సొంత కార్యాలయాలకు నో!

ABN , First Publish Date - 2021-10-21T07:50:05+05:30 IST

సొంతంగా కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకోవడం లేదా సొంత భవనంలో కార్యాలయాలను ఏర్పాటు చేయడం కంటే..

సొంత కార్యాలయాలకు నో!

కో-వర్కింగ్‌, మేనేజ్డ్‌ ఆఫీస్‌ స్పేస్‌ వైపు కంపెనీలు మొగ్గు

విస్తరణ కోసం హైదరాబాద్‌కు క్యూ

స్కూటర్‌ గ్లోబల్‌ కంట్రీ హెడ్‌ రజత్‌ జోహార్‌


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సొంతంగా కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకోవడం లేదా సొంత భవనంలో కార్యాలయాలను ఏర్పాటు చేయడం కంటే.. కో వర్కింగ్‌ స్పేస్‌, మేనేజ్డ్‌ ఆఫీస్‌ స్పేస్‌లో కార్యకలాపాలను ప్రారంభించడానికి కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. కొవిడ్‌ తర్వాత ఈ ధోరణి బాగా పెరిగిందని.. పెద్ద, బహుళ జాతి కంపెనీలు ప్రస్తుతం ఎక్కువగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయని స్కూటర్‌ గ్లోబల్‌ కంట్రీ హెడ్‌ రజత్‌ జోహార్‌ అంటున్నారు. ఖరీదైన మేనేజ్డ్‌ ఆఫీస్‌ స్పేస్‌ను కంపెనీలకు స్కూటర్‌ ఆఫర్‌ చేస్తోంది. తాజాగా స్కూటర్‌ గ్లోబల్‌ హైదరాబాద్‌ మార్కెట్లోకి ప్రవేశించి మేనేజ్డ్‌ ఆఫీస్‌ స్పేస్‌ సేవలను ప్రారంభించింది. ఈ సందర్భంగా రజత్‌ జోహార్‌ ‘ఆంఽధ్రజ్యోతి’తో ఇష్ఠాగోష్ఠిగా ముచ్చటించారు. ఆ వివరాలు...


కో-వర్కింగ్‌ స్పేస్‌ వైపు కంపెనీలు మొగ్గు చూపడానికి కారణం ఏమిటీ?

కంపెనీలు లైట్‌ అసెట్‌ విధానాన్ని అనుసరిస్తున్నాయి. స్థిరాస్తులు, ఆఫీసు కార్యాలయం సొం తంగా లీజుకు తీసుకోవడం వంటి వాటిపై పెట్టుబడులు పెట్టే కంటే ఆ నిధులను వ్యాపారాభివృద్ధి కార్యకలాపాలకు మళ్లించాలని భావిస్తున్నాయి. కో-వర్కింగ్‌, మేనేజ్డ్‌ ఆఫీస్‌ స్పేస్‌ వల్ల తక్కువ వ్యయంతో ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా కార్యాలయ స్థలాన్ని పొందొచ్చు. ఫ్లెక్సిబులిటీ ఉంటుంది. నిర్వహణ, ఇతర సేవల బాధ్యత ఉండదు. అందుకే కంపెనీలు ఈ విధానం వైపు మొగ్గు చూపుతున్నాయి.  


భవిష్యత్తులో గిరాకీ ఎలా ఉంటుంది?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌లోని కొన్ని ఇబ్బందుల వల్ల కంపెనీలు మళ్లీ ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించాలని భావిస్తున్నాయి. జనవరి, ఆ తర్వాత ఉద్యోగులు దశల వారీగా కార్యాలయాలకు వచ్చి పని చేసే వీలుంది. అందువల్ల కో-వర్కింగ్‌, మేనేజ్డ్‌ ఆఫీస్‌ స్పేస్‌కు గిరాకీ పెరుగుతుంది. కొవిడ్‌కు ముందు 6 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్‌ స్పేస్‌ వినియోగంలో ఉంది. 


హైదరాబాద్‌లో అడుగుపెట్టడానికి కారణం?

హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమకు కేంద్రంగా ఉంది. బెంగళూరులోని చాలా కంపెనీలు విస్తరణకు హైదరాబాద్‌ వస్తున్నాయి. ఇక్కడ మౌలిక సదుపాయాలు బాగా ఉన్నాయి. నిపుణుల లభ్యత ఉంది. అందుకే హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించాం.


కంపెనీలతో ఒప్పందాలు?

మేనేజ్డ్‌ ఆఫీస్‌ స్పేస్‌ను అందించడానికి ప్రస్తు తం నాలుగు బహుళ జాతి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. కార్పొరేట్‌ క్లయింట్లే మా లక్ష్యం. కొద్ది నెలల్లో 80-90 శాతం ఆక్యుపెన్సీని అంచనా వేస్తున్నాం. హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలే అధికంగా ఉన్నందున మా ఖాతాదారుల్లో వీరే ఉంటారు. ఫారెస్ట్‌ థీమ్‌తో ఏర్పాటు చేసిన ‘స్కూటర్‌ ఫారె్‌స’్టలో 800 మంది నుంచి 2,000 మంది వరకూ కూర్చుని పని చేయొచ్చు. ఆయా కంపెనీల ఉద్యోగులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను స్కూటర్‌ కల్పిస్తుంది. కంపెనీలతో 3 నుంచి 6 ఏళ్ల వరకూ అమలులో ఉండే విధంగా ఒప్పందం కుదుర్చుకుంటాం.   


స్కూటర్‌ ప్రణాళికలు?

హైటెక్‌ సిటీలో ‘స్కూటర్‌ ఫారెస్ట్‌’ పేరుతో సదుపాయాన్ని ప్రారంభించాం. డల్లాస్‌ సెంటర్‌, మైహోమ్‌ ట్విజాల్లో సదుపాయాలు ఏర్పాటు చేశాం. మొత్తం 3.25 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని కంపెనీలకు అద్దెకు ఇవ్వనున్నాం. ప్రస్తుతం ఢిల్లీ, గురుగ్రామ్‌, జయపురలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌తో సహా మొత్తం 5.37 లక్షల  చదరపు అడుగుల కార్యాలయ స్థలం ఉంది. అంటే సగానికి పైగా హైదరాబాద్‌లోనే ఉంది. వచ్చే  రెండేళ్లలో హైదరాబాద్‌లో 10 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని సమకూర్చుకుంటాం. 

Updated Date - 2021-10-21T07:50:05+05:30 IST