల అశోక్‌ వ్యాసాలతో ముద్రించిన ఆరోహణ సంకలనాన్ని కేసీఆర్‌ వేదికపై ఆవిష్కరించారు. 

- కేన్సర్‌ను జయించిన అనుముల పద్మ సంతోష్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వ ప్రస్థానంపై రాసిన పాటల సీడీని సీఎం ఆవిష్కరించారు.   

- సాయంత్రం స్నాక్స్‌గా సర్వపిండి, నువ్వుల ముద్ద, బూందీ లడ్డు ఇచ్చారు.


టెక్‌.. టీఆర్‌ఎస్‌

ప్లీనరీ ప్రాంగణంలో టీఆర్‌ఎస్‌ టెక్‌ సెల్‌ ఏర్పాటు చేసిన స్టాల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీఆర్‌ఎస్‌ ప్రస్థానం, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ప్రదర్శితమయ్యేలా డిజిటల్‌ డిస్‌ ప్లే ఏర్పాటు చేశారు. ప్లీనరీకి వచ్చిన ప్రతినిధులకు కరపత్రంతోపాటు.. క్యూఆర్‌ కోడ్‌ ఉన్న కేలండర్‌ను ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆన్‌లైన్‌ ఖాతాలతోపాటు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టా ఖాతాల క్యూ ఆర్‌ కోడ్‌లూ కరపత్రంలో ఉన్నాయి. కేటీఆర్‌కు ఎంత మంది ఫాలోవర్లు ఉనారన్న విషయాన్నీ పొందుపర్చారు. అత్యధికంగా ట్విట్టర్‌లో కేటీఆర్‌కు 33.65 లక్షలు, ఫేస్‌ బుక్‌లో 10.71 లక్షలు, ఇన్‌స్టాలో 8.87 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. మినరల్‌ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మన్నె క్రిశాంక్‌, టీఎ్‌సటీఎస్‌ ఛైర్మన్‌ జగన్‌లతోపాటు ప్రతినిధులు టెక్‌సెల్‌ అప్‌లోడ్‌ చేసే వీడియోలు ఎలా చూడాలన్నది చెప్పారు. 

Updated Date - 2022-04-28T17:23:57+05:30 IST