మిగులు బస్సులు ఏం చేద్దాం? విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తగ్గనున్న సర్వీసులు..

ABN , First Publish Date - 2020-10-28T15:54:13+05:30 IST

అన్‌లాక్‌ తరువాత ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య ఏర్పడిన ఇంటర్‌ స్టేట్‌ వివాదం కారణంగా విజయవాడ - హైదరాబాద్‌ రూట్‌లో బస్సులు..

మిగులు బస్సులు ఏం చేద్దాం? విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తగ్గనున్న సర్వీసులు..

విశాఖ, రాయలసీమ సెక్టార్లకు నడిపితే సరి

నష్టాల నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చు

ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ అధికారుల కసరత్తులు 


ఆంధ్రజ్యోతి, విజయవాడ: అన్‌లాక్‌ తరువాత ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య ఏర్పడిన ఇంటర్‌ స్టేట్‌ వివాదం కారణంగా విజయవాడ - హైదరాబాద్‌ రూట్‌లో బస్సులు నిలిచిపోయాయి. మా బస్సులు ఏపీలో ఎన్ని కిలోమీటర్లు తిరిగితే మీరు కూడా తెలంగాణలో అన్నే తిప్పాలంటూ తెలంగాణ ఆర్టీసీ మెలిక పెట్టింది. కావాలంటే మీరు కూడా తిప్పుకోవచ్చంటూ ఏపీ అధికారులు సూచించినా వెనక్కి తగ్గలేదు. దీంతో ఏపీ అధికారులే వెనక్కి తగ్గి తెలంగాణ అధికారులు చెప్పినదానికి అంగీకారం తెలిపే అవకాశం ఉంది. ఈ కారణంగా మిగిలిపోయిన బస్సులను ఏం చేయాలన్న నేపథ్యంలో విశాఖ, రాయలసీమ సెక్టార్లలో తిప్పి నష్టాలు పూడ్చుకోవచ్చనే ఆలోచనతో ఆదిశగా  కసరత్తులు ప్రారంభించారు. 


హైదరాబాద్‌ రూట్‌లో నడిచే బస్సుల్లో విజయవాడ నుంచి ఎక్కువగా ఉంటాయి. కానీ తెలంగాణ ఆర్టీసీ పెట్టిన కండిషన్‌తో హైదరాబాద్‌కు బస్సులు తగ్గించుకుంటే మిగిలిపోయిన బస్సులను ఏ రూట్‌లో నడపాలన్న దానిపై ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ అధికారులు అంతర్గతంగా కసరత్తులు ప్రారంభించారు. విజయవాడ - హైదరాబాద్‌ రూట్‌కి ఉన్న డిమాండ్‌ రాష్ట్రంలో ఏ రూట్లోనూ లేదు. ప్రస్తుతం తప్పనిసరి పరిస్థితుల్లో నష్టాలు పూడ్చుకునేందుకు అటువంటి రూట్లపై అధికారులు దృష్టి సారించారు. విశాఖపట్నం రూట్‌లో ప్రైవేటు మోనోపలీ నడుస్తున్నందున దాన్ని బ్రేక్‌ చేసేందుకు అటువైపు బస్సులు పెంచాలని, అలాగే రాయలసీమ సెక్టార్‌లోనూ పెంచుకుని నష్టాన్ని తగ్గించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ అధికారులతో రెండు, మూడు రోజుల్లో అగ్రిమెంట్‌ జరిగే అవకాశం కనిపిస్తున్నా ఏపీ లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవాలి. అంటే 400 బస్సుల వరకు హైదరాబాద్‌ రూట్‌ నుంచి తప్పుకోవాలి. గతంలో షెడ్యూల్‌ బస్సులతో పాటు, వారాంతాల్లో కొవిడ్‌కు ముందు స్పెషల్స్‌ ఎక్కువగా నడిచేవి.


రాష్ట్రవ్యాప్తంగా 400 బస్సులను తగ్గించుకుంటే ఎంత లేదన్నా విజయవాడ నుంచి 50 నుంచి 75 బస్సుల వరకు తగ్గించుకునే పరిస్థితి రావచ్చు! దీంతో అధికారులు ముందు చూపుతో మేథోమథనం చేస్తున్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం ఎం నాగేంద్ర ప్రసాద్‌, డీసీటీఎంలు జాన్‌ సుకుమార్‌, సత్యనారాయణతో సమాలోచ నలు చేస్తున్నారు. కొవిడ్‌ అనంతరం విశాఖ రూట్‌లో ‘ఆర్టీసీ’ కృష్ణా రీజియన్‌ అధికారులు బస్సులను పెంచుతూ వస్తున్నారు. అటువైపు ప్రైవేటు ఆపరేటర్లకు మోనోపలీగా ఉన్న విశాఖ రూట్‌లో నేనున్నానంటూ ఆర్టీసీ కూడా కాలు మోపుతోంది. హైదరాబాద్‌ రూట్‌లో నడిపే బస్సులన్నీ హై ఎండ్‌ బస్సులు. ఇవి సౌకర్య వంతంగా ఉంటాయి. వీటిని విశాఖ రూట్‌లో నడిపితే ఆదరణ పెరిగే అవకాశం ఉంది. ప్రైవేట్‌ ఆపరేటర్లు స్లీపర్‌ బస్సులు ఎక్కువుగా నడుపు తున్నారు. కానీ ఆర్టీసీ వద్ద స్లీపర్‌ బస్సులు పరి మితంగానే ఉన్నాయి. ప్రస్తుతం విశాఖకు తిప్పే బస్సుల్లో పాత వాటిని హైదరాబాద్‌ రూట్‌లో తగ్గించుకున్న వాటితో రీ ప్లేస్‌ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని భావిస్తున్నారు.


ప్రతి ఏడాది ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 400 బస్సుల వరకు కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం తగ్గించుకున్న బస్సుల వల్ల పాత వాటి స్థానంలో రీ ప్లేస్‌ చేసుకోవటానికి తగ్గించుకున్న బస్సులు సరిపోతాయని భావిస్తున్నారు. ఒకవేళ కొత్తవి కొన్నా అదనంగా సమకూరుతాయే కానీ నష్టం లేదంటున్నారు. అలాగే విశాఖపట్నం తర్వాత రాయలసీమ సెక్టార్‌ వైపు మరిన్ని బస్సులు పెట్టాలని భావిస్తున్నారు. ప్రధానంగా తిరుపతికి బస్సులు పెంచనున్నారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప తదితర ప్రాంతాలకు బస్సుల సంఖ్యను రెట్టింపు చేయాలని భావిస్తున్నారు.


ఆనందం ఒక్కరోజుతోనే సరి!

తిరుగు ప్రయాణంలో స్పెషల్స్‌ బయటకు తీశామన్న ఆర్టీసీ అధికారుల ఆనందం ఒక్క రోజుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సోమవారం మొదటిసారిగా 50 స్పెషల్‌ బస్సులను బయటకు తీశారు. రాజమండ్రి, విశాఖపట్నం రూట్లలో డిమాండ్‌ కారణంగా 40 స్పెషల్స్‌ను నడిపారు. మంగళవారం మాత్రం సాధారణ పరిస్థితి. పూర్తిస్థాయిలో ఆక్యుపెన్సీ లేక ఒక్క స్పెషల్‌ బస్సు తీయలేదు. కేవలం 29 షటిల్‌ బస్సులను మాత్రమే నడిపారు. ఈ బస్సులన్నింటా కలిపితే 300 లోపు ప్రయాణికులు మాత్రమే వెళ్లారని అధికారులు చెబుతున్నారు.



Updated Date - 2020-10-28T15:54:13+05:30 IST